విధాత, హైదరాబాద్ ప్రతినిధి:
Outsourcing Employees | తెలంగాణలోని ప్రభుత్వ విభాగాలు, విభాగాల ప్రధాన కార్యాలయాలు, సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీలు, స్థానిక సంస్థలు, విశ్వ విద్యాలయాలు, రాష్ట్ర ప్రభుత్వ ఆమోదంతో ఏర్పాటు చేసిన సంస్థలలో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వివరాలు అందచేయాలంటూ పులి లక్ష్మయ్య అనే వ్యక్తి అక్టోబర్ 22వ తేదీన సచివాలయంలో సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశారు. దరఖాస్తును పరిశీలించిన ఆర్థిక శాఖ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారి సమాచారం ఇవ్వకపోగా వివరాలు సేకరించే పనిలో ఉన్నామని, ఇప్పట్లో ఇవ్వడం సాధ్యం కాదని సమాధానం ఇవ్వడం విశేషం.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎంత మంది పనిచేస్తున్నారు? ఏ జీవో ప్రకారం జీతాలు చెల్లిస్తున్నారు? కేటగిరీల వారీగా చెల్లిస్తున్న జీతాలు ఎంత? అంటూ తన దరఖాస్తులో లక్ష్మయ్య ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రభుత్వ విభాగాలు, సంస్థలు, సొసైటీలు, జిల్లా కలెక్టరేట్లు, విశ్వ విద్యాలయాలు ఎన్ని ఉన్నాయి. కేటగిరీ వారీగా పై వాటిలో ఎంత మంది పని చేస్తున్నారో తెలియచేయాలని కోరారు. ప్రాంతాలు లేదా కేంద్రాలవారీగా ఎన్ని ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలు పనిచేస్తున్నాయో వివరించాలని అడిగారు. 2025 జనవరి నుంచి దరఖాస్తు చేసే తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎంత మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఈపీఎఫ్, ఈఎస్ఐ, జీఎస్టీ ఎంత మొత్తంలో పెండింగ్ లో పెట్టారో తెలియచేయాలని కోరారు.
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేస్తున్నారా? చేస్తే ఏ తేదీ నుంచి అమలు చేస్తున్నారో వెల్లడించాలని అడిగారు. ప్రభుత్వ విభాగాలు, ప్రధాన అధిపతుల కార్యాలయాలు, సొసైటీలు, జిల్లా కలెక్టరేట్లు, విశ్వ విద్యాలయాలలో డైలీ వేజ్, యాక్టివ్ బేస్డు, పేషెంట్ కేర్, శానిటేషన్, పార్ట్ టైట్, ఫుల్ టైమ్, ఎన్ఆర్ఎం ఉద్యోగులు ఎంత మంది పనిచేస్తున్నారు? 2025 జనవరి నుంచి డైలీ వేజ్, యాక్టీవ్ బేస్డు, పేషెంట్ కేర్, శానిటేషన్, పార్ట్ టైమ్, ఫుల్ టైమ్ తో పాటు ఎన్ఆర్ఎం లో ఏ కేటగిరీ ప్రకారం జీతాలు చెల్లిస్తున్నారు? వీరికి ఎన్ని నెలల నుంచి ఈపీఎఫ్, ఈఎస్ఐ, జీతాలు పెండింగ్ లో ఉన్నాయి? ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజిమెంట్ అండ్ ఇన్మర్మేషన్ సిస్టమ్ (ఐఎఫ్ఎంఐఎస్) ఫోర్టల్ లో ఇప్పటి వరకు ఎన్ని ప్రభుత్వ విభాగాలు ఆధార్ తో సహా పనిచేస్తున్న వివరాలు నమోదు చేశాయి? ప్రభుత్వ విభాగాలు, కేటగిరీల వారీగా ఎంత మంది పేర్లు అప్ లోడ్ చేశారు? ఇంకా అప్ లోడ్ చేయని వివరాలు ఏమిటనే వివరాలు సమాచార హక్కు చట్టం ద్వారా ఇవ్వాల్సిందిగా కోరారు. కానీ.. దీనికి మాత్రం అధికారులు.. దాటవేత ధోరణితో బదులివ్వడంపై కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ జీవితాలతో చెలగాటమాడుతున్నారంటూ మండిపడుతున్నారు.
Read Also |
Online Love Border Violation | పాక్‌లోకి చొరబడేందుకు ఆంధ్ర యువకుడి యత్నం కారణం విన్న పోలీసులకు షాక్!
Pragathi Tollywood Actrer| ప్రగతి అక్కా…పవర్ ఆఫ్ పవర్ లిఫ్టింగ్
Giant Anaconda : సినిమా అనకొండ కాదు..నిజం పామునే!
