న్యూఢిల్లీ : ఢిల్లీ ఎర్రకోట(Delhi Red Fort Explosion) వద్ధ జరిగిన కారు బాంబు పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 13కు పెరిగింది. పేలుడు ఘటనలో గాయపడిన మరో వ్యక్తి చికిత్స పొందుతు చనిపోయాడని ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. దీంతో పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 13కు చేరింది. మరో 16మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జైషే ఉగ్రసంస్థతో లింకులు ఉన్న డాక్టర్ ఉమర్ మహ్మద్ నబీ ఆత్మాహుతి దాడికి పాల్పడి ఉంటాడని ఇప్పటికే ఎన్ఐఏ దర్యాప్తు అధికారులు ఓ అంచనాకి వచ్చారు. ఘటన స్థలంలో దొరికిన ఉమర్ మృతదేహం భాగాల డీఎన్ఏ పరీక్ష ఫలితం అతని తల్లి డీఎన్ఏతో సరిపోలింది. దీంతో అతను పేలుడు జరిగిన కారులో ఉన్నట్లుగా తేలింది.
ఎర్రకోట పేలుడు ఘటన కేసులో ఉమర్ కుటుంబ సభ్యులు సహా ఆరుగురిని జమ్ముకశ్మీర్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం నబీ సమీప బంధువు ఫహీమ్ ను కూడా అరెస్టు చేశారు. అతను ఖంట్వండాలో ఓ కారును పార్కింగ్ చేసినట్లుగా గుర్తించారు. వీరంతా గత జనవరి 26, దీపావళీకి భారీ ఎత్తున దేశంలో బాంబు పేలుళ్లకు పథకం వేసి విఫలమయ్యారని, డిసెండర్ 6కు పథకాన్ని వాయిదా వేసుకున్నారని దర్యాప్తు బృందాలు గుర్తించాయి. అయితే ఫరీదాబాద్ లో ఆయుధాలు, పేలుడు సామాగ్రీ దొరికిపోవడంతో ఉమర్ తాను కూడా దొరికిపోతానన్న కంగారులో ఢిల్లీలో ఆత్మాహుతికి దాడికి పాల్పడినట్లుగా దర్యాప్తు అధికారులు నిర్థారణకు వచ్చారు.
