(విధాత ప్రత్యేకం)
Outsourcing Employees | రాష్ట్రంలో గత పాతిక సంవత్సరాలుగా సర్కారీ ఉద్యోగులతో సమానంగా చాకిరీ చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల భద్రతకు ముప్పు వాటిల్లుతోంది. ఇప్పటికే ఉద్యోగ భద్రత లేకుండా బిక్కుబిక్కుమంటూ బతుకు వెళ్లదీస్తున్న వీరిపై కాంగ్రెస్ సర్కార్ కత్తికట్టింది. ప్రభుత్వ విభాగాలవారీగా కుదింపు చర్యలు మొదలయ్యాయి. రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులను వదిలించుకున్న విధంగానే వీరిని కూడా ఇంటికి సాగనంపే కార్యక్రమం దశలవారీగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకున్నట్టు కనిపిస్తున్నది.
రాష్ట్రవ్యాప్తంగా గడచిన పాతిక సంవత్సరాలుగా శాశ్వత ఉద్యోగ నియామకాలు లేకపోవడం, సాంకేతికపరంగా ప్రభుత్వ ఉద్యోగులు ఆ స్థాయిలో పనిచేసే సత్తా లేకపోవడం వంటి కారణాలతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపై ప్రభుత్వం ఆధారపడుతోంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ లేదా సంబంధిత శాఖల ద్వారా గతంలో క్లరికల్ స్టాఫ్, టైపిస్టులు, ఆపరేటర్లను నియమించుకునేది. ప్రపంచీకరణ విధానాలు, ప్రైవేటీకరణ పెరగడంతో శాశ్వత నియామకాల స్థానే ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల నియామకాలు పెరిగాయి. ప్రభుత్వ ఉద్యోగులకు అయితే జీతంతో పాటు భద్రత, పదవీ విరమణ సౌకర్యాలు కల్పించాల్సి రావడంతో పాలకులు ఔట్ సోర్సింగ్‌కే మొగ్గు చూపుతున్నారు. దీంతో పాతిక సంవత్సరాల నుంచి ఔట్ సోర్సింగ్ ద్వారా ప్రభుత్వ శాఖల్లో నియామకాలు చేస్తున్నారు. రాష్ట్రంలో పేపర్ రహిత ఈ పేపర్ పాలన నడుస్తోంది. ఈ పనులు చేసేందుకు డాటా ఎంట్రీ ఆపరేటర్లను ఏజెన్సీల ద్వారా నియమించుకుంటున్నారు. తహశీల్దార్ కార్యాలయాల్లో ధరణి ఆపరేటర్లు, మండల పరిషత్ కార్యాలయాల్లో ఈ పంచాయతీ ఆపరేటర్లను నియమించుకుంటున్నారు. తెలంగాణ అంబేద్కర్ సచివాలయంలో కూడా కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, సెక్షన్లతో పాటు పలు ప్రభుత్వ శాఖలలో కూడా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు.
రెవెన్యూ శాఖలో ధరణి వెబ్ పోర్టల్ సర్వీసులు ప్రారంభించిన తరువాత రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కార్యాలయాల్లో 600 మంది ఆపరేటర్లను నియమించారు. పొదుపు చర్యలు, జీతభత్యాల చెల్లింపుల్లో ఆదా చేసేందుకు సగం మందికి పైగా వదిలించుకోవాలనే నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చిందని సమాచారం. ఒకే విడతలో కాకుండా దశలవారీగా తొలగించాలని ప్రభుత్వం అంతర్గతంగా సర్క్యూలర్లు జారీ చేసింది. ఇలా రాష్ట్ర ప్రభుత్వంలోని 60 విభాగాలలో 1.20 లక్షల మంది కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. వాణిజ్య పన్నుల కమిషనరేట్‌లో వంద మంది, రవాణా కమిషనరేట్‌లో 75 మంది, కార్మిక శాఖలో వంద మంది, బేవరేజేస్ కార్పొరేషన్‌లో 75 మందిని సాగనంపేందుకు గత నెలలో మొదటి జాబితాను సిద్ధం చేశారు.
రూపొందించిన జాబితా ప్రకారం సంబంధిత ఉద్యోగులను పిలిపించి, మీరు రేపటి నుంచి కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదని, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మీ సేవలను వినియోగించుకోవడం లేదని అధికారులు వారికి సమాచారం ఇస్తున్నారు. ఒక వేళ నియమించుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు ఇస్తే మళ్లీ అవకాశం కల్పిస్తామని, ప్రత్యామ్నాయంగా ఉద్యోగం చూసుకోవాలని చెప్పి పంపేస్తున్నారు. పది ఇరవై సంవత్సరాలుగా పనిచేస్తున్నామని, ఉన్నపళంగా తొలగిస్తే ఎక్కడకు వెళ్లాలని మొత్తుకున్నా.. ఎవరూ ఉద్యోగం ఇవ్వరని చెప్పుకొన్నా.. అధికారులు వినిపించుకోవడం లేదని తెలుస్తున్నది. ఒక్కో ఉద్యోగికి స్థాయిని బట్టి రూ.15వేల నుంచి రూ.20వేల వరకు వేతనాలు ఇస్తున్నా పనిచేశారు. చాలీచాలనీ వేతనాలతో పనిచేస్తున్న తమ పొట్టకొట్టడం సరికాదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా రెండు రోజుల క్రితం వాణిజ్య పన్నుల కమిషనర్ కార్యాలయంలో వంద మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ఇంటికి పంపించారు. ఇక నుంచి ఆఫీసుకు రావాల్సిన అవసరం లేదని వారికి చెప్పారు. గత పది సంవత్సరాలుగా బాధ్యతగా పని చేస్తున్నా ఏమాత్రం కనికరం లేకుండా పంపించారని ఒకరు తెలిపారు.
గత కొద్ది సంవత్సరాలుగా ఉద్యోగ భద్రతపై ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు కొన్ని డిమాండ్లు చేస్తున్నారు. టైమ్ స్కేల్, సమాన పనికి సమాన వేతనం, ఈఎస్‌ఐ, పీఎఫ్ సౌకర్యాలు, హెచ్ఆర్ పాలసీ, చనిపోతే రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా కల్పించడంతో పాటు సర్వీసును రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్ల సాధన కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో బహిరంగ సభ నిర్వహించి, మంత్రులను ఆహ్వానించారు. ఉద్యోగ భద్రతకు ఈ సమావేశంలో హామీ ఇవ్వడమే కాకుండా న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామనీ చెప్పారు. ఈ ఏడాది ప్రారంభంలో ప్రభుత్వ ఉద్యోగుల డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం సాధ్యం కాదని, అలా చేస్తే న్యాయపరంగా ఇబ్బందులు వస్తాయని స్పష్టం చేశారు. ఉన్న ఉద్యోగం ఏమో కానీ వారి ఆశలు ఆవిరి అయ్యేలా ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తీసివేత కార్యక్రమం మొదలైంది. గత నెల నుంచే శాఖలవారీగా కసరత్తు ప్రారంభమైంది. కొన్ని ప్రభుత్వ శాఖల్లో ఈ విషయం తెలిసి, సంబంధిత ఉన్నతాధికారులకు వినతిపత్రాలు ఇచ్చినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు వాపోతున్నారు.