విధాత : కాంగ్రెస్, సీపీఐ మిత్ర బంధానికి పరీక్షగా మారిన కొత్తగూడెం కార్పోరేషన్ మేయర్ పదవిపై ఎట్టకేలకు రెండు పార్టీలు ఓ ఒప్పందానికి వచ్చాయి. కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ పదవిని చెరో రెండున్నరేళ్లు పంచుకునేలా కాంగ్రెస్, సీపీఐలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. మొదటి రెండున్నరేళ్లు మేయర్ పదవి సీపీఐకి, డిప్యూటీ మేయర్ పదవి కాంగ్రెస్ తీసుకోవాలని, ఆ తర్వాత రెండున్నరేళ్లు కాంగ్రెస్ మేయర్ పదవి, సీపీఐ డిప్యూటీ మేయర్ పదవి తీసుకోవాలని రెండు పార్టీలు నిర్ణయించుకున్నాయి.దీంతో మేయర్ పదవిపై కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది.
కొత్తగూడెం కార్పొరేషన్‌లో మొత్తం 60 డివిజన్లు ఉండగా, కాంగ్రెస్‌కు 22, సీపీఐకి 22 డివిజన్లు గెలుచుకున్నాయి. బీఆర్‌ఎస్ 8 స్థానాలు గెలుచుకుంది. మ్యాజిక్ ఫిగర్‌కు అవసరమైన 31 స్థానాలు ఏ ఒక్క పార్టీకీ రాలేదు. ఈ క్రమంలోనే సీపీఐకి బేషరతుగా మద్దతు ఇచ్చేందుకు బీఆర్‌ఎస్ ముందుకొచ్చింది. అటు కాంగ్రెస్ కూడా స్వతంత్రులతో పాటు కొందరు తిరుగుబాటు కార్పొరేటర్లను కలుపుకుని మేయర్ పదవి కోసం ప్రయత్నాలు చేసింది. అయితే రెండు పార్టీల అగ్రనాయకులు మిత్రబంధం చెదిరిపోకుండా జోక్యం చేసుకుని.. మేయర్ పదవిపై చెరో రెండున్నరేళ్ల ఒప్పందాన్ని కుదర్చడంతో ఉత్కంఠకు తెరపడింది.
కొత్తగూడెం మేయర్ పదవి ఎస్టీ జనరల్ సామాజిక వర్గానికి రిజర్వ్ చేయబడింది. సీపీఐ నుంచి ఎస్టీ సామాజిక వర్గం నుంచి ముగ్గురు కార్పొరేటర్లు గెలిచారు. వీరిలో ఒకరు మేయర్ అయ్యేందుకు ఆస్కారం ఉంది.సుజాతనగర్ పరిధిలోని 20వ డివిజన్ నుంచి మూడు గణేశ్, పాల్వంచ పరిధిలోని 31వ డివిజన్ నుంచి నూనావత్ శ్యామల, కొత్తగూడెం పరిధిలోని 52వ డివిజన్ నుంచి బానోతు కళావతిలు సీపీఐ కార్పోరేటర్లుగా విజయం సాధించారు. అలాగేఎస్టీ సామాజిక వర్గం నుంచి ముగ్గురు ఇండిపెండెంట్లు కూడా గెలిచారు.
