8 members, 4 Teams, 4 Cities: Jaish Planned Delhi Blast to Take Revenge For Op Sindoor
- ఒకే సమయానికి నాలుగు నగరాల్లో పేలుళ్లు జరపాలన్న జైష్ యోచన
- అల్ఫలాహ్ యూనివర్సిటీ గది నెంబర్ 13 నుంచే మొత్తం ఆపరేషన్
- తుర్కీయే కనెక్షన్, ఎన్‌క్రిప్ట్ యాప్‌లు, టెరర్ డాక్టర్ల నెట్‌వర్క్
- ఎర్రకోట దాడి వెనక భయంకరమైన కుట్ర
(విధాత నేషనల్ డెస్క్)
The Delhi Blast Conspiracy | నవంబర్ 10న ఢిల్లీలోని చారిత్రక రెడ్‌ఫోర్ట్ వద్ద జరిగిన భయంకరమైన పేలుడు దేశవ్యాప్తంగా ఉగ్రవాదచర్యలపై మళ్లీ దృష్టి సారింపజేసింది. ఈ ఘటన వెనుక ఉన్న కుట్ర చాలా విస్తృతమైనదని విచారణాధికారులు వెల్లడించారు. జైష్-ఇ-మొహమ్మద్ (JeM)కు చెందిన ఎనిమిది మంది కుట్రదారులు కలిసి, దేశంలోని నాలుగు ప్రధాన నగరాల్లో ఒకేసారి పేలుళ్లు జరపాలని ప్రణాళిక రచించినట్లు ఆధారాలు లభించాయి. ఈ దాడి “ఆపరేషన్ సిందూర్”కు ప్రతీకార చర్యగా జైష్ చేసిన ఆపరేషన్‌లో ఒక భాగం. పాకిస్తాన్‌లోని జైష్ హెడ్‌క్వార్టర్ బహావల్పూర్లోనే ఈ ప్రణాళికను రచించారు.
ఈ కుట్రలో నాలుగు జంటలుగా ఏర్పడి, ఒక్కో జట్టు ఒక నగరంలో పేలుడు జరపాలని ప్లాన్ చేసింది. ప్రతి టీమ్ వద్ద ఒకటి కంటే ఎక్కువ IEDలు సిద్ధంగా ఉన్నట్లు విచారణలో బయటపడింది. డాక్టర్ ఉమర్ నబీ, డాక్టర్ ముజమ్మిల్ షకీల్ రాసుకున్న డైరీలలో “ఆపరేషన్”, “షిప్‌మెంట్”, “ప్యాకేజ్” అనే కోడ్ పదాలు తరచుగా కనిపించాయి. వీరు సమాచార మార్పిడి కోసం Telegram, Signal, Session యాప్‌లను ఉపయోగించారు.
అల్ఫలాహ్ యూనివర్సిటీ, బిల్డింగ్ 17, రూమ్ నెంబర్ 13 : ఉగ్రవాదుల క్యాంప్ ఆఫీస్
భద్రతాసంస్థలు గుర్తించిన వివరాల ప్రకారం, ఈ మొత్తం ఉగ్రపథకానికి కేంద్రం అల్ఫలాహ్ యూనివర్సిటీ లోని బిల్డింగ్ 17లో గది నెంబర్ 13. ఇదే గదిలో ముజమ్మిల్ ఇతర డాక్టర్లతో సమావేశాలు నిర్వహించాడు. సీజ్ చేసిన పెన్‌డ్రైవ్‌లు, నోట్‌బుక్స్, రసాయన పదార్థాలు అన్నీ IED తయారీకి ఉపయోగపడే వివరాలు, లక్షణాలతో ఉన్నట్లు ఫోరెన్సిక్ బృందం నిర్ధారించింది. పేలుడు కోసం JeM ఉపయోగించింది VBIED (Vehicle Borne IED).
నిఘా సంస్థల సమాచారం ప్రకారం ఉమర్, ముజమ్మిల్, అదీల్ అనే ముగ్గురు టెర్రర్ డాక్టర్లు గత ఏడాది తుర్కీయేకి వెళ్లి అక్కడ ISI ఆపరేటివ్‌లతో సమావేశమయ్యారు. ఆ తర్వాత వారు Session App ద్వారా ‘ఉకాసా’ అనే హ్యాండ్లర్‌తో నిరంతరం కమ్యూనికేషన్ కొనసాగించారు. ‘ఉకాసా’ అనే పేరు కూడా కోడ్ అయి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.
రెడ్‌ఫోర్ట్ వద్ద పేలిన వైట్ హ్యుందాయ్ i20 కారు నడిపింది డాక్టర్ ఉమర్ నబీ అని DNA పరీక్షలు నిర్ధారించాయి. స్టీరింగ్ వద్ద చిక్కుకున్న అతడి కాలు, దుస్తులు, దంత అవశేషాలు అన్నీ కుటుంబ సభ్యుల నమూనాలతో 100% సరిపోలాయి. ఈ దాడిలో 12 మంది మరణించగా, 25 మందికి గాయాలయ్యాయి. CCTV ఫుటేజ్ ప్రకారం, నవంబర్ 10 ఉదయం 8:04కు ఉమర్ బదర్పూర్ టోల్ గేట్ ద్వారా ఢిల్లీలో ప్రవేశించాడు. మధ్యలో ఫుడ్ స్టాప్, ప్రార్థనల తర్వాత మధ్యాహ్నం 3:19కి రెడ్‌ఫోర్ట్ పార్కింగ్‌లో కారును నిలిపాడు. సాయంత్రం 6:52కి కదులుతున్న కారులో పేలుడు సంభవించింది.
జైష్ ‘వైట్‌కోట్ మాడ్యూల్’ – 6గురు డాక్టర్ల టీమ్
ఈ మాడ్యూల్‌లో కీలక పాత్ర పోషించినవారు, డాక్టర్ ఉమర్ ఉన్ నబీ, డాక్టర్ అదీల్, డాక్టర్ ముజమ్మిల్ షకీల్, డాక్టర్ ముజఫర్ అహ్మద్ రాథర్, డాక్టర్ షహీన్ షాహిద్, డాక్టర్ మొహమ్మద్ అరిఫ్. వీరిందరికీ వేర్వేరు బాధ్యతలప్పగించారు.
ఉమర్ అక్టోబర్‌లో కాశ్మీర్ వెళ్లి బటమాలో, అవంతిపోరా ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించినట్లు NIA కనుగొంది. అక్కడే అతను పేలుడు కోసం ఉపయోగించిన హ్యుందాయ్ కారు కొనుగోలు చేశాడు. ఫరీదాబాద్ పోలీసు బృందం మరో కారు – ఎకోస్పోర్ట్ (DL10 CK0458ను) స్వాధీనం చేసుకుంది. అందులో కూడా పేలుడు పదార్థాలు ఉన్నాయేమోనని CFSL బృందం పరిశీలిస్తోంది. జైష్ మహిళా విభాగం నాయకురాలు డాక్టర్ షహీన్ షాహిద్ విచారణలో వెల్లడించిన సమాచారం ప్రకారం, లక్నో, కాన్పూర్, సహారన్‌పూర్‌లలో మహిళా రిక్రూట్‌మెంట్ కొనసాగుతుందని తేలింది. ఆమె వద్ద నుంచి అయోధ్య, వారణాసి దేవాలయాలపై దాడి ప్రణాళిక పత్రాలు కూడా బయటపడ్డాయి. ప్రస్తుతం NIA ఈ కేసును అధికారికంగా స్వీకరించి, దేశవ్యాప్త ఉగ్రనిధుల ప్రవాహం, ఎన్‌క్రిప్టెడ్ కమ్యూనికేషన్, రిక్రూట్ మార్గాలను విశ్లేషిస్తోంది. సుమారు 500 మంది సిబ్బందితో బహుళఏజెన్సీల విచారణ జరుగుతోంది.
ఢిల్లీ పేలుడు కేవలం ఒక ఉగ్రదాడి కాదు – అది జైష్ కుట్రల సిండికేట్‌కు సంబంధించిన సూత్రధారుల బలమైన నెట్‌వర్క్‌ను బహిర్గతం చేసింది. “రూమ్ నెంబర్ 13” నుంచి ప్రారంభమైన ఆ డాక్టర్ల ‘ఆపరేషన్’ ఇప్పుడు దేశవ్యాప్త దర్యాప్తుకు మూలమైంది.
