దేశ ప్రజలు, రైతులకు భారత వాతావరణ శాఖ గుడ్ న్యూస్ తెలిపింది. నైరుతి రుతుపవనాలు కేరళం తీరాన్ని తాకినట్లుగా వెల్లడించింది. రుతు పవనాలు కేరళం, తమిళనాడులోకి ప్రవేశించాయని, దీంతో ఆయా తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని పేర్కొంది. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం రుతుపవనాలు ఆలస్యంగా కేరళంలోకి ప్రవేశించాయి అని తెలిపింది. వాస్తవానికి మే 26వ తేదీనే ఇవి కేరళం తీరాన్ని తాకే అవకాశం ఉందని తొలుత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది. కానీ, ఈసారి ఎల్‌నినో ప్రభావంతో ఆ అంచనాలు తలకిందులయ్యాయి.

ఆలస్యంగానైనా కేరళంలో ప్రవేశించిన రుతుపవనాల ప్రభావంతో కేరళం, తమిళనాడులలో భారీ వర్షాలు పడుతున్నాయి. కేరళంలోని 3 జిల్లాలు అలప్పుళ, కొట్టాయం, ఎర్నాకుళంలకు ఐఎండీ ఆరెంజ్‌ హెచ్చరికలు జారీ చేసింది. రుతుపవనాల ప్రభావం తమిళనాడులోనూ కనిపిస్తోంది. ఆ రాష్ట్రంలోని 15 జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది. రుతు పవనాలు అరేబియా సముద్రం, లక్షద్వీప్, తమిళనాడు ప్రాంతాలలో కూడా రుతుపవనాలు విస్తరిస్తున్నాయి.

వారం రోజుల్లో తెలంగాణకు..

రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించేందుకు మరో వారం రోజుల సమయం పట్టే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.ప్రస్తుతం కేరళం, తమిళనాడు మీదుగా ఈ రుతుపవనాలు ఉత్తర దిశగా ప్రయాణిస్తున్నాయి.

ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది నైరుతి రుతుపవన కాలంలో (జూన్‌-సెప్టెంబరు) సాధారణం కంటే తక్కువ వర్షపాతమే నమోదవుతుందని వాతావరణ విభాగం అంచనా వేసింది. దీర్ఘకాల సగటుతో పోలిస్తే 90% వర్షమే ఈ సీజన్‌లో కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. పసిఫిక్‌ మహాసముద్ర ప్రాంతంలో ఎల్‌నినో పరిస్థితులు ఏర్పడుతున్నాయని, జూన్‌లో ఇవి బలహీనంగా ఉన్నా.. సెప్టెంబరులో మాత్రం బలంగా ఉండే అవకాశం ఉందని అంచనా వేసింది.