Pak Air Strikes In Afghanistan | అఫ్ఘనిస్థాన్​పై పాకిస్థాన్​ గగనతల దాడులు – 20మందికి పైగా మృతి

అఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో పాకిస్తాన్ ఎయిర్ స్ట్రైక్స్.. టీటీపీ, ఐఎస్‌కేపీ శిబిరాలే లక్ష్యమని పాక్ వాదన. మహిళలు, పిల్లలు సహా డజన్ల మంది మృతి చెందినట్లు అఫ్ఘన్ ఆరోపణ. సీజ్‌ఫైర్‌కు ముప్పు, ప్రాంతీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి.

Crowd searching through debris of collapsed buildings after overnight air strikes near Pakistan border

Pakistan Air Strikes In Afghanistan: Dozens Killed, Tensions Rise Over TTP, ISKP

విధాత ప్రపంచం డెస్క్​ | హైదరాబాద్​:

Pak Air Strikes In Afghanistan | పాకిస్థాన్ సైన్యం అర్ధరాత్రి తర్వాత అఫ్ఘనిస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లో గగనత దాడులు నిర్వహించింది. తీవ్రవాద క్యాంపులు, స్థావరాలను లక్ష్యంగా చేసుకుని నిఘా సమాచారం ఆధారంగా ఈ దాడులు చేశామని పాక్ ప్రభుత్వం తెలిపింది.

ఇస్లామాబాద్‌లోని షియా మసీదుపై జరిగిన ఆత్మాహుతి బాంబు దాడి సహా ఇటీవల జరిగిన ఉగ్రదాడులకు ఇది ప్రతీకార చర్య అని పేర్కొంది. ఆ దాడిలో 31 మంది మరణించగా, వందలాది మంది గాయపడ్డారు. బజౌర్, బన్ను జిల్లాల్లో భద్రతా బలగాలపై దాడులు జరిగినట్లు పాక్ అధికారులు వెల్లడించారు.

పాకిస్తాన్ ఆరోపణల ప్రకారం, ఈ దాడులకు Tehrik-e-Taliban Pakistan (టీటీపీ), అలాగే Islamic State Khorasan Province (ఐఎస్‌కేపీ) వంటి గ్రూపులు బాధ్యులు. వీటి శిబిరాలు అఫ్ఘన్ భూభాగంలో ఉన్నాయని ఇస్లామాబాద్ చెబుతోంది.

సాధారణ పౌరులే లక్ష్యమని అఫ్ఘన్ ఆరోపణ

అయితే అఫ్ఘన్ ప్రభుత్వం ఈ వాదనలను ఖండించింది. నంగర్‌హార్, పక్తికా ప్రావిన్సుల్లో నివాస ప్రాంతాలు, మదరసాలు, ఇళ్లే లక్ష్యంగా బాంబుదాడులు జరిగాయని తెలిపింది. మహిళలు, పిల్లలు సహా డజన్ల మంది మరణించారని వెల్లడించింది. నంగర్‌హార్‌లో కనీసం 17 మంది మృతి చెందినట్లు స్థానిక వర్గాలు పేర్కొన్నాయి.

తాలిబన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్​(Zabihullah Mujahid) ఈ దాడులను అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనగా అభివర్ణించారు. నిరపరాధ పౌరులను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపిస్తూ, తగిన సమయంలో తగిన విధంగా ప్రతిస్పందిస్తామని హెచ్చరించారు.

కాల్పుల విరమణ ఒప్పందానికి ముప్పు, పెరుగుతున్న ఉద్రిక్తతలు

2021లో తాలిబన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి. గత ఏడాది అక్టోబర్‌లో జరిగిన ఘర్షణల తర్వాత దోహా మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ కొనసాగుతోంది.

అయితే తాజా దాడులతో ఆ సున్నిత పరిస్థితి మళ్లీ ఉద్రిక్తంగా మారింది. రెండు దేశాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్న నేపథ్యంలో సరిహద్దుల్లో భద్రతా పరిస్థితి మరింత సంక్లిష్టమైంది. ప్రాంతీయ శాంతి, భద్రతపై ఈ పరిణామాలు ప్రభావం చూపే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Latest News