Narsingi Police Arrest Two in Minor Girl Kidnap Case, Hunt On for Third Accused
- పాఠశాలకు వెళ్తున్నానని ఇంటి నుంచి వెళ్లిన బాలిక
- కత్తితో బెదిరించి అపహరణ – అత్యాచారం
- ఎనిమిది కేసులున్న ఇమ్రాన్ అరెస్ట్ – మరో మైనర్ పరారీలో
విధాత క్రైం బ్యూరో | హైదరాబాద్:
Hyderabad Teen Abduction and Assault | హైదరాబాద్‌లో మరో బాధాకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. చార్మినార్ ప్రాంతంలో పరిచయం అయిన ఓ 16 ఏళ్ల బాలికను మోసపూరితంగా పిలిచి, అత్యాచారం చేసిన ఘటన సంచలనం రేపుతోంది. ఈ కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేయగా, మరో మైనర్ నిందితుడు పరారీలో ఉన్నాడు.
చార్మినార్ పరిచయం… దారుణానికి నాంది
పోలీసుల వివరాల ప్రకారం, నార్సింగి పరిధిలోని పుప్పాలగూడలో అమ్మమ్మ,తాతయ్యల వద్ద ఉంటూ చదువుకుంటున్న 16 ఏళ్ల బాలిక ఈ నెల ప్రారంభంలో చార్మినార్ ప్రాంతానికి షాపింగ్‌కు వెళ్లింది. అక్కడ తలాబ్‌కట్టాకు చెందిన 16 ఏళ్ల బాలుడితో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ ఫోన్ నంబర్లు మార్చుకుని తరచూ మాట్లాడుకునేవారు.
ఫిబ్రవరి 16న ఉదయం పాఠశాలకు వెళ్తున్నానని ఇంటి నుంచి బయలుదేరిన బాలిక, మదీనా–పత్తర్‌గట్టి ప్రాంతంలో ఆ బాలుడిని కలిసింది. ఆ రోజంతా పాతబస్తీలోనే అమ్మాయిని తిప్పిన బాలుడు, సాయంత్రం అతడు తన స్నేహితులైన ఇమ్రాన్ మరియు మరో మైనర్‌తో కలిసి ఆటోలో చెంగిచర్ల డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల సముదాయానికి తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు.
కత్తితో బెదిరించి బలవంతంగా మద్యం తాగించారు.. ఆపై అత్యాచారం
అక్కడ బాలికను కత్తితో బెదిరించి బలవంతంగా మద్యం తాగించి అత్యాచారం చేసినట్లు శేరిలింగంపల్లి డీసీపీ శ్రీనివాస్ వెల్లడించారు. బాలిక ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు నార్సింగి పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి, చెంగిచర్లలోని నివాస సముదాయంపై దాడి చేసి బాలికను రక్షించారు.
ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం చికిత్స పొందుతోంది. తన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఎనిమిది కేసులున్న నేరస్థుడు ఇమ్రాన్ అరెస్ట్
ఈ ఘటనలో ఇమ్రాన్‌తో పాటు బాలికను పరిచయం చేసుకున్న బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇమ్రాన్‌పై భవానీనగర్, రైన్‌బజార్ పోలీస్ స్టేషన్లలో దోపిడీ, దొంగతనం తదితర ఎనిమిది కేసులు నమోదై ఉన్నట్లు వెల్లడించారు. అతనిపై సస్పెక్ట్ షీట్ కూడా కొనసాగుతోంది.
మరో మైనర్ నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉండగా, అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు కొనసాగిస్తున్నాయి. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
