Site icon vidhaatha

Operation Sindoor | ఆప‌రేష‌న్ సిందూర్.. ఆ 9 ఉగ్ర‌వాద స్థావ‌రాల‌నే భార‌త్ ఎందుకు టార్గెట్ చేసింది..?

Operation Sindoor | న్యూఢిల్లీ : ప‌హ‌ల్గాం ఉగ్ర‌దాడికి ప్ర‌తీకారంగా పాకిస్తాన్, పాక్ ఆక్ర‌మిత క‌శ్మీర్‌లోని ఉగ్ర‌వాద స్థావ‌రాల‌పై భార‌త సైన్యం మిస్సైళ్ల‌తో విరుచుకుప‌డింది. మొత్తం 9 ఉగ్ర‌వాద స్థావ‌రాల‌పై మంగ‌ళ‌వారం అర్ధ‌రాత్రి 1.44 గంట‌ల‌కు మిస్సైళ్ల‌తో మెరుపుదాడులు చేసి నేల‌మ‌ట్టం చేసింది. ఈ మెరుపు దాడుల్లో 80 నుంచి 90 మంది ఉగ్ర‌వాదులు హ‌త‌మైన‌ట్లు స‌మాచారం. మురిద్కేలోని ల‌ష్క‌రే తోయిబా, బ‌హ‌వ‌ల్‌పూర్‌లోని జైషే మ‌హ్మ‌ద్ ఉగ్ర‌వాద స్థావ‌రాల్లోనే 30 మంది చొప్పున ఉగ్ర‌వాదులు హ‌త‌మైన‌ట్లు తెలుస్తోంది. మ‌రి ఆ 9 ఉగ్ర‌వాద స్థావ‌రాల‌నే భార‌త సైన్యం ఎందుకు టార్గెట్ చేసిందంటే.. గ‌తంలో భార‌త్‌లో జ‌రిగిన ఉగ్ర‌వాద దాడులు, ఏప్రిల్ 22న ప‌హ‌ల్గాం ఉగ్ర‌దాడి వెనుక ఆ ఉగ్ర‌వాద సంస్థ‌ల్లో ప‌ని చేస్తున్న ముష్క‌రుల హ‌స్తం ఉంద‌ని అనుమానం. భార‌త్‌లోకి చొర‌బాటుకు య‌త్నించి.. స‌రిహ‌ద్దుల్లో ఉగ్ర‌వాద కార్య‌క‌లాపాల‌కు ప్రేరేపిస్తున్న‌ట్లు స‌మాచారం. కాబ‌ట్టి ఈ 9 ఉగ్ర‌వాద స్థావ‌రాల‌ను నేల‌మ‌ట్టం చేయాల‌ని భార‌త సైన్యం భావించింది.

బ‌హ‌వ‌ల్పూర్ : జైషే మ‌హ్మ‌ద్ హెడ్ క్వార్ట‌ర్స్

పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో బ‌హ‌వ‌ల్పూర్‌ ఉంది. ఈ ఆప‌రేష‌న్‌లో ఇదే ప్ర‌ధాన టార్గెట్. జైషే ఈ మొహ‌మ్మ‌ద్ ప్ర‌ధాన కార్యాల‌యం ఈ సిటీలోనే ఉన్న‌ది. ఆ ఉగ్ర సంస్థ‌కు మ‌సూద్ అజార్ నేతృత్వం వ‌హిస్తున్నారు. ఇండియాలో జ‌రిగిన అనేక ఉగ్ర దాడుల‌కు ఆ సంస్థ‌తో లింకు ఉన్న‌ది. 2001లో పార్ల‌మెంట్‌పై జ‌రిగిన దాడి, పుల్వామా సూసైడ్ బాంబింగ్‌కు ల‌ష్క‌రే సంస్థే ప్ర‌ధాన కార‌ణం.

మురిద్కే : ల‌ష్క‌రే తోయిబా ప్ర‌ధాన కేంద్రం

పాకిస్తాన్‌లోని లాహోర్‌కు ఉత్త‌రం వైపున 40 కిలోమీట‌ర్ల దూరంలో ఉంది. ల‌ష్క‌రే తోయిబాకు ఇదో ముఖ్య కేంద్రం. ఇక్క‌డే ల‌ష్క‌రే కు చెందిన జ‌మాత్ ఉద్ ద‌వా వింగ్ ఉంది. సుమారు 200 ఎక‌రాల విస్తీర్ణంలో ఉన్న ఈ కేంద్రంలో ఉగ్ర‌వాద శిక్ష‌ణ ప్రాంతాలు, లాజిస్టిక్ స‌పోర్టు కేంద్రాలు, ఉప‌దేశ కేంద్రాలు ఉన్నాయి. 2008 ముంబై దాడుల‌కు చెందిన ఉగ్ర శిక్ష‌ణ ఇక్క‌డే జ‌రిగిన‌ట్లు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు.

కోట్లీ : బాంబ‌ర్ ట్రైనింగ్‌, టెర్ర‌ర్ లాంచ్ బేస్‌

పాక్ ఆక్ర‌మిత క‌శ్మీర్‌లో కోట్లీ కేంద్రం ఉన్న‌ది. సూసైడ్ బాంబ‌ర్లు, చొర‌బాటుదారుల‌కు ఇక్క‌డే శిక్ష‌ణ జ‌రుగుతుంది. ఇక్క‌డ ఒకేసారి 50 మంది ఉగ్ర‌వాదుల‌కు శిక్ష‌ణ ఇచ్చే సామ‌ర్థ్యం ఉన్న వ‌స‌తులు ఉన్నాయి.

గుల్‌పూర్ : లాంచ్ ప్యాడ్

రాజౌరీ, పూంచ్ జిల్లాల్లో జ‌రిగే దాడుల‌కు ఈ కేంద్రం లాంచ్‌ప్యాడ్‌లా ప‌నిచేస్తుంది. జ‌మ్మూక‌శ్మీర్‌లోని ఆ రెండు జిల్లాల్లో జ‌రిగే దాడుల‌కు గుల్‌పూర్‌ను ఉగ్ర‌వాదులు కేంద్రంగా మార్చుకున్న‌ట్లు గుర్తించారు. 2023, 2024 సంవ‌త్స‌రాల్లో ఇక్క‌డ నుంచే ఎక్కువ దాడులు జ‌రిగాయి. భార‌తీయ భ‌ద్ర‌తా కాన్వాయ్‌లు, పౌర కేంద్రాల‌ను ఇక్క‌డ నుంచి ఉగ్ర‌వాదులు టార్గెట్ చేసిన‌ట్లు భావిస్తున్నారు.

స‌వాయి : ల‌ష్క‌రే తోయిబా క్యాంప్

క‌శ్మీర్ లోయ‌ల్లో జ‌రిగే దాడుల‌కు ఇక్క‌డ ఉన్న ల‌ష్కరే క్యాంపున‌కు లింకు ఉన్న‌ది. ఉత్త‌ర క‌శ్మీర్‌లో జ‌రిగే దాడుల‌కు స‌వాయి క్యాంపుతో లింకు ఉన్న‌ట్లు గుర్తించారు. సోన్‌మార్గ్‌, గుల్మార్గ్, పెహ‌ల్గామ్‌లో జ‌రిగే దాడుల్లో స‌వాయి ఉగ్ర క్యాంపుతో లింకు ఉన్న‌ది.

స‌ర్జ‌ల్‌, బ‌ర్నాలా : చొర‌బాటు కేంద్రాలు

స‌ర్జ‌ల్, బ‌ర్నాలా చొర‌బాటుదారుల‌కు కేంద్రాలుగా మారిన‌ట్లు గుర్తించారు. అంత‌ర్జాతీయ స‌రిహ‌ద్దు, నియంత్ర‌ణ రేఖ‌కు ద‌గ్గ‌ర‌గా ఉన్న ఈ రెండు కేంద్రాలు.. చొర‌బాటుదారుల‌కే ముఖ్య కేంద్రాలుగా ఉన్న‌ట్లు భావిస్తున్నారు.

మెహ‌మూనా ఉగ్ర కేంద్రం : హిజ్బుల్ ముజాహీద్దిన్ అడ్డా

హిజ్బుల్ ముజాహిద్దిన్ ఇక్క‌డ ఉన్న‌ట్లు అంచ‌నా వేస్తున్నారు. సియాల్‌కోట్ కు స‌మీపంలో ఈ క్యాంపు ఉన్న‌ది. ఉగ్ర సంస్థ హిజ్బుల్ ముజాహిద్దిన్ దీన్ని వాడుతున్న‌ది. క‌శ్మీర్‌లో చాన్నాళ్ల నుంచి ఈ క్యాంపు యాక్టివ్‌గా ఉన్న‌ది. నిజానికి ఈ గ్రూపు ప్ర‌స్తుతం త‌న కార్య‌క‌లాపాల‌ను త‌గ్గించినా.. దాని ఆన‌వాళ్లు ఉన్నాయ‌న్న అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి.

బిలాల్ క్యాంపు

జైషే మ‌హ‌మ్మ‌ద్‌కు చెందిన మ‌రో ల్యాంచ్‌ప్యాడ్ ఇది. దీన్ని కూడా గ‌త రాత్రి ధ్వంసం చేశారు. చొర‌బాటుకు పాల్ప‌డ‌డానికి ముందు ఉగ్ర‌వాదులు ఇక్క‌డే బ‌స చేస్తారు. భార‌తీయ భూభాగంలోకి చొర‌బాడేందుకు ఈ క్యాంపును తుది ట్రాన్సిట్ పాయింట్‌గా భావిస్తారు.

Exit mobile version