Media Accreditation Controversy | జటిలంగా తెలంగాణ అక్రెడిటేషన్ అప్లికేషన్ మాడ్యుల్.. అరిగోస పడుతున్న జర్నలిస్టులు
నిజంగానే ఇది జర్నలిస్టులకు అక్రెడిటేషన్లు ఇచ్చేందుకు ఉద్దేశించిందేనా? ఎందుకంటే.. ఫేక్ జర్నలిస్టులను పక్కన పెడితే.. నిజమైన జర్నలిస్టు.. దశాబ్దాల అనుభవం ఉన్న జర్నలిస్టు కూడా దరఖాస్తు చేసుకోలేని దుస్థితి. ఎందుకంటే.. జర్నలిస్టు ప్రయాణంలో ఎన్ని దశలు ఉంటాయో.. ఎన్ని విభాగాలు, హోదాలు ఉంటాయో అన్నింటినీ నిర్వహించిన ఒక సీనియర్ పాత్రికేయుడు తనకు వెటరన్ కేటగిరీలో దరఖాస్తు చేసుకునే అవకాశం లేదంటే ఈ జర్నలిస్టు అక్రెడిటేషన్ కార్డులు ఎవరికి ఇవ్వదల్చుకున్నారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
- కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు
- అయినా సరిచేసే నాధుడే లేరు
- మూగనోములో జర్నలిస్టు సంఘాలు
విధాత, హైదరాబాద్:
Media Accreditation Controversy | మీడియా అక్రెడిటేషన్ కార్డ్! రాష్ట్రంలో జర్నలిస్టులకు ప్రభుత్వ పరంగా ఇచ్చే గుర్తింపు! ఇందుకోసం అక్రెడిటేషన్లు ఇచ్చే ప్రతి సమయంలో ప్రభుత్వం ఒక తంతు నిర్వహిస్తుంది. అదే దరఖాస్తుల సమర్పించడం! కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్ల తర్వాత.. అది కూడా సుదీర్ఘ ‘కసరత్తు’ తర్వాత ఈ తంతును మొదలు పెట్టింది. దరఖాస్తు చేసుకోవడం మొదలు పెట్టిన జర్నలిస్టులకు ఆదిలోనే ఒక సందేహం వ్యక్తమైంది. నిజంగానే ఇది జర్నలిస్టులకు అక్రెడిటేషన్లు ఇచ్చేందుకు ఉద్దేశించిందేనా? ఎందుకంటే.. ఫేక్ జర్నలిస్టులను పక్కన పెడితే.. నిజమైన జర్నలిస్టు.. దశాబ్దాల అనుభవం ఉన్న జర్నలిస్టుల కూడా దరఖాస్తు చేసుకోలేని దుస్థితి. ఎందుకంటే.. జర్నలిస్టు ప్రయాణంలో ఎన్ని దశలు ఉంటాయో.. ఎన్ని విభాగాలు, హోదాలు ఉంటాయో అన్నింటినీ నిర్వహించిన ఒక సీనియర్ పాత్రికేయుడు తనకు వెటరన్ కేటగిరీలో దరఖాస్తు చేసుకునే అవకాశం లేదంటే ఈ జర్నలిస్టు అక్రెడిటేషన్ కార్డులు ఎవరికి ఇవ్వదల్చుకున్నారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
తాంబూలాలు ఇచ్చాం తన్నుకు చావండి అనే విధంగా తెలంగాణ ఐ అండ్ పీఆర్ విభాగం పనితీరు ఉందన్న విమర్శలు పాత్రకేయ లోకంలో వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులకు అక్రెడిటేషన్లు జారీ చేసేందుకు రూపొందించిన అక్రిడిటేషన్ వెబ్ పోర్టల్ మాడ్యుల్ పెద్ద తలనొప్పిగా తయారైంది. అక్రెడిటేషన్ల కోసం దరఖాస్తు చేసుకునే జర్నలిస్టులు యాదగిరిగుట్ట మెట్లు ఎక్కేందుకు ఎన్ని పాట్లు పడతారో అంతకన్నా ఎక్కువగా ఈ మాడ్యుల్‌తో ఇబ్బందులు పడుతున్నారు. ఇన్ని ఇబ్బందులు పడినా ఒక్క మెట్టు కూడా ఎక్కే పరిస్థితి లేదని జర్నలిస్టులు వాపోతున్నారు. కంప్యూటర్ యుగంలో దరఖాస్తు చేసుకునే విధానం సరళంగా ఉండాలి. కానీ.. అసలు జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డులు నిరాకరించే ఉద్దేశంతోనే మాడ్యూల్‌ను సిద్ధం చేశారా? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి.
వెబ్ పోర్టల్‌లో అక్రెడిటేషన్ అప్లికేషన్ మాడ్యూల్‌లోకి వెళ్ళి రిజిస్టర్ చేసుకునేందుకు తొలుత మొబైల్ నంబర్ నమోదు చేసుకుంటే వన్ టైమ్ పాస్ వర్డ్ (ఓటీపీ) వస్తుంది. ఓటీపీ నమోదు తరువాత మరో విండో కన్పిస్తుంది. ఈ విండోలో అక్రెడిటేషన్ టైప్, బేసిక్ డిటెయిల్స్, ప్రొఫెషనల్ డిటెయిల్స్, అక్రెడిటేషన్ డిటెయిల్స్ పేరుతో నాలుగు దశలు ఏర్పాటు చేశారు. ఒక దశ నుంచి మరో దశకు వెళ్లడానికి అనేక షరతులు పెట్టారు. ఉదాహరణకు పాతిక సంవత్సరాల అనుభవం ఉన్న వర్కింగ్ జర్నలిస్టు నమోదు చేసుకోవాలంటే తొలుత ఫ్రీలాన్సర్, ఆ తరువాత కరస్పాండెంట్, స్టేట్ కార్డు అని వివరాలు నమోదు చేయాలి. ఆ తరువాత కంటిన్యూ బటన్ నొక్కితే బేసిక్ డిటెయిల్స్, ఆ తరువాత రెసిడెన్స్ అడ్రస్ వివరాలు నమోదు చేయాలి. ప్రొఫెషనల్ డిటెయిల్స్‌లో ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారో ఆ వివరాలు తెలియచేయాలి. ఇందుకు సంబంధించిన నియామక ఉత్తర్వులు పత్రాలను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.
రాష్ట్రంలో రెండు మూడు పత్రికలు తప్ప మెజారిటీ దినపత్రికల్లో అపాయింట్‌మెంట్ లెటర్లు ఇచ్చిన దాఖలాలు లేవు. ఈ విషయం ఐఅండ్ పీఆర్ విభాగంలో పనిచేస్తున్న అధికారులకు కూడా పూర్తిగా తెలుసు. సామాజిక, ఆర్థిక, చారిత్రక, రాజకీయ అంశాలపై లోతైన అవగాహన ఉన్న అనేక మంది అప్పట్లో ఎడిటర్ స్థాయిలో.. అందులోనూ ప్రముఖ దినపత్రికల్లో పనిచేశారు. ఏ ఒక్క రోజు కూడా వారి విద్యార్హత చర్చకు రాలేదు. అలాంటి గొప్పవాళ్లలో టెన్త్‌తో ఆగిపోయినవారు కూడాఉన్నారు. ఇప్పుడు వారు కూడా విద్యార్హత సర్టిఫికెట్లు అప్‌లోడ్ చేయాల్సిన పరిస్థితులు కల్పించారు. దీంతోపాటు గత ఆరు నెలలుగా మేజర్ లేదా మీడియం పేపర్లలో గత ఆరు నెలలుగా వార్తలు రాసి ఉండాలి. అది కూడా బైలైన్ పేరుతో ఉండాలి అని షరతు పెట్టారు. ఈ స్టెప్ దాటిన తరవాత అక్రెడిటేషన్ డిటెయిల్స్‌లో పాత కార్డుల ప్రతులను అప్‌లోడ్ చేస్తే నాలుగు దశలను దాటుతారు. హమ్మయ్య అయిపోయింది… ఇక సబ్మిట్ చేసే దశకు చేరుకున్నామని సంతోషపడే వారికి కొద్ది నిమిషాల్లోనే షాక్ తగులుతుంది. చివరి దశ ప్రివ్యూలో అన్ని వివరాలు సక్రమంగా నమోదు చేసినట్లు నిర్థారణ చేసుకున్న తరువాత సబ్మిట్ బటన్ నొక్కితే ఎర్రర్, నాట్ అలౌడ్.. ఇలా రకరకాల పేర్లు వెబ్ పోర్టల్‌లో దర్శనమిస్తాయి. దీంతో కథ మళ్లీ మొదటికి వస్తుంది. ఇంకో విచిత్రం ఏమంటే ఎడిటర్‌గా పనిచేసే వాళ్లు కరస్పాండెంట్ కింద దరఖాస్తు చేసుకోవాల్సిన దుస్థితి ఉంది. ఎల్.కే.జీ నుంచి డిగ్రీ వరకు చదివినట్లు సర్టిఫికెట్లు, సర్క్యులేషన్ సర్టిఫికెట్లు ఇలా సవాలక్ష పత్రాలను అడుగుతోంది.
పత్రికలు సాధారణంగా జర్నలిస్టులను నియమించే సమయంలో అన్నీ అర్హతలు పరిశీలించిన తరువాత నియమించుకుని చేసుకుని శిక్షణ ఇస్తుంటుంది. అలాంటి వారికి కూడా తామే ఉద్యోగాలు ఇస్తున్నామనే విధంగా ఐ అండ్ పీఆర్ శల్య పరీక్ష చేస్తున్నదని జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాలుగు దశాబ్దాలు జర్నలిజంలో ఉండి ఎడిటర్ స్థాయి వరకు వెళ్లిన పెద్దలను కూడా ప్రొఫెషనల్ సర్టిఫికెట్ అడుగుతుందంటే ఎంత ‘సరళంగా’ మాడ్యూల్ తయారు చేశారో అర్థమవుతుంది. సాధారణంగా రాజకీయ నాయకులకు విద్యార్హలకు సంబంధించి ఎలాంటి ధృవీకరణలు అవసరం ఉండదు. కానీ.. ఒక జర్నలిస్టు విషయానికి వస్తే.. ఆయన సుదీర్ఘ అనుభవం.. సామాజిక అంశాలపై ఆయన అవగాహన.. వివిధ పత్రికలు, మీడియా సంస్థల్లో ఆయన అందించిన సేవలు.. వందల మంది జర్నలిస్టులను తీర్చిదిద్దిన గురుతుల్య బాధ్యతలు.. ఇవే కొలమానాలు. అలాంటి దశాబ్దాల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్టుకు సైతం ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్ అడుగుతున్నారంటే.. ఇది జర్నలిస్టులకు అక్రెడిటేషన్లు ఇచ్చేందుకా? చెత్తబుట్టలోకి వేసేందుకా? అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
ఏ ఒక్క యూనియన్ కూడా ఇలాంటి కఠిన నిబంధనలపై నోరు విప్పడం లేదని, ఐ అండ్ పీఆర్‌ను కనీసం ప్రశ్నించడం లేదని జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముప్పై సంవత్సరాల క్రితం జారీ చేసిన పత్రాలను అడగడం అన్యాయమంటున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే సజావుగా అక్రెడిటేషన్ కార్డులు జారీ చేశారని, ప్రత్యేక తెలంగాణలో ఆన్‌లైన్ దరఖాస్తుకు సవాలక్ష సంకెళ్లు వేస్తున్నారని మండిపడుతున్నారు.
ప్రధాన పత్రికలలో పనిచేసి, ఆ తరువాత బయటకు వచ్చిన సీనియర్ జర్నలిస్టులు తమ వ్యాపకాన్ని కొనసాగించేందుకు న్యూస్ వెబ్ పోర్టల్‌లో పనిచేస్తున్నారు. అందులో మాజీ ఎడిటర్లు కూడా ఉన్నారు. వారిని కూడా బైలైన్‌తో ఉన్న 20 వార్తలు లేదా ప్రత్యేక కథనాలు అప్‌లోడ్ చేయాలని అక్రెడిటేషన్ మాడ్యూల్ అడుగుతోంది. ఇవి అప్‌లోడ్ చేస్తే తప్ప తదుపరి దశకు వెళ్లడం కుదరదు. వెబ్ పోర్టల్‌లో పనిచేసే సీనియర్ జర్నలిస్టు, మాజీ ఎడిటర్లు ప్రత్యేక వ్యాసాలు, కథనాలు, వార్తలు రాసినా… ప్రధాన పత్రికలు, మేజర్ పత్రికలు, మీడియం పత్రికలు ప్రచురించే పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో లేవు. ఫ్రీలాన్సర్ కాకుండా ప్రముఖ పత్రికల్లో పనిచేస్తున్న వారు, టీవీ చానళ్లలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. ఏ ఒక్కరికి కూడా మూడు నాలుగు సార్లు ప్రయత్నిస్తే తప్ప చివరి దశ ప్రివ్యూ పూర్తి కావడం లేదు. అసలు ఈ నమూనాను ఎవరు రూపొందించారు? కనీస అవగాహన లేకుండా ఆన్‌లైన్ మాడ్యూల్ తయారు చేశారా? అంటూ పలువురు డెస్క్ సిబ్బంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. మాసబ్ ట్యాంక్‌లోని ఐఅండ్ పీఆర్ కార్యాలయంలో పని చేసే అధికారులకు ఫోన్ చేసి మండిపడుతున్నారు.
ఇక జిల్లా జర్నలిస్టుల పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. వందల మంది జర్నలిస్టులు, లోకల్ విలేకర్లు ఫోన్లు చేస్తున్నా ఐఅండ్ పీఆర్ ఉన్నతాధికారులు సరిదిద్దే ప్రయత్నం చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి. అక్రెడిటేషన్ మాడ్యూల్‌ను ఇప్పటికైనా సరిచేసి, సరళతరం చేయాలని జర్నలిస్టు వర్గాలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నాయి. మాడ్యుల్‌లో మార్పులు చేయనట్లయితే జర్నలిస్టుల నుంచి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకోవాల్సి ఉంటుంది.
ఇవి కూడా చదవండి..
Dario Costa | పైలట్ డారియో కోస్టా మరో అరుదైన ఫీట్.. 120 కి.మీ వేగంతో దూసుకెళ్తున్న రైలుపై విమానం ల్యాండింగ్
KTR counter attack| మాది ఫైటర్ల జాతి, మీది ట్రెయిటర్ల (ద్రోహుల) జాతి: సీఎం రేవంత్ కు కేటీఆర్ కౌంటర్
Lukewarm Water | గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల కలిగే లాభాలు తెలుసా..?
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram