ఆ విద్యార్థి చావుకు భారీ పరిహారం… చనిపోయిన మూడేళ్లకు న్యాయం

అమెరికా దేశ చరిత్రలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన విదేశీ విద్యార్థికి ఈ మద్యకాలంలో ఇంత భారీ పరిహారం చెల్లించలేదు. ఐదు కోట్లు లేదా పది కోట్ల రూపాయలు కాదు రెండు వందల యాభై కోట్లకు పైబడి చెల్లిస్తున్నారు. ప్రమాదం జరిగిన మూడు సంవత్సరాల తరువాత ఆ విద్యార్థికి న్యాయం జరిగింది

అమెరికా దేశ చరిత్రలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన విదేశీ విద్యార్థికి ఈ మద్యకాలంలో ఇంత భారీ పరిహారం చెల్లించలేదు. ఐదు కోట్లు లేదా పది కోట్ల రూపాయలు కాదు రెండు వందల యాభై కోట్లకు పైబడి చెల్లిస్తున్నారు. ప్రమాదం జరిగిన మూడు సంవత్సరాల తరువాత ఆ విద్యార్థికి న్యాయం జరిగింది. గత శుక్రవారం అమెరికాలోని కింగ్ కౌంటి సుపీరియర్ కోర్టులో ఇరు పక్షాలు పరిష్కార నోటీసు దాఖలు చేయడంతో సమస్యకు ముగింపు లభించందంటున్నారు. సుదీర్ఘ న్యాయ పోరాటం, చర్చల తరువాత విద్యార్థి కుటుంబానికి గొప్ప స్వాంతన లభించింది.
ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన కందుల జాహ్నవి (23) ఉన్నత విద్యను అభ్యసించేందుకు అమెరికా వెళ్లారు. సౌత్ లేక్ యూనియన్ లోని నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీలో మాస్టర్ డిగ్రీ చదువుతోంది. జనవరి 2023లో సియాటెల్ లో రోడ్డు దాటుతుండగా పోలీసు వాహనం బలంగా ఢీకొట్టింది. సియాటెల్ పోలీసు అధికారి కెవిన్ డేవ్, జహ్నావిని వేగంగా ఢీకొట్టడంతో దూరం ఎగిరిపడింది. తీవ్ర గాయాల పాలు కావడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. కాని రోడ్డుపై వేగ పరిమితి గంటకు 40 కిలోమీటర్లు కాగా కెవిన్ 119 కిలోమీటర్ల వేగంతో వాహనం నడిపినట్లు విచారణలో రుజువు అయ్యింది. ప్రమాదం జరిగిన తరువాత ఆయన చేసిన నోటి దురుసు వ్యాఖ్యలు అమెరికాతో పాటు భారత్ లో తీవ్ర దుమారం రేపాయి. సాధారణ మహిళ మరణించారని, ప్రాణానికి విలువ లేదని నవ్యుతూ చేసిన పరుష వ్యాఖ్యలు ఆయన బాడీ కెమెరాలో రికార్డు అయ్యాయి. పోలీసు ఆఫీసర్ ప్రమాదానికి పాల్పడ్డమే కాకుండా ప్రాణాలు తీసి ఒక విద్యార్థి పట్ల అపహాస్యం చేసేలా చేసిన వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం అప్పట్లోనే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ అమానుష ఘటనపై లోతైన దర్యాప్తు చేయాలని అక్కడి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.

విచారణలో పోలీసు అధికారి తప్పు చేసినట్లు తేలడంతో ఆయనను విధుల నుంచి తొలగిస్తూ స్థానిక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నిర్లక్ష్యంగా వాహనం నడపడం, వ్యక్తిగతంగా దూషించడంతో 5వేల డాలర్లు జరిమానా విధించారు. అయితే ఆయనపై నేర అభియోగం మోపేందుకు కింగ్ కౌంటీ ప్రాసిక్యూటర్లు నిరాకరించారు. సియాటెల్ రోడ్డు ప్రమాద ఘటనలో చనిపోయిన తమ బిడ్డకు న్యాయం చేయాలని తల్లిదండ్రులు సియాటెల్ లో న్యాయ పోరాటం చేశారు. ఈస్టర్న్ యూనివర్సిటీ లో ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ లోమాస్టర్స్ డిగ్రీ చేస్తున్న తమ కుమార్తె చదువు 2023 డిసెంబర్ లో పూర్తి కావాల్సి ఉండగా, 2023 జనవరి 23 జరిగిన దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిందని విన్నవించారు. తల్లిదండ్రులు చేసిన న్యాయ పోరాటం మూడేళ్ల తరువాత ఎట్టకేలకు ఫలించింది. భారీ పరిహారం చెల్లించేందుకు వీలుగా ఒప్పందం కుదుర్చుకునేందుకు ఇరు పక్షాలు కింగ్ కౌంటి సుపీరియర్ కోర్టులో పరిష్కార నోటీసులు సమర్పించాయి. ఇరు పక్షాలు సమర్పించిన అగ్రిమెంట్ పత్రాలను పరిశీలించి ఆమోదముద్ర వేసింది. సియాటెల్ సిటీ బాధిత విద్యార్థి కుటుంబానికి 29 యూఎస్ మిలియన్ డాలర్లు (రూ.262 కోట్లు) చెల్లించేందుకు అంగీకారం తెలిపింది.

ఈ మొత్తాన్ని జాహ్నావి తల్లిదండ్రులకు అందచేయనున్నారు. విద్యార్థి జాహ్నావి మరణం విషాదకరమని, ఆ పరిహారం ఆమె కుటుంబానికి కొంత ఓదార్పునిస్తుందని సియాటెల్ సిటీ న్యాయవాది ఎరికా ఎవాన్స్ ఒక ప్రకటనలో వెల్లడించారు. అయితే జాహ్నావి తరఫు న్యాయవాది ఇంత వరకు అధికారికంగా స్పందించలేదు.

Latest News