- ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్
- కాంగ్రెస్ ఖాతాలోకి చేరిన 12 మున్సిపాలిటీలు
- డ్రాలో కాంగ్రెస్ చేతికి చిక్కిన తొర్రూరు, జనగామ
- పట్టుదప్పినా… కాంగ్రెస్ ను వరించిన అదృష్టం
- పోరాడిన బీఆర్ఎస్ కు దక్కని సానుకూల ఫలితం
- ప్రతిష్టాత్మకంగా భావించిన బీఆర్ఎస్ నాయకత్వం
- పాపం …. బోరుమన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి
- ఎంపీ కావ్య ఓటు వివాదం పై కోర్టును ఆశ్రయిస్తారా?
విధాత, ప్రత్యేక ప్రతినిధి: ఉమ్మడి వరంగల్ జిల్లా మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. 12 మున్సిపాలిటీలు హస్తగతమయ్యాయి. కన్నుతప్పి లొట్టపోయినట్లు ఆ పార్టీ అపదలో చిక్కినట్లే చిక్కి గట్టెక్కెందుకు పరిస్థితులన్నీకలిసొచ్చాయి. ఆఖరికి అదృష్టం కూడా ఆ పార్టీనే వరించింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న విభేదాలు, మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య కొరవడిన సమన్వయం, నిన్నటి వరకు సీపీఐతో సాగిన పొత్తును అహంకారంతో కాలదన్నుకున్న తీరు, ఎమ్మెల్యేల్లో పెరిగిన అధికార నిర్లక్ష్యం బీఆర్ఎస్ పాలిట సానుకూలంగా మారినట్లే మారినప్పటికీ అదేంటో ఆఖరులో ఆ వరం మాత్రం లభించకుండా నిరాశ మిగిల్చింది. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా పోరాడినప్పటికీ విజయానికి కావాల్సిన ప్రజాదరణను చూరగొనలేకపోవడం ఆ పార్టీకి శాపంగా మారింది. ఇదే కాంగ్రెస్ నాయకులకు కలిసొచ్చింది. చివరలో ఆశగా మారిన తొర్రూరు, జనగామ మున్సిపాలిటీలను దక్కించుకోవడంలో బీఆర్ఎస్ ను దురదృష్టం వెంటాడగా డ్రాలో సైతం కాంగ్రెస్ కు అదృష్టం కలిసొచ్చింది.
గెలిచిన కాంగ్రెస్ , పోరాడి బీఆర్ఎస్
మున్సిపాలిటీ ఎన్నికల ప్రకటన వెలువడినప్పటి నుంచి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ తో పోల్చితే బీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జ్ లే సర్వశక్తులొడ్డారు. జిల్లా మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ జెండా ఎగురవేయడం ఖాయమనేంత ప్రచార ఆర్భాటం కనిపించింది. ఆ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ కూడా ఉమ్మడి జిల్లాలో రెండు రోజులు సుడిగాలి ప్రచారం చేసి రోడ్ షో లు నిర్వహించారు. ఎన్నికల ఫలితాల్లో మాత్రం ఓటమి వెంటాడింది. చాలా చోట్ల తక్కువ ఓట్లతో ఓటమిపాలయ్యారు. 12 మున్సిపాలిటీల్లో ఏడు కాంగ్రెస్ దక్కించుకున్నప్పటికీ ప్రతీ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కు కొంత ఆదరణ లభించింది. ఇక తొర్రూరులో ఆ పార్టీకి మెజారిటీ రాగా, నాలుగు స్థానాల్లో హంగు ఏర్పడడానికి దాదాపు కాంగ్రెస్ తో సమానంగా బీఆర్ఎస్ కు వచ్చిన వార్డులే ప్రధాన కారణం. ఇది కాంగ్రెస్ కు ఒక హెచ్చరికగా అంచనా వేస్తున్నారు. దీని నుంచి గుణపాఠం తీసుకోకుంటే రానున్న రోజుల్లో కాంగ్రెస్ కు కష్టాలు తప్పవంటున్నారు.
కాంగ్రెస్ ను రక్షించిన ఎక్స్ అఫిషియో ఓటు
హంగు ఏర్పడిన ఐదు మున్సిపాలిటీలు మహబూబాద్, తొర్రూరు, కేసముద్రం, వర్ధన్నపేట, జనగామల్లో కాంగ్రెస్ కు ఎక్స్ అఫిషియో ఓటు రక్షణగా నిలిచింది. చివరికి తొర్రూరు, జనగామల్లో డ్రా కూడా కాంగ్రెస్ నే వరించింది. హంగు ఏర్పడిన మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ ఒక్కటి కూడా దక్కించుకోకపోవడానికి ప్రధాన కారణం ఇండిపెండెంట్లు ఇరువైపులా చీలిపోయినప్పటికీ, ఎక్స్ అఫిషియో మెంబర్ల ఓట్లు కాంగ్రెస్ ను ఓటమి గండం నుంచి రక్షించాయి. హంగు ఏర్పడిన మహబూబాబాద్ లో ఇండిపెండెంట్లు, సీపీఎం, స్థానిక ఎమ్మెల్యే మురళీ నాయక్ ఓటు వల్ల కాంగ్రెస్ గట్టెక్కింది. కేసముద్రంలో మహబూబాద్ ఎంపీ బలరామ్ నాయక్ ఓటు పీఠం దక్కించింది. వర్ధన్నపేటలో ఇండిపెండెంట్ సభ్యురాలి ఓటుకు ఎమ్మెల్యే నాగరాజు ఓటు తోడుకావడంతో గండం నుంచి బయటపడ్డారు. తొర్రూరులో వరంగల్ ఎంపీ కడియం కావ్య, జనగామలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎక్స్అఫిషియో ఓటుతో డ్రాగా మారింది. చివరి వరకు అత్యంత ఉత్కంటగా మారిన ఈ రెండు స్థానాల్లో అదృష్టం కాంగ్రెస్ వైపు నిలిచింది.
గల్లంతైన బీఆర్ఎస్ ఆశలు
మున్నిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా పై బీఆర్ఎస్ పెట్టుకున్న ఆశలు మరోమారు గల్లంతయ్యాయి. ఆశలు రేపిన తొర్రూరు, జనగామల్లో డ్రా ద్వారా విజయం కాంగ్రెస్ ను వరించింది. తొర్రూరు పై పట్టుబిగించామని భావించిన ఎర్రబెల్లికి ఏం చేయాలో పాలుపోక బోరుమన్నారు. జనగామలో పల్లా లొల్లికి దిగారు. తొర్రూరులో కాంగ్రెస్ విజయం సాధించడానికి ఒక కారణమైన వరంగల్ ఎంపీ కడియం కావ్య ఓటు వివాదంగా మారిన విషయం తెలిసిందే. కావ్య గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎక్స్ అఫిషియో మెంబర్ గా ఉన్నారు. ఈ స్థితిలో కావ్యకు తొర్రూరు మున్సిపాలిటీలో ఓటుకు అవకాశం కల్పించారు. ఈ వివాదం పై బీఆర్ఎస్ నాయకులు కోర్టును ఆశ్రయిస్తామని ప్రకటించారు. దీనిపై బీఆర్ఎస్ పెట్టుకున్న దింపుడుగల్లం ఆశ ఏమైనా ఫలిస్తుందా? చూడాలి.
ఇదిలా ఉండగా పోగొట్టుకున్న చోటే వెదుక్కోవాలని బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ప్రయత్నిస్తోంది. అందుకే వరంగల్ పై ఆ పార్టీ తిరిగి కేంద్రీకరిస్తోంది. ఈ కారణంగానే పార్టీ రాష్ట్ర ప్లీనాన్ని, భారీ సభను ఇక్కడే నిర్వహించిన విషయం తెలిసిందే. టీఆర్ఎస్ / బీఆర్ఎస్ చరిత్రలో ఓరుగల్లుకు ప్రత్యేక స్థానముంది. ఓ వెలుగువెలిగిన స్థితి నుంచి ప్రస్తుతం జిల్లాలో ఒక్కగానొక్క జనగామ ఎమ్మెల్యేతో పాటు ముగ్గురు ఎమ్మెల్సీలు మిగిలారు. పార్లమెంటు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం సున్నా దక్కింది. పంచాయతీ ఎన్నికలు ఊపిరిపోయగా, ఈ మున్సిపల్ ఎన్నికల్లో జిల్లా నాయకత్వం శక్తియుక్తులు ప్రదర్శించినప్పటికీ ఆశించిన ఫలితాలు మాత్రం రావడం లేదనే చర్చసాగుతోంది. తాజాగా మున్సిపాలిటీ ఎన్నికలను బీఆర్ఎస్ అధిష్టానం, నియోజకవర్గ ఇంచార్జ్ లు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోరాడారు. ఫలితాలు మాత్రం ఆశించన స్థాయిలో రాలేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పోల్చితే బీఆర్ఎస్ పార్టీతోపాటు స్థానికంగా నాయకుల పై నెలకొన్న వ్యతిరేకత ఇంకా ప్రజల్లో తగ్గలేదనే అభిప్రాయం ఉంది.
ఇవి కూడా చదవండి..
జటిలంగా తెలంగాణ అక్రెడిటేషన్ అప్లికేషన్ మాడ్యుల్.. అరిగోస పడుతున్న జర్నలిస్టులు
Airport Cafe | ఇక నుండి ఎయిర్ పోర్టుల్లో టీ రూ.10, సమోసా రూ.20 అంతే!
Nizamabad Corporation : నిజామాబాద్ కార్పోరేషన్ లో బిగ్ ట్విస్ట్..ప్రతిపక్షానికి బీజేసీ సై !
Neem Datun | ఆన్‌లైన్‌లో వేప పుల్లలు.. ధర తెలిస్తే షాకే..!
ఇండియా-పాకిస్థాన్ బార్డర్‌లో కంచెకు సీసాలు ఎందుకు వేలాడదీస్తారో తెలుసా? దీని వెనుక ఇంత సీక్రెట్ ఉందా!
