Online Love Border Violation | రాజస్థాన్‌లోని బికనీర్ ఖాజువాలా సెక్టర్‌లో భారత్–పాకిస్తాన్ సరిహద్దు సమీపంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక యువకుడిని పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. విశాఖపట్నానికి చెందిన ప్రశాంత్ వేదం అనే ఈ యువకుడు గతంలో కూడా పలు మార్లు సరిహద్దు దాటేందుకు ప్రయత్నించి దొరికిపోయాడు. మళ్లీ అదే పనిచేస్తూ పట్టుబడ్డాడు. ఎందుకు సరిహద్దు దాటేందుకు ప్రయత్నిస్తున్నావని పోలీసులు అడిగితే.. అతడు చెప్పిన కారణం.. పాకిస్తాన్‌లోని అతడి ప్రేయసి కోసం! ఆన్‌లైన్‌లో పరిచయం అయిన ఆ యువతితో అతడు ప్రేమలో పడ్డాడట.
రక్షణశాఖ అధికారులు చెప్పిన వివరాల ప్రకారం.. ప్రశాంత్.. శుక్రవారం మధ్యాహ్నం ఖాజువాలా వద్ద బస్సు దిగి.. అంతర్జాతీయ సరిహద్దు వైపు నడుచుకుంటూ వెళుతున్నాడు. అతడి వ్యవహారంపై అనుమానం వచ్చిన చాక్ సమీపంలోని ఆర్మీ క్యాంప్ సైనికులు అతడిని అడ్డుకున్నారు. కొంతసేపు అతడిని ప్రశ్నించి.. ఖాజువాలా పోలీసులకు అప్పగించారు. ‘రావల్పిండిలో నివసించే ప్రవిత అనే తన స్నేహితురాలిని కలుసుకునేందుకు వెళుతున్నానని ఇంటరాగేషన్ సందర్భంగా ప్రశాంత్ వేదం చెప్పాడు’ అని ఖాజువాలా పోలీస్ సర్కిల్ ఆఫీసర్ అమర్జీత్ చావ్లా తెలిపారు. తాము సుమారు పదేళ్ల క్రితం సోషల్ మీడియా ద్వారా కలుసుకున్నామని అతడు చెప్పాడని, ఆమెను కలిసేందుకే తాను సరిహద్దు దాటేందుకు ప్రయత్నించానని తెలిపాడని పేర్కొన్నారు. 2017 ఏప్రిల్‌లో పాకిస్తాన్‌లోకి వెళ్లాడని దర్యాప్తు అధికారులు తెలిపారు. ఆ సమయంలో అతడిని పట్టుకున్న పాక్ అధికారులు.. 2021లో అతడిని భారత అధికారులకు అప్పగించారని పేర్కొన్నారు. ‘ప్రశాంత్.. బీటెక్ గ్రాడ్యుయేట్. ఆఫ్రికా, చైనా తదితర దేశాల్లో వృత్తిరీత్యా పనిచేశాడు’ అని వారు తెలిపారు.
ప్రస్తుతం ప్రశాంత్‌ను ఖాజువాలాలోని ఒక సురక్షిత ఇంటిలో ఉంచామని పోలీసులు తెలిపారు. ఇతడు సరిహద్దు దాటేందుకు ప్రయత్నించడంలో గూఢచర్యం అంశం ఏమైనా ఉందా అనేది తెలుసుకునేందుకు వివిధ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు అతడిని ప్రశ్నిస్తున్నాయి. గూఢచర్యం కోసం గతంలో ఇలా సరిహద్దు దాటేందుకు ప్రయత్నించిన పలువురిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ప్రశాంత్‌ను అదుపులోకి తీసుకున్న విషయాన్ని అతడి కుటుంబానికి తెలిపామని, ఇప్పటికే అతని సోదరుడు ఖాజువాలకు బయల్దేరాడని అధికారులు తెలిపారు.
Read Also |
China New Year Celebrations : చైనీస్ రివర్ డ్రాగన్ చూశారా…రాత్రివేళ జిగేల్
Bath with Hot Water | చలికాలంలో వేడి నీళ్లతో స్నానమా..? ఈ నష్టాలు తప్పవు..!
Weekly Horoscope | ఈ వారం రాశిఫలాలు.. ప్రభుత్వ ఉద్యోగం కోసం యత్నిస్తున్న ఈ రాశి నిరుద్యోగులకు శుభవార్త..!
