Labour Codes Explained | నాలుగు లేబర్‌ కోడ్‌లను కార్మికులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?

కేంద్ర ప్రభుత్వం పారిశ్రామిక రంగ ప్రభావశీల సంస్కరణగా చెబుతున్న నాలుగు లేబర్‌ కోడ్‌లను కార్మిక సంఘాలు మాత్రం అత్యంత ప్రమాదకరమైనవిగా అభివర్ణిస్తున్నాయి. అసలు ఆ కోడ్‌లలో కార్మికులు వ్యతిరేకిస్తున్న అంశాలేంటి?

Labour Codes Explained |  కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ఏకపక్షంగా అమల్లోకి తెచ్చిన నాలుగు లేబర్‌ కోడ్‌(Labour Codes)లపై దేశవ్యాప్తంగా కార్మికవర్గ ఆందోళనలు (India labour code protests) పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. పది కేంద్ర కార్మిక సంఘాలు, రైతు వేదిక ‘సంయుక్త్‌ కిసాన్‌ మోర్చా, విద్యుత్తు రంగ ఇంజినీర్ల సంఘం ఏఐపీఈఎఫ్‌ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో నిరసనలకు దిగారు. గతంలో ఉన్న 29 చట్టాలను రద్దు చేస్తూ వాటన్నింటి స్థానంలో వేతనాల కోడ్‌ –2019, పారిశ్రామిక సంబంధాల కోడ్‌ –2020, సామాజిక భద్రత కోడ్‌ – 2020, ఆక్యుపేషనల్‌ సేఫ్టీ, హెల్త్‌ అండ్‌ వర్కింగ్‌ కండిషన్స్‌ కోడ్‌ –2020 గత శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. అనేక సుదీర్ఘ పోరాటాల ఫలితంగా సాధించుకునే అనేక హక్కులు ఈ చట్టాల రద్దుతో తాము కోల్పోయామని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కార్మిక సంఘాల ఉమ్మడి ఫోరం ప్రతినిధులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వినతి పత్రం అందించారు. సమ్మె హక్కును ఈ కోడ్‌లు కాలరాస్తున్నాయని, కార్మిక సంఘాల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను మరింత సంక్లిష్టంగా మార్చి, వాటిని రద్దు చేసే ప్రక్రియను మాత్రం మరింత సులభం చేస్తున్నాయని ఆ మెమోరాండంలో పేర్కొన్నారు. ఉమ్మడి ఫోరం పిలుపు మేరకు దేశవ్యాప్తంగా 500 జిల్లాల్లో సంఘటిత, అసంఘటిత రంగాల కార్మికులు, ఉద్యోగులు ఆందోళనల్లో పాల్గొన్నారని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి అమర్‌జీత్‌ కౌర్‌ తెలిపారు. భారతీయ మజ్దూర్‌ సంఘ్‌ మినహా అన్ని ప్రధాన కార్మిక సంఘాలు ఈ లేబర్‌ కోడ్‌లను ఐక్యంగా వ్యతిరేకిస్తున్నాయి.

ఒకప్పుడు రైతు సంఘాల సంయుక్త కార్యాచరణతో ఢిల్లీ శివార్లలో ఏడాదికిపైగా రైతుల చారిత్రాత్మక ఆందోళన కొనసాగింది. ఇప్పుడు కూడా అదే స్థాయిలో ఉద్యమాలకు, ఆందోళనలకు కార్మికులు సిద్ధపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. రద్దు చేసిన 29 కార్మిక చట్టాల్లోని అనేక అంశాలు వేతనాలు, పనిగంటలు, సామాజిక భద్రత, పారిశ్రామిక భద్రత, తనిఖీలు, ఉమ్మడిగా ప్రయోజనాలు సాధించుకోవడం వంటివాటికి కార్మికుల పక్షాన రక్షణ కవచంలా ఉండేవి. కానీ.. కొత్త కోడ్‌లు పూర్తిగా యాజమాన్యాల పక్షపాతంతో ఉన్నాయని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.

ఈ సంస్కరణల వల్ల పెట్టుబడులు పెరుగుతాయని, మరిన్ని ఉపాధి అవకాశాలు లభిస్తాయని కేంద్ర ప్రభుత్వం చెబుతున్న విషయాన్ని కార్మిక సంఘాలు పూర్తిగా కొట్టిపారేస్తున్నాయి. వాస్తవానికి కార్మిక చట్టాలను బలహీనపర్చి, పోరాటాలతో సాధించుకున్న తమ హక్కులను కాలరాసి పెట్టుబడులను ఆహ్వానించే భారీ కుట్ర ఈ నాలుగు కోడ్‌లలో ఉందని కార్మిక సంఘాల నాయకులు చెబుతున్నారు. ఈ కోడ్‌లు సమ్మె చేసేందుకు కార్మికులకు ఉన్న హక్కును కాలరాస్తున్నాయి. ఉమ్మడి ఆందోళనలను నేరపూరితాలుగా ప్రకటిస్తున్నది. దీనితో కార్మికులు తమ హక్కుల సాధనకు లేదా తమ సాదకబాధకాలపై పోరాటం చేసేందుకు లేదా ఆందోళన దిగేందుకు ఆస్కారం లేకుండా పోతున్నది. దీర్ఘకాలికంగా కార్మికులకు ఉన్న హక్కులు.. ఆధిపత్య ఆర్థిక ప్రయోజనాలకు అనుగుణంగా బలహీనపడిపోయాయి.

కొత్త కోడ్‌లలో కార్మిక వ్యతిరేక కీలక అంశాలు

ఉద్యోగ భద్రతకు ముప్పు
గతంలో వంద మందిలోపు ఉన్న కంపెనీల్లోనే ప్రభుత్వ అనుమతి లేకుండా కార్మికులను తొలగించే హక్కు యజమానికి ఉండేది. ఇప్పుడు 300 మంది కార్మికులు ఉన్నా.. ప్రభుత్వ అనుమతి లేకుండానే కార్మికులను యజమాని తొలగించుకోవచ్చని కోడ్‌ చెబుతున్నది.
దీని వల్ల పెద్ద ఎత్తున వాడుకొని విసిరిపారేసే (hire and fire) ధోరణి ప్రబలుతుందని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

కార్మిక సంఘాల ఏర్పాటు సంక్లిష్టం
కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన కోడ్‌తో కార్మిక సంఘాల రిజిస్ట్రేషన్‌ అత్యంత కఠినంగా మారనున్నది. యూనియన్‌గా గుర్తింపు పొందటానికి కనీసం 20 శాతం కార్మికుల మద్దతును కోడ్‌ తప్పనిసరి చేస్తున్నది.
దీనితో అనేక ఫ్యాక్టరీల్లో, సంస్థల్లో యూనియన్ల సంఖ్య తగ్గిపోతుంది. మరో మాటలో చెప్పాలంటే కార్మికుల గొంతు నొక్కివేయడమే.

సమ్మెలపై తీవ్ర నియంత్రణ
ఏదైనా ఫ్యాక్టరీ లేదా సంస్థలో సమ్మె చేయాలంటే 60 రోజులు ముందుగా సమ్మె నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. అత్యవసర సర్వీసుల వారు అయితే.. ఆరు వారాల ముందు నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. కార్మిక సంఘాలకు, యాజమాన్యానికి మధ్య చర్చలు జరుగుతున్న సమయంలో కార్మికులు సమ్మె చేయడానికి లేదు. ఒకసారి కేసు న్యాయస్థానాలకు వెళ్లిందంటే.. మూడు నెలలపాటు సమ్మె చేయడానికి ఆస్కారమే లేదు.
ఇది కార్మికుల ప్రాథమిక హక్కులకు విరుద్ధమని సంఘాలు చెబుతున్నాయి.

కాంట్రాక్ట్ లేబర్‌ను పెంచుతాయి
చాలా రంగాల్లో కాంట్రాక్ట్‌ కార్మికులను (contract employment) సైతం రెగ్యులర్‌ పనుల కోసం నియమించుకునేందుకు యాజమాన్యాలకు ఈ కోడ్‌లు అనుమతి ఇస్తున్నాయి.
కాంట్రాక్ట్‌ వర్కర్లకు తక్కువ జీతం, ఎలాంటి రక్షణలు లేకపోవడంతో వారికి అన్యాయం జరుగుతుందని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

స్టాండింగ్‌ ఆర్డర్స్‌ రద్దు
వివిధ సంస్థల్లో జీతాలు, పని నిబంధనలు, షిఫ్టులు, క్రమశిక్షణ నియమాలు స్పష్టంగా ఉన్నాయి. అయితే.. కొత్త కోడ్‌ ప్రకారం 300లోపు కార్మికులు ఉన్న సంస్థలకు స్టాండింగ్‌ ఆర్డర్స్‌ వర్తించవని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. దీని కారణంగా యజమానులు తమ అనుకూలంగా నిబంధనలను తయారు చేసే ప్రమాదం ఉందని కార్మిక సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. దాని వల్ల కార్మికలపై ఒత్తిడి పెరుగుతుందని, యూనియన్‌లు బలహీనంగా మారిపోతాయని చెబుతున్నారు.

పనిగంటల పెంపు
ఈ కోడ్‌లలో మరో కీలక అంశం పనిగంటల పెంపు. కార్మిక వర్గం తమ నెత్తురు ధారబోసి 8 గంటల పనిదినాన్ని సాధించుకున్నది. ఇప్పుడు ఆ 8 గంటల పనివిధానానికే కేంద్రం గండి కొట్టింది. రోజుకు 12 గంటలు పనిచేయాల్సి ఉంటుంది.
ఆరోగ్యం, కుటుంబ జీవనంపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని కార్మిక సంఘాలు చెబుతున్నాయి.

పీఎఫ్‌, ఈఎస్‌ఐ వంటి సామాజిక భద్రతా కవరేజ్‌లో తేడాలు
పీఎఫ్‌, ఈఎస్‌ఐ సదుపాయాలు అదరికీ వర్తిస్తాయని సోషల్‌ సెక్యూరిటీ కోడ్‌లో చెప్పినా.. గిగ్‌వర్కర్లు, ప్లాట్‌ఫామ్‌ వర్కర్ల వంటివారికి ప్రయోజనాలేంటనే విషయంలో ఎలాంటి స్పష్టత లేదు. కార్మికులపైనే ఎక్కువ భారం పడే అవకాశాలు ఉన్నాయని కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి. ఇది కార్మికు భవిష్యత్‌ భద్రతను ప్రమాదంలోకి నెట్టేస్తున్నది.

ఓవర్‌టైమ్‌ నియమాల్లో మార్పు
ఓవర్‌టైమ్‌ పనిచేయించుకునే విషయంలో యజమానులకు మరిన్ని సడలింపులు ఇస్తున్నది. దీని వల్ల కార్మికులు తక్కువ వేతనానికే ఎక్కువ గంటలు పనిచేయాల్సి వస్తుంది.

కార్మిక తనిఖీలు బలహీనం
గతంలో అధికారులు వివిధ ఫ్యాక్టరీలు, సంస్థల్లో నేరుగా తనిఖీలు నిర్వహించేవారు. ఇప్పుడు దానిని ర్యాండమ్‌ ఇన్‌స్పెక్షన్‌, ఆన్‌లైన్ డిస్‌క్లోజర్‌ సిస్టమ్స్‌ను తీసుకువచ్చారు. దాంతో అధికారుల ప్రత్యక్ష తనిఖీలు తగ్గిపోతాయి.
దాని వల్ల ఫ్యాక్టరీల్లో భద్రతా ప్రమాణాలు తగ్గిపోతాయని కార్మికులు ఆందోళన చెందుతున్నారు.

చిన్న సంస్థల నియంత్రణ లేదు
పది లేదా 20 మంది కార్మికులు ఉండే సంస్థలకు అనేక నియమాలు వర్తించవు. ఇది కార్మికులకు చట్టపరంగా ఉన్న రక్షణలను తొలగించడమేనని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి..

Warangal : కేంద్ర ప్రభుత్వ విధానాలతో పెరుగుతున్న అసమానతలు
Pakistan | పాక్ మాజీ ప్రధానిని హత్య చేశారా? అసలు నిజం ఏంటంటే?
Andrapradesh | బలపడిన అల్పపీడనం.. రాష్ట్రానికి భారీ వర్ష సూచన

Latest News