TGRTC Strike: : తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన సమ్మె వాయిదా పడింది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో ఆర్టీసీ జేఏసీ నేతలు జరిపిన చర్చలు సఫలం కావడంతో సమ్మె వాయిదా పడింది. ఉద్యోగుల సమస్యలపై ముగ్గురు ఐఏఎస్ అధికారులతో ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. నవీన్ మిట్టల్, లోకేశ్ కుమార్, కృష్ణభాస్కర్‌లతో కూడిన ఈ కమిటీ ఉద్యోగ సంఘాలతో చర్చించి సమస్యలకు పరిష్కారం సూచించనుంది. వారం రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఈ కమిటీని ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వంతో జేఏసీ జరిపిన చర్చల సఫలమయ్యాయని జేఏసీ నేతలు వెల్లడించారు. కార్మిక సంఘాలు లేవనెత్తిన సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందన్నారు. డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెలుతామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారని..ఈ నేపధ్యంలో సమ్మెను వాయిదా వేసుకున్నట్లుగా తెలిపారు.
తమ డిమాండ్ల సాధన కోసం సమ్మె చేయాలని ఇటీవల టీజీఎస్‌ఆర్టీసీ జేఏసీ నేతలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నెల 6వ తేదీ అర్ధరాత్రి వరకు చర్చలకు ఆహ్వానం రాకపోతే.. మే 7వ తేదీ నుంచి సమ్మెకు దిగుతామని ప్రకటించారు. ఈ క్రమంలోనే సోమవారం భారీ కవాతు సైతం నిర్వహించారు. ఈ క్రమంలో తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్‌తో జరిపిన చర్చలు సఫలం కావడంతో సమ్మె వాయిదా పడింది.