- స్వేచ్ఛ వచ్చింది.. ఆత్మగౌరవం రాలే
- అపాయింట్‌మెంట్ ఇవ్వని ఉన్నతాధికారులు
- బకాయిలే అడుగుతున్నాం.. చెల్లింపులకు షెడ్యూల్ ప్రకటించండి
- మేం సమరం ప్రకటించలేదు.. మీడియా వక్రీకరించింది
- ఈ ప్రభుత్వం వచ్చాకే మాకు ఫస్ట్‌న జీతాలు
- ఐఏఎస్ అధికారుల కమిటీని స్వాగతిస్తున్నాం
- విధాతతో టీజీఈజేఏసీ సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు
TGEJAC | కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు స్వేచ్ఛ వచ్చిందని, ఏ సమస్య అయినా ప్రభుత్వానికి చెప్పుకొనే అవకాశం కలిగిందని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ (TGEJAC) సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు అన్నారు. జీతాలు కూడా ఒకటో తేదీనే వస్తున్నాయని చెప్పారు. కానీ.. ఐఏఎస్ అధికారుల వద్ద తమకు ఆత్మగౌరం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన విధాతకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం అయిన తరువాత ఉద్యోగులు తమ సమస్యలపై మాట్లాడే అవకాశం లభించిందని ఏలూరి శ్రీనివాసరావు చెప్పారు. తమకు స్వేచ్ఛ వచ్చింది కాబట్టే తమ డిమాండ్లపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి సమావేశం పెట్టుకోగలిగామని తెలిపారు. అంత మాత్రాన తాము ప్రభుత్వంపై సమరం ప్రకటించినట్లు కాదన్నారు. కొన్ని పత్రికలు, టీవీ చానళ్లు తమ మాటలను వక్రీకరించాయని చెప్పారు. దానికి తమ కింది స్థాయి ఉద్యోగులు నిరసన తెలుపుదామనే చెప్పారన్నారు. అడిగితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నీ ఇస్తారు కానీ మీరే అడగటం లేదని తమ ఉద్యోగులు తమనే తప్పు పడుతున్నారని తెలిపారు. అందుకే తమ సమస్యలు పరిష్కరించాలని సమావేశం పెట్టుకుని కోరామని వివరించారు.
నాడు మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదు
గత ప్రభుత్వంలో తమకు కనీసం మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదని శ్రీనివాసరావు అన్నారు. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు కూడా ఇవ్వలేదని చెప్పారు. ఉద్యోగ సంఘాలకు ఉన్న ఓటీ సౌకర్యం కూడా నాడు తీసి వేశారని, నాటి ప్రభుత్వ పెద్దల తీరు వల్లనే అధికారులు ఉద్యోగ సంఘాల నాయకులను లెక్క చేయలేదని విమర్శించారు. నాటి ప్రభుత్వంలో ఉద్యోగ సంఘ నాయకులు పాలాభిషేకాలు చేయడానికి తప్ప దేనికీ పనికి రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు అప్పటి తీరుగానే ఇప్పటికీ వ్యవహరిస్తున్నారని, కనీసం తమకు అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వకుండా మూడు గంటల పాటు వెయిట్ చేయిస్తున్నారని వాపోయారు.
అధికారుల స్థాయిలోనే అనేక సమస్యల పరిష్కారం
అధికారుల స్థాయిలోనే పరిష్కారం అయ్యే సమస్యలు చాలా ఉన్నాయని ఏలూరి శ్రీనివాసరావు చెప్పారు. కావాలనే కొంతమంది అధికారులు తమను అవమాన పరుస్తున్నారని అన్నారు. దీంతో తమ ఆత్మగౌరవం దెబ్బతిన్నదని చెప్పారు. తమకు స్వేచ్చ ఇచ్చిన నాయకుడినే కాస్త ఆత్మగౌరం లభించేలా చూడమని అడుగుతున్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత జాయింట్ కౌన్సిల్ సమావేశం ఇంత వరకు జరగలేదన్నారు. జాయింట్ కౌన్సిల్ సమావేశాలు నిర్వహించాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ప్రత్యేకంగా చెప్పాలా? అని ప్రశ్నించారు.
మా డిమాండ్ల కొత్తవేమీ కాదు
రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులు, పెన్షనర్లు కొత్త డిమాండ్స్ ఏమీ అడగడం లేదని ఏలూరి స్పష్టం చేశారు. గత ప్రభుత్వ కాలం నుంచి ఇప్పటి వరకు తమకు రావాల్సిన డీఏ బకాయిలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ మాత్రమే కోరుతున్నామని చెప్పారు. వాటిని కూడా ఒక షెడ్యూల్ ప్రకటించి, ఆ ప్రకారం ఇవ్వమనే అడుగుతున్నామని తెలిపారు. తమ బకాయిలన్నీ కలిపి రూ.10 వేల కోట్ల వరకు ఉంటాయని చెప్పారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గతంలో తమతో చర్చించి, ఏప్రిల్ నుంచి నెలకు రూ.650 కోట్ల చొప్పున విడుదల చేస్తామన్నారని, కానీ ఈ నెలలో కనీసం నాలుగైదు కోట్లు కూడా విడుదల చేయలేదని తెలిపారు. అలాగే పీఆర్సీ రిపోర్ట్ తెప్పించుకొని చర్చించాలని కోరుతున్నామన్నారు. తమ బిల్లులపై ఐఏఎస్‌లు కొర్రీలు పెడుతున్నారని తెలిపారు. ఇదే ఐఏఎస్ అధికారులు వాళ్లకు రావాల్సిన బిల్లులన్నీ తీసుకుంటున్నారని చెప్పారు. రాష్ట్రం అప్పుల్లో ఉందని, ఆర్థిక కష్టాల్లో ఉందని ఐఏఎస్‌లు తమకు రావాల్సిన బిల్లులు తీసుకోకుండా ఆగుతున్నారా? అని అడిగారు.
ఐఏఎస్‌ల కమిటీని కలుస్తాం
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలపై చర్చించడానికి సీనియర్ ఐఏఎస్‌లతో కమిటీ వేయడాన్ని స్వాగతిస్తున్నామని శ్రీనివాసరావు చెప్పారు. ఈ కమిటీని చైర్మన్ ను కలిశామని, బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు జేఏసీతో చర్చలకు సమయం ఇచ్చిందన్నారు. కమిటీ ద్వారా తమకు సానుకూల నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నామన్నారు. ఇప్పటికే ప్రభుత్వంతో చర్చలు సఫలం కావడంతో ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె విరమించిన విషయాన్ని ప్రస్తావించారు.
మాకు ఏ పార్టీతోనూ సంబంధం లేదు
ప్రభుత్వ ఉద్యోగులు ఏ పార్టీకి సంబంధం లేనివారని శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రతిపక్షంలో ఉన్న వాళ్లు తమకు సపోర్ట్ చేస్తారని, అదే పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు మాత్రం అమలు చేయవని వ్యాఖ్యానించారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న వాళ్లు తమను ఇబ్బంది పెట్టిన తీరు అందరికీ తెలుసన్నారు. ఇప్పుడు అధికారంలో లేరు కాబట్టి తమలో జొరబడే ప్రయత్నం కూడా చేసే అవకాశం ఉందన్నారు. అయితే తాము ఎవరి ట్రాప్‌లో పడబోమని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Bhu Bharathi | గ్రామానికో భూ భారతి వాలంటీర్ : లీఫ్స్ అధ్యక్షులు భూమి సునీల్
Giant Persons | 10 అడుగుల ఎత్తున్న మనుషులు ఈ భూమిపై నడిచారా? వారి కథేంటి?
TGRTC Strike: తెలంగాణలో ఆర్టీసీ కార్మిక సమ్మె వాయిదా !