విధాత : చెన్నై నుంచి ఢిల్లీ వెళ్తున్న రైలులో లభించిన ఓ సూట్ కేసులో మహిళ శరీర భాగాలు బయటపడిన కేసును పోలీసులు ఛేదించారు. ఆగ్రా రైల్వే స్టేషన్‌లో సూట్‌కేసు లభించగా.. అందులో లభించిన శరీర భాగాల మూలాలు చెన్నైలో దొరికాయి. 350కి పైగా సీసీ కెమెరాల ఫుటేజీలను జల్లెడ పట్టిన పోలీసులు.. చివరకు అనుమానితుల ఇంటిని కనుగొన్నారు. అక్కడకు వెళ్లి చూడగా పోలీసులకు భయానక దృశ్యాలు కనిపించాయి. మహిళ శరీరాన్ని ముక్కలుగా కోయడమే కాకుండా.. ఆనవాళ్లు లేకుండా చేసేందుకు వాటితో బిర్యానీ వండినట్లుగా గుర్తించి దిగ్భ్రాంతికి గురయ్యారు.
ఈ నెల 5న చెన్నై నుంచి ఢిల్లీ బయలుదేరిన తమిళనాడు ఎక్స్‌ప్రెస్ ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రా రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. ఓ జనరల్ కంపార్ట్‌మెంట్‌లో నుంచి తీవ్ర దుర్వాసన రావడంతో ప్రయాణికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తనిఖీ చేయగా అనుమానాస్పదంగా కనిపించిన ఎరుపు రంగు సూట్‌కేస్ లో లో మహిళ మృతదేహానికి సంబంధించిన శరీర భాగాలు కనపించాయి. దర్యాప్తులో ఆ సూట్‌కేస్ చెన్నై నుంచే రైలులో పెట్టినట్లు గుర్తించారు. దీంతో ఆగ్రా పోలీసులు తమిళనాడు పోలీసులను సంప్రదించారు.
కేసును ఛేదించేందుకు చెన్నై పోలీసులు రంగంలోకి దిగారు. చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్‌తో పాటు పరిసర ప్రాంతాల్లోని 350కిపైగా సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. ఈ క్రమంలో ఓ పురుషుడు, ఓ మహిళ కలిసి ఎరుపు రంగు సూట్‌కేస్‌తో స్టేషన్‌కు వచ్చినట్లు గుర్తించారు. వారు సూట్‌కేస్‌ను తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌లో ఉంచి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం చెన్నై పార్క్ రైల్వేస్టేషన్ నుంచి సబర్బన్ రైలు ఎక్కి గూడువాంజేరి చేరుకున్నట్లు పోలీసులు గుర్తించారు.
సీసీ కెమెరాల ఆధారంగా ముందుకు..
గూడువాంజేరి రైల్వేస్టేషన్ పరిసరాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించగా.. అదే వ్యక్తులు సూట్‌కేస్‌తో ఓ ఆటోలో వెళ్తున్న దృశ్యాలు పోలీసులకు కనిపించాయి. ఆటోను అనుసరిస్తూ వెళ్లిన పోలీసులు గూడువాంజేరి మసీదు వీధిలో వారు నివసిస్తున్న ఇంటిని గుర్తించారు. ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా అక్కడ హత్య జరిగినట్లు అనుమానించే కీలక ఆధారాలు లభించాయి. గదుల్లో రక్తపు మరకలు కనిపించడంతో పోలీసుల అనుమానాలు మరింత బలపడ్డాయి.
పోలీసుల తనిఖీల్లో ఓ భారీ బిర్యానీ పాత్ర కనిపించింది. దానికి మూతపెట్టి చుట్టూ మైదాపిండి అతికించినట్లు గుర్తించారు. మూత తొలగించి చూడగా బియ్యంతో పాటు మానవ శరీరానికి సంబంధించిన ముక్కలు కనిపించడంతో పోలీసులు షాక్‌కు గురయ్యారు. హత్యకు గురైన మహిళ శరీరాన్ని ముక్కలు చేసిన తర్వాత.. కొన్ని భాగాలను సూట్‌కేస్‌లో పెట్టి రైలులో తరలించినట్లు, మిగిలిన భాగాలను వండుతూ ఆనవాళ్లు లేకుండా చేసేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బిర్యానీ పాత్రను స్వాధీనం చేసుకుని చెంగల్పట్టు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. హత్యకు గురైన మహిళ తల కోసం, నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
పోలీసుల దర్యాప్తులో మృతురాలిని ఒడిశాకు చెందిన హయాత్ నిషాగా గుర్తించారు. ఆమె భర్త నుంచి విడిపోయి చెన్నైలో ఉంటున్నట్లు తెలిసింది. ఆమె 19 ఏళ్ల కుమారుడు ఏసీ మెకానిక్‌గా తాంబరం ప్రాంతంలో పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మాణిక్ ఉత్తిన్ లస్కర్, అతని భార్య భాగమతి మాజిక్ లతో కలిసి నిషా అక్కడ నివసిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. లస్కర్ దంపతులు తనకు తమ్ముడు, మరదలు అవుతారని నిషా తమకు చెప్పినట్లు స్థానికులు పోలీసులకు తెలిపారు. నిషాను లస్కర్ దంపతులు హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే హత్యకు అసలు కారణం ఏమిటన్నది ఇంకా స్పష్టంగా తెలియలేదు. మృతురాలి కుమారుడిని పోలీసులు విచారిస్తున్నారు. ఆమె ఎవరెవరితో సంబంధాలు కలిగి ఉంది? చివరిసారిగా ఎవరిని కలిసింది? అనుమానితులతో ఆమెకు ఉన్న సంబంధం ఏమిటి? తదితర అంశాలపై ఆరా తీస్తున్నారు.