పాకిస్థాన్‌లో రైలుపై ఆత్మాహుతి దాడి..24 మంది మృతి

పాకిస్థాన్‌లో జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌పై ఆత్మాహుతి దాడి చోటుచేసుకుంది. క్వెట్టా ప్రాంతంలోని చమన్ ఫాటక్ రైల్వేస్టేషన్‌ సమీపంలో ఆదివారం ఉదయం జరిగిన భారీ పేలుడు ఘటనలో 24 మంది ప్రాణాలు కోల్పోగా.. 80మందికి పైగా గాయపడ్డారు. రైలులో ప్రయాణిస్తున్న పాక్ సైనికులను లక్ష్యంగా చేసుకుని బలోచ్ లిబరేషన్ ఆర్మీ ఈ దాడికి పాల్పడింది.

పాకిస్థాన్‌లో రైలుపై ఆత్మాహుతి దాడి..24 మంది మృతి

విధాత : పాకిస్థాన్‌లో జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌పై ఆత్మాహుతి దాడి చోటుచేసుకుంది. క్వెట్టా ప్రాంతంలోని చమన్ ఫాటక్ రైల్వేస్టేషన్‌ సమీపంలో ఆదివారం ఉదయం జరిగిన భారీ పేలుడు ఘటనలో 24 మంది ప్రాణాలు కోల్పోగా.. 80మందికి పైగా గాయపడ్డారు. ఆర్మీ జవాన్లు, వారి కుటుంబ సభ్యులతో ప్రయాణిస్తున్న జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ స్టేషన్‌ సమీపంలోని సిగ్నల్‌ దాటుతుండగా.. పేలుడు పదార్థాలతో ఉన్న వాహనం రైలు బోగీని ఢీకొట్టినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో పేలుడు సంభవించిందన్నారు. మృతుల్లో ఎక్కువమంది సైనికులే ఉన్నారని తెలిపారు.

పాక్ సైనికులే లక్ష్యంగా దాడులు

పేలుడు దాటికి రైలు పాక్షకంగా దెబ్బతినగా.. 10కి పైగా వాహనాలు దగ్ధమయ్యాయి. దగ్గర్లోని ఇళ్ల కిటికీల అద్దాలు ధ్వంసమయ్యాయి.ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రైల్వే స్టేషన్‌ సమీపంలో పేలుడు చోటుచేసుకోవడంతో రైళ్ల రాకపోకల్లో అంతరాయం కలిగినట్లు అధికారులు వెల్లడించారు. క్వెట్టా నుంచి పెషావర్ వెళ్లే జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను స్టేషన్‌లో నిలిపివేసినట్లు తెలిపారు. జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌కు కొన్నేళ్లుగా బలోచ్‌ రెబల్స్‌, తెహ్రీకే తాలిబన్‌ పాకిస్థాన్‌ (టీటీపీ) గ్రూప్‌ తిరుగుబాటుదారుల నుంచి దాడుల ముప్పు కొనసాగుతుంది. ఈ రైల్లో తరచూ సైనిక దళాలను క్వెట్టా నుంచి పంజాబ్‌కు తరలిస్తుండటంతో పాక్ సైనికులను లక్ష్యంగా చేసుకున్న వేర్పాటువాద సంస్థలు ఈ రైలుపై తరచూ దాడులు చేస్తున్నాయి. 2018, 2023, 2024, 2025లలో ఈ రైలుపై దాడులు జరుగడం గమనార్హం.

దాడి మా పనే : బలోచ్ లిబరేషన్ ఆర్మీ

జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ పై దాడి ఘటన తమ పనేనని బలోచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) ప్రకటించింది. క్వెట్టా కంటోన్మెంట్ నుంచి పాక్‌ దళాల సిబ్బందిని తీసుకువెళ్తున్న రైలును లక్ష్యంగా చేసుకున్నామని బలోచ్‌ ఆర్మీ ప్రతినిధి జీయాండ్ బలోచ్ వెల్లడించారు. బలోచ్‌ ఆర్మీలోని మహిళా షైనాజ్ బలోచ్ ఓ వీడియోలో మాట్లాడుతూ.. పాక్‌ నేతలు తమ ప్రజలను అణచివేస్తున్నారని ఆరోపించారు. తమ సంస్కృతి, గుర్తింపు, హక్కులను కాలరాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అణచివేతకు గురైన ప్రతి బలోచ్ బిడ్డ తన మాతృభూమి విముక్తి కోసం ప్రాణాలను సైతం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాడని ఆమె పేర్కొన్నారు.