Nizamabad Corporation : నిజామాబాద్ కార్పోరేషన్ లో బిగ్ ట్విస్ట్..ప్రతిపక్షానికి బీజేసీ సై !

నిజామాబాద్ కార్పోరేషన్‌లో హంగ్ పరిస్థితి. 28 సీట్లు గెలిచిన బీజేపీ ప్రతిపక్షంలోనే ఉంటామని ప్రకటన. మేయర్ పీఠంపై ఉత్కంఠ.

Nizamabad Corporation : నిజామాబాద్ కార్పోరేషన్ లో బిగ్ ట్విస్ట్..ప్రతిపక్షానికి బీజేసీ సై !

విధాత : నిజామాబాద్ కార్పోరేషన్ మేయర్ పీఠం ఎన్నిక వ్యవహారం కీలక మలుపు తీసుకుంది. ఇక్కడ 60 డివిజన్లకు జరిగిన ఎన్నికలలో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ దక్కకపోవడంతో హంగ్ ఏర్పడింది. దీంతో నిజామాబాద్ మేయర్ పీఠం ఎవరి కైవసం అవుతుందన్నదానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే తాజాగా బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఈ సస్పెన్స్ కు తెరదించుతు కీలక వ్యాఖ్యలు చేశారు. మేం కార్పొరేషన్ లో ప్రతిపక్షంలో ఉంటామని ప్రకటించారు.

నిజామాబాద్ కార్పొరేషన్‌ ఎన్నికల్లో 60 స్థానాలకుగాను.. ఈ ధఫా కూడా 28 స్థానాలతో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. మేయర్ పీఠం సాధించేందుకు అవసరమైన 31 స్థానాల మ్యాజిక్‌ ఫిగర్‌కు మూడు అడుగుల దూరంలో బీజేపీ మరోసారి నిలిచిపోయింది. మరోవైపు బీజేపీకి ముగ్గురు ఎక్స్‌ అఫీషియో సభ్యులు ఉన్నారు. వారి ఓట్లతో మేయర్‌ పీఠం కోసం కమలం పార్టీ కూడా ప్రయత్నాలు చేసే అవకాశం ఉండింది. అయితే ఎన్నికల్లో కాంగ్రెస్‌ 17, ఎంఐఎం 14 డివిజన్లను గెలుచుకున్నాయి. బీఆర్ఎస్ ఒక్క స్థానంలో విజయం సాధించింది. కాంగ్రెస్‌, ఎంఐఎం జతకడితే 31 స్థానాలతో మ్యాజిక్‌ ఫిగర్‌ను అందుకునే అవకాశాలున్నాయి. దీనికితోడు ఎక్స్‌ అఫీషియో సభ్యుల రూపంలో కాంగ్రెస్‌కు రెండు ఓట్లు అదనంగా ఉన్నాయి. ఎమ్మెల్సీగా వ్యవహరిస్తున్న పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి ఎక్స్ అఫీషియో ఓట్లు కలిపితే కాంగ్రెస్ బలం కూడా 33కు చేరుతుంది. బీఆర్‌ఎస్‌ తరఫున గెలిచిన ఏకైక కార్పొరేటర్‌ను కాంగ్రెస్‌ పార్టీ శుక్రవారం రాత్రే తన శిబిరంలోకి లాగేసుకుంది. దీంతో అధికార పార్టీ బలం మరింత పెరిగినట్లయింది. ఈ పరిణామాల మధ్య ప్రతిపక్షంలో కూర్చోవాలని బీజేపీ నిర్ణయించుకోవడం ఆసక్తికరంగా మారింది.

ఎక్స్ అఫిషియో ఒటర్లు అదనపు బలం

28 డివిజన్లు గెలిచిన బీజేపీకి ఎంపీ అర్వింద్ తో పాటు అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఎక్స్ అఫీషియో ఓట్లు కలిపితే 31 ఓట్లు అవుతాయి. బీజేపీకి కరీంనగర్–​-మెదక్–​-నిజామాబాద్– అదిలాబాద్ ఎమ్మెల్సీ సెగ్మెంట్ నుంచి గెలిచిన గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీలు మల్క కొమురయ్య, చిన్నమైల్ అంజిరెడ్డి ఉన్నారు. ఒకవేళ వారిద్దరు నిజామాబాద్ కార్పొరేషన్​లో ఎక్స్​అఫీషియో ఓట్లు నమోదు చేసుకుంటే మొత్తం బలం 33 అవుతుంది. అయితే కాంగ్రెస్, ఎంఐఎం కలిస్తే మ్యాజిక్ ఫిగర్ పూర్తికానున్న నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీల ఎక్స్ అఫిషియో ఓటర్లకు ప్రాధాన్యత లేకుండా పోయింది.

పాత కథ బీజేపీకి పునరావృతం

గత 2020ఎన్నికలలోనూ కూడా బీజేపీ సొంతంగా 28 చోట్లా గెలిచి అతిపెద్ద పార్టీగా నిలిచినప్పటికి.. మేయర్​ పదవిని దక్కించుకోలేకపోయింది. అప్పుడు కూడా నిజామాబాద్ కార్పొరేషన్‌లో ఏ ఒక్క పార్టీకి పూర్తి మెజార్టీ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది.బీఆర్ఎస్ ​13 చోట్ల మాత్రమే గెలిచినప్పటికి.. 16 మంది మజ్లిస్, ఒక ఇండిపెండెంట్ కార్పొరేటర్, ఐదుగురు ఎక్స్​ అఫీషియో మెంబర్ల బలంతో మేయర్ పీఠంను బీఆర్ఎస్ ఎగరేసుకపోయింది. మళ్లీ ఇప్పుడు కూడా బీజేపీకి అదే సీన్ పునరావృతమయ్యేట్లుగా కనబడుతుంది.

రూ.8కోట్లకు పైగా పన్ను కట్టి ఓడిన కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి

నిజామాబాద్ కార్పోరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ మేయర్ అభ్యర్థిగా 19వ డివిజన్ నుంచి పోటీ చేసిన కాటిపట్ల శమంత ఓటమి పాలైంది. అమె ఎన్నికల్లో పోటీ చేసేందుకు కార్పోరేషన్ ఉన్న రూ.8కోట్లకు పైగా బకాయి చెల్లించి సంచలనం రేపారు. ఎన్నికల్లో ఓడిపోయి కూడా ఆమె అంతే సంచలనంగా మిగిలారు. అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటి అన్నట్లుగా శమంత ఓటమి వ్యవహారం నిలిచిపోయింది. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేసినప్పటికి కాంగ్రెస్ కు సొంతంగా మేయర్ పీఠం గెలుచుకునే మెజార్టీ దక్కలేదు. శమంత ఓటమితో ఇప్పుడు కాంగ్రెస్-ఎంఐఎం మేయర్ అభ్యర్ధిగా ఎవరిని ఎంపిక చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

ఇవి కూడా చదవండి :

Neem Datun | ఆన్‌లైన్‌లో వేప పుల్ల‌లు.. ధ‌ర తెలిస్తే షాకే..!
Engine Explosion | 27 వేల అడుగుల ఎత్తులో విమానం.. ఒక్క‌సారిగా పేలిన‌ ఇంజిన్