• Telugu News
  • /Telangana

తెలంగాణలో నేడు.. రేపు భారీ వర్షాలు

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో వరుస వర్షాలు కురుస్తున్నాయి. బుధ, గురువారాలలో సైతం రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

Reported by: Y.V. Narsimha Reddy | తెలంగాణ‌ | Jul 29, 2026, 12:45 pm IST
Read Time: 4 mins
తెలంగాణలో నేడు.. రేపు భారీ వర్షాలు

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో వరుస వర్షాలు కురుస్తున్నాయి. బుధ, గురువారాలలో సైతం రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. జిల్లాలలో వాగులు, నదులకు వరద ఉదృతి పెరిగింది. పలు చోట్ల వరద ఉద్ధృతికి రహదారులు కొట్టుకుపోయి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జలాశయాలలో క్రమంగా నీటి మట్టం పెరుగుతూ జలకళ సంతరించుకుంటున్నాయి.

మెదక్ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గ భవాని ఆలయ సమీపంలో ఉన్న వనదుర్గ ఆనకట్ట పొంగిపొర్లుతోంది. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలోని అనంతారం వాగు, నేరెళ్ల వాగు జాతీయ రహదారి పై నుంచి ప్రవహిస్తుండటంతో జగిత్యాల- ధర్మపురి మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కామారెడ్డి జిల్లా బీర్కూర్ లో మంజీరా నదిలో చెక్ డ్యామ్ పై నుంచి నీరు ప్రవహిస్తుంది. నిజామాబాద్, అదిలాబాద్, వరంగల్ జిల్లాలలో సైతం పలు వాగులు, వంకలు పొంగిపొర్లి ప్రవహిస్తున్నాయి. ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి బొగత జలపాతం ప్రమాదకరంగా ప్రవహిస్తుండటంతో సందర్శన తాత్కాలికంగా నిలిపివేశారు.

వాయుగుండం ప్రభావంతో ఉత్తర, పశ్చిమ, ఈశాన్య తెలంగాణ జిల్లాలలో భారీ వర్షాలు కురియనున్న నేపథ్యంలో హన్మకొండ, జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు ఆరెంజ్‌ హెచ్చరికలు జారీ చేసింది. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, జనగాం, కామారెడ్డి, ఖమ్మం, కుమురం భీమ్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, ములుగు, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో మేఘావృతమైన వాతావరణంతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశముందని వెల్లడించారు.