Helicopter Crash | మరో ఘోరం.. ఉత్తరాఖండ్‌లో హెలికాప్టర్ కుప్పకూలి ఏడుగురు మృతి
Helicopter Crash | ఉత్తరాఖండ్( Uttarakhand )లో ఘోర ప్రమాదం జరిగింది. కేదర్‌నాథ్ ధామ్(Kedarnath Dham ) నుంచి గుప్తా కాశీ( Guptkash ) వెళ్తున్న హెలికాప్టర్(Helicopter )అడవిలో కుప్పకూలింది.

Helicopter Crash | డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్( Uttarakhand )లో ఘోర ప్రమాదం జరిగింది. కేదర్‌నాథ్ ధామ్(Kedarnath Dham ) నుంచి గుప్తా కాశీ( Guptkash ) వెళ్తున్న హెలికాప్టర్(Helicopter )అడవిలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదానికి గురైన హెలికాప్టర్‌ను ఆర్యన్ ఏవియేషన్( Aryan Aviation ) సంస్థకు చెందినదిగా అధికారులు గుర్తించారు. గౌరీకుంద్ – సోన్‌ప్రయాగ్ మధ్య ఉన్న అడవుల్లో హెలికాప్టర్ కుప్పకూలినట్లు తెలిపారు.
ఈ ప్రమాదం ఆదివారం తెల్లవారుజామున 5:20 గంటలకు జరిగినట్లు తెలిపారు. ఈ హెలికాప్టర్‌లో ఆరుగురు భక్తులు వెళ్తున్నట్లు పేర్కొన్నారు. భక్తుల్లో ఒక చిన్నారి ఉంది. ఈ ప్రమాద ఘటనను ఉత్తరాఖండ్ సివిల్ ఏవియేషన్ డెవలప్‌మెంట్ అథారిటీ ధృవీకరించి, అధికారిక ప్రకటన చేసింది. హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో చనిపోయిన భక్తులు ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్‌కు చెందిన వారని అధికారులు తేల్చారు. అయితే హెలికాప్టర్ కుప్పకూలడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. సాంకేతిక సమస్య వల్ల కూలిందా..? లేక వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడమా..? అన్నది తేలాల్సి ఉంది.
అడవుల్లో మేతకు పశువులను తీసుకెళ్లిన కాపరులు హెలికాప్టర్ కూలడాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు పోలీసులు, అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.