• Telugu News
  • /National

10 month old Alin saves five lives | ప్రాణ‌దాత‌.. ఐదుగురికి జీవితాన్ని ప్ర‌సాదించిన 10 నెల‌ల‌ చిన్నారి

కేర‌ళ‌ (Kerala)కు చెందిన 10 నెల‌ల చిన్నారి (10 month old) అలిన్ షెరిన్ అబ్ర‌హం (Alin Sherin Abraham) బ్రెయిన్ డెడ్‌ (brain dead)తో ప్రాణాలుకోల్పోయింది. అయితే చ‌నిపోతూ ఆ పాప మ‌రో ఐదుగురికి జీవితాన్ని ప్ర‌సాదించింది. అవ‌య‌వ‌దానం చేసి రాష్ట్రంలోనే అతి పిన్న వయస్కురాలైన అవయవ దాతగా నిలిచింది (Keralas youngest organ donor).

Reported by: Tejaswini Nanna | జాతీయం | Feb 14, 2026, 1:16 pm IST
Read Time: 7 mins
10 month old Alin saves five lives | ప్రాణ‌దాత‌.. ఐదుగురికి జీవితాన్ని ప్ర‌సాదించిన 10 నెల‌ల‌ చిన్నారి

10 month old Alin saves five lives | త‌ల్లి ఒడిలో ఆడుకోవాల్సి వ‌య‌సు ఆ చిన్నారిది. కానీ విధి వెక్కిరించింది. రోడ్డు ప్ర‌మాదం రూపంలో మృత్యువు క‌బ‌లించింది. ఏడాది కూడా గ‌డ‌వ‌క‌ముందే ఆ చిన్నారికి నిండు నూరేళ్లు నిండిపోయాయి. అయితే, ఆ ప‌సికందు చ‌నిపోతూ మ‌రో ఐదుగురి ప్రాణాలు నిల‌బెట్టింది. అవ‌య‌వ‌దానంతో ప్రాణదాత‌గా నిలిచింది.

ఏం జ‌రిగిందంటే..?

కేర‌ళ రాష్ట్రం ప‌త‌నంతిట్ట జిల్లా మ‌ల్ల‌ప‌ల్లికి చెందిన అరుణ్ అబ్రహం, షెరిన్ ఆన్ జాన్ దంప‌తుల‌కు 10 నెల‌ల చిన్నారి అలిన్ షెరిన్ అబ్ర‌హం (Alin Sherin Abraham) ఉంది. ఈనెల 5న వారు త‌మ బిడ్డ‌తో క‌లిసి కారులో ప్ర‌యాణిస్తున్నారు. ఆ స‌మ‌యంలో వారు ప్ర‌యాణిస్తున్న వాహ‌నాన్ని మ‌రో కారు బ‌లంగా ఢీ కొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో వారంతా గాయ‌ప‌డ్డారు. కానీ చిన్నారి అలిన్ షెరిన్ మాత్రం తీవ్రంగా గాయ‌ప‌డింది.

పాప‌కు బ్రెయిన్ డెడ్

కుటుంబ స‌భ్యులు ఆ చిన్నారిని వెంట‌నే స్థానికంగా ఉన్న చంగ‌న‌స్సేరి ఆసుప‌త్రికి తీసుకెళ్లారు. ప్ర‌థ‌మ చికిత్స అనంత‌రం తిరువ‌ల్ల ఆసుప‌త్రికి తీసుకెళ్లారు. అక్క‌డ చిన్నారిని ప‌రీక్షించిన వైద్యులు కొచ్చి (Kochi)కి తీసుకెళ్లాల‌ని సూచించారు. దీంతో ఈనెల 7వ తేదీన త‌ల్లిదండ్రులు త‌మ చిన్నారిని కొచ్చిలోని అమృత ఆసుప‌త్రికి తీసుకెళ్లారు. అక్క‌డ వైద్యులు చిన్నారికి ప‌రీక్ష‌లు నిర్వ‌హించి చికిత్స అందించారు. అయితే, పాప చికిత్స‌కు స‌హ‌క‌రించ‌లేదు. ఈ క్ర‌మంలో ఈ నెల 13న పాప‌కు బ్రెయిన్ డెడ్ (brain dead) అయిన‌ట్లు వైద్యులు గుర్తించి త‌ల్లిదండ్రుల‌కు చెప్పారు. పాప బ‌తికే ఛాన్స్ లేద‌ని తెలిపారు.

పుట్టెడు దుఃఖంలోనూ

ఈ విష‌యం విన్న త‌ల్లిదండ్రులు ఒక్క‌సారిగా కుప్ప‌కూలిపోయారు. త‌మ క‌ళ్ల‌ముందే అల్లారు ముద్దుగా పెరిగిన ప‌సికందు బ‌త‌క‌ద‌ని తెలిసి క‌న్నీరుమున్నీరుగా విల‌పించారు. అయితే, పుట్టెడు దుఃఖంలోనూ ఆ పేరెంట్స్ సాహ‌సోపేత నిర్ణ‌యం తీసుకున్నారు. చిన్నారి మ‌రొక‌రి రూపంలో బ‌తికే ఉండాల‌ని భావించి.. అవ‌య‌వ దానానికి ముందుకొచ్చారు. వారి అంగీకారంతో వైద్యులు చిన్నారి నుంచి కిడ్నీలు, గుండె వాల్వ్‌, క‌ళ్లు, కాలేయం సేక‌రించారు. వాటిని అవ‌స‌ర‌మైన వారికి అమ‌ర్చారు.

అతి పిన్న వయస్కురాలైన అవయవ దాత..

తిరువనంతపురం మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్న ఓ 10 ఏళ్ల బాలుడికి ఆలిన్ రెండు కిడ్నీలను అమర్చనున్నారు. కిమ్స్ ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్న 6 నెలల పసికందుకి కాలేయాన్ని దానం చేశారు. ఆస్టర్ మెడ్‌సిటీలో చికిత్స పొందుతున్న మరో చిన్నారికి గుండె వాల్వ్ అందించారు. అమృత ఆసుపత్రిలోని అంధులైన చిన్నారులకు చూపునిచ్చేందుకు కళ్లను దానం చేశారు. ఇలా ఆ చిన్నారి చ‌నిపోతూ ఐదుగురి ప్రాణాల‌ను నిల‌బెట్టింది. దీంతో రాష్ట్రంలోనే అతి పిన్న వయస్కురాలైన అవయవ దాతగా నిలిచింది (Keralas youngest organ donor).

ఈ ఘ‌ట‌న‌పై కేర‌ళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ భావోద్వేగానికి గుర‌య్యారు. ఊహించ‌ని న‌ష్టాన్ని ఎదుర్కొంటున్న‌ప్ప‌టికీ ఆ త‌ల్లిదండ్రులు తీసుకున్న నిర్ణ‌యం మ‌రికొంద‌రి ప్రాణాలు కాపాడింద‌ని పేర్కొన్నారు. పుట్టెడు దుఃఖంలోనూ వారు తీసుకున్న నిర్ణ‌యం సాహ‌సోపేత‌మైనద‌ని, నిస్వార్థ‌మైన‌దిగా కొనియాడారు. ఈ మేర‌కు బాధిత కుటుంబానికి ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేశారు. చిన్నారి లేని లోటు తీర్చ‌లేనిదంటూ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి :

Condom crisis | ఒలింపిక్స్ విలేజ్‌లో కండోమ్స్ కొర‌త‌.. 3 రోజుల్లో 10వేల కండోమ్స్‌ ఖ‌తం
Asifabad municipality | నిన్న‌టి వ‌ర‌కు బ‌జ్జీల బండి విక్రేత‌.. ఇప్పుడిక మున్సిపాలిటీ కౌన్సిల‌ర్..