- మొత్తం 2 లక్షల ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు
- ప్రభుత్వ లెక్కల్లో 1.40 లక్షల మంది
- అనధికారికంగా మరో 60 వేల మంది
- ఒక్కో ఉద్యోగిపై కనీస దోపిడీ రూ.8,525
- మధ్యస్తంగా రూ.10,656 వసూలు
- మూడో క్యాటగిరీలో గరిష్ఠ దోపిడీ రూ.12,432
- మొత్తంగా నెలకు 200 కోట్లు ఏజెన్సీల పాలు
- దోపిడీ లెక్కల గుట్టు విప్పిన ఉద్యోగ నేతలు
- సదరు సంస్థలపై చర్యలకు డిమాండ్
- ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటుకు వినతి
Outsourcing Employees | ప్రభుత్వాలు మారినా… పాలకులు మారినా… ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తల రాతలు మారడం లేదు. గిగ్ వర్కర్లకు బతుకుపై భరోసా ఇస్తామని చెబుతున్న తెలంగాణ ప్రభుత్వం పెద్దలు శ్రమ దోపిడీకి గురవుతున్న ఔట్ సోర్సింగ్‌పై నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు రెండు లక్షల మంది ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉంటే.. వారి నుంచి ప్రతి నెలా 200 కోట్ల మేరకు ఏజెన్సీలు దండుకుంటున్నాయని ఉద్యోగ సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే.. లక్షల మంది శ్రమ జీవుల ఉసురు తీస్తున్న ప్రైవేటు ఏజెన్సీల దారుణాలపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ ఊపందుకుంటున్నది. ప్రతి ఏడాది రెన్యువల్ పేరుతో ఏజెన్సీలను ఎంపిక చేస్తున్నది కాని నిబంధనల అమలును పర్యవేక్షించడం లేదని ఔట్‌సోర్సింగ్ ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఫలితంగా సుమారు రెండు లక్షల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు భారంతో బతుకులు వెళ్లదీస్తున్నారని, ఆర్థికంగా భారీగా నష్టపోతున్నారని ఆ సంఘ నేతలు చెబుతున్నారు.
గ్రామస్థాయి నుంచి.. సచివాలయం వరకూ..
ప్రభుత్వ కార్యాలయాల్లో శాశ్వత ఉద్యోగాల కల్పన నుంచి తప్పించుకున్న తెలంగాణ ప్రభుత్వం తాత్కాలిక ఉద్యోగం పేరుతో ఔట్ సోర్సింగ్ అంటూ లక్షల మందిని నియమించుకున్నది. వీరికి అదనంగా కాంట్రాక్టు, గౌరవ వేతనం, ఎన్ఎంఆర్ పేర్లతో వివిధ శాఖలలో పనిచేస్తున్నారు. గ్రామస్థాయి నుంచి తెలంగాణ అంబేద్కర్ సచివాలయం వరకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే వీరికి సమాన పనికి సమానం వేతనం ఇవ్వకుండా భిక్షం వేసినట్లుగా అతి తక్కువ జీతాలు ఇచ్చి గంపెడు చాకిరి చేయించుకుంటున్నారని ఔట్‌సోర్సింగ్ ఉద్యోగ సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగ భద్రత అటుంచితే కనీస వేతనాల్లో న్యాయం చేస్తున్నారా? అంటే అదీ లేదు. సమాన పనికి సమాన వేతనం శాశ్వత ఉద్యోగులతో పాటుగా ఇవ్వాలని సుప్రీంకోర్టు 2016లో తీర్పునిచ్చింది. ఒకే రకమైన పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగికి అతి తక్కువ వేతనం, ప్రభుత్వ ఉద్యోగికి మాత్రం ఎక్కువ మొత్తంలో జీతాలు చెల్లించడాన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టింది. అయినా తెలంగాణ ప్రభుత్వంలో ఇసుమంత కూడా చలనం రాలేదు. ఎంతసేపూ వారితో పనిచేయించుకోవడం, ప్రైవేటు ఏజెన్సీలను మేపడం తప్ప మరోటి చేయడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వీరి శ్రమను గుర్తించకపోయినా కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం అయినా గుర్తించిందని సంతోష పడినా.. తాత్కాలిక ఉద్యోగులకు నిరాశ తప్పడంలేదు. అయితే ప్రభుత్వంపై ఒత్తిడి పెరగడంతో రిటైర్డ్ ఐఏఎస్ అధికారితో ఒక కమిటీ వేసి న్యాయం చేసే దిశగా చర్యలు చేపట్టింది. ఈ కమిటీలో మొత్తం ముగ్గురు ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు గిగ్ వర్కర్ల భద్రత పేరుతో ఇప్పటికే ప్రభుత్వం రెండు మూడు సార్లు సమావేశాలు నిర్వహించింది. ప్రభుత్వ వ్యవస్థలో భాగమై పనిచేస్తున్న వీరి విషయంలో సర్కార్ న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
బిస్వాల్ సిఫారసులు బుట్టదాఖలు
ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమం కోసం పీఆర్సీ కోసం ఏర్పాటు చేసి సీఆర్ బిస్వాల్ కమిటీ 2020లో వేతనాలపై పలు సిఫారసులు చేసింది. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు, ఎన్ఎంఆర్, తాత్కాలిక ఉద్యోగులకు కనీసం వేతనం (బేసిక్ పే) రూ.19వేలు, ఆ తరువాత క్యాటగిరీ వారికి రూ.22,900, రూ.31,040 చొప్పున ఇవ్వాలని సూచించింది. ప్రతి ఏడాది రూ.1 వేయి చొప్పున పెంచాలని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు కూడా మొదటి క్యాటగిరీ కింద కనీస వేతనం రూ.19వేలు గా ఖరారు చేసింది. బిస్వాల్ సిఫారసులను, సుప్రీంకోర్టు ఆదేశాలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. మొక్కుబడిగా కొంత పెంచి మమ అనిపంచిందని ఔట్ సోర్సింగ్ ఉద్యోగ సంఘాల నాయకులు చెబుతున్నారు.
సర్కార్ మంజూరు రూ.22,136, ఏజెన్సీ ఇచ్చేది రూ.13,611
మొదటి క్యాటగిరీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగికి ప్రతి నెలా తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసే మొత్తం రూ.22,136. అయితే అన్ని కోతలు విధించి ప్రైవేటు ఏజెన్సీలు రూ.13,611 మాత్రమే చెల్లించి, మిగిలిన రూ.8,525లను జేబుల్లో వేసుకుంటున్నాయి. రెండో క్యాటగిరీలో రూ.27,670 ప్రభుత్వం ఇస్తే, ఏజెన్సీలు ఉద్యోగికి రూ.17,014 చెల్లించి రూ.10,656 స్వాహా చేస్తున్నాయి. మూడో క్యాటగిరీలో రూ.32,281 ప్రభుత్వం మంజూరు చేస్తే, ఉద్యోగికి ఏజెన్సీలు రూ.19,849 ఇచ్చి సరిపెడుతున్నాయి. ఈ మొత్తం ఎలా మిగులుతుందంటే ఈపీఎఫ్, ఈఎస్ఐ, జీఎస్టీ పద్దుల కింద ప్రభుత్వం మంజూరు చేస్తున్నది. 25 శాతం ఈపీఎఫ్, నాలుగు శాతం ఈఎస్ఐ, 18 జీఎస్టీ మొత్తాన్ని సంబంధిత ఖాతాల్లో ప్రతి నెలా చెల్లించకుండా ఎగవేస్తున్నాయి. ఒక వేళ చెల్లించినా ఒకటి రెండు నెలలు చెల్లించి మానేస్తున్నారు. ఇది పోను ప్రభుత్వం ప్రాంతాల వారీగా నాలుగు నుంచి ఆరు శాతం వరకు ఏజెన్సీలకు కమీషన్లు అధికారికంగా మంజూరు చేస్తున్నది. మొదటి క్యాటగిరీ కింద రూ.8,525, రెండో క్యాటగిరీలో రూ.10,656, మూడో క్యాటగిరీలో రూ.12,432 చొప్పున ప్రతి ఔట్ సోర్సింగ్ ఉద్యోగి నుంచి ప్రైవేటు ఏజెన్సీలు స్వాహా చేస్తున్నా ప్రభుత్వ అధికారులు కఠిన చర్యలు తీసుకోవడం లేదని ఔట్ సోర్సింగ్ ఉద్యోగ నేతలు చెబుతున్నారు. ఈ దందా కొన్ని సంవత్సరాల నుంచి నిరాటకంగా కొనసాగుతున్నది. ఇందులో విభాగం అధికారి మొదలు డబ్బులు ఇచ్చే ట్రెజరీ అధికారి వరకు అందరికీ వాటాలు ఉన్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏజెన్సీ అధికారిక కమీషన్ల శాతం రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విధంగా లేదు. ఒక చోట నాలుగు, మరో చోట రెండు శాతం చొప్పున ఇష్టారీతిన అమలుపరుస్తున్నారు. కాంట్రాక్టు అగ్రిమెంట్ కాలం ఏడాది కాలమే కావడమే ఆడిందే ఆట పాడిందే పాటగా సాగుతున్నదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఒక వేళ మరుసటి సంవత్సరం తనకు కాంట్రాక్టు దక్కనట్లయితే ఏ లెక్క కూడా అప్పచెప్పరని, రికార్డులు సమర్పించే సమస్యే లేదని అంటున్నారు. ప్రభుత్వం ఇచ్చే అన్ని రకాల మొత్తాలు ఏజెన్సీ జేబుల్లోకి వెళ్లిపోతాయని ఉద్యోగులు చెబుతున్నారు.
ఏజెన్సీ విధానం రద్ధు చేయాలి
రాష్ట్రంలో ప్రైవేటు ఏజెన్సీ విధానం రద్ధు చేయాలని, ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని తెలంగాణ రాష్ట్ర ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ జేఏసీ అధ్యక్షుడు పులి లక్ష్మయ్య డిమాండ్ చేశారు. ప్రతి ఉద్యోగికీ ఆరోగ్య భద్రత కోసం హెల్త్ కార్డులు, ప్రతి సంవత్సరం రూ.1వేయి చొప్పున ఇంక్రిమెంట్ ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం విడుదల చేసే ప్రతి నోటిఫికేషన్‌లో వెయిటేజీ మార్కులు కలపాలని కోరారు. పనిచేస్తూ మరణిస్తే రూ.10 లక్షలు ఆర్థిక సాయం చేయాలని, బాధిత కుటుంబంలో ఒకరికి తిరిగి ఉద్యోగం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మహిళా ఉద్యోగులకు సెలవులు 15 రోజుల నుంచి 30 రోజులకు పెంచడంతో పాటు వేతనంతో కూడి ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని లక్ష్మయ్య, నాచారం ఈఎస్ఐ హాస్పిటల్ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ ప్రెసిడెంట్ పీ క్రాంతి కుమార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.
ఇవి కూడా చదవండి..
Outsourcing Employees | ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల ఊచకోత! పొదుపు చర్యల్లో తెలంగాణ సర్కార్..
Global Warming | గ్లోబల్ వార్మింగ్‌తో విస్తరించే ప్రాణాంతక ఫంగస్! 33 శాతానికిపైగా మరణాల రేటు!
Operation Sindoor | ఆపరేషన్ సిందూర్.. ఆ 9 ఉగ్రవాద స్థావరాలనే భారత్ ఎందుకు టార్గెట్ చేసింది..?