న్యూఢిల్లీ: ఢిల్లీ ఎర్రకోట వద్ధ జరిగిన బాంబు పేలుళ్ల కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితులు దీపావళికే ఎర్రకోట వద్ద దాడికి ప్లాన్ చేశారని, కానీ తర్వాత దానిని రద్దు చేసుకున్నారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఆ తర్వాత వచ్చే గణతంత్ర దినోవ్సతం రోజున కూడా పేలుళ్లకు నిర్ణయించారని దర్యాప్తు అధికారులు తెలిపారు. ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుళ్ల దుర్ఘటనలో 12 మంది మృతిచెందిన సంగతి తెలిసిందే. దర్యాప్తు అధికారులు పేలుళ్లకు కారణమైన కారు నడిపిన పుల్వామా డాక్టర్ ఉమర్ నబీ సన్నిహితుడు ఫరీదాబాద్‌కు చెందిన ముజమ్మిల్ షకీల్‌ను కూడా కీలక నిందితుడిగా గుర్తించి అరెస్టు చేశారు. అతడిని విచారించగా.. ఈ కీలక విషయాలు బయటపడినట్లు తెలుస్తోంది. అంతకముందే ఉమర్‌తో పాటు తానూ ఆ ప్రాంతాన్ని రెక్కీ చేసుకున్నట్టు ముజామ్మిల్ దర్యాప్తు అధికారులకు తెలిపాడని సమాచారం
జనవరిలో మరో దాడికీ ప్లాన్.!
వాస్తవానికి దీపావళికే ఢిల్లీలో రద్దీగా ఉండే ప్రదేశంలో దాడి చేసేందుకు ముజామ్మిల్ టీమ్ ప్రణాళికలు రచించిందని, అయితే దానిని అమలు చేయడంలో విఫలమైనట్టు ముజామ్మిల్ చెప్పాడని అధికారులు తెలిపారు. ఈ ఏడాది జనవరి సమయంలోనూ ముజమ్మిల్ పలుమార్లు ఎర్రకోట వద్దకు వెళ్లినట్లు గుర్తించారు. నిందితులు వచ్చే ఏడాది జనవరి 26న కూడా మరో దాడికి ప్లాన్ చేశారని, దానికి ఎర్రకోట చుట్టుపక్కల ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నట్టు విచారణలో తేలింది. దర్యాప్తులో భాగంగా ముజామ్మిల్ ఫోన్ డేటా ద్వారా మరింత సమాచారాన్ని సేకరించినట్టు అధికారులు వెల్లడించారు. ఫరిదాబాద్‌లోని ఆల్-ఫలాహ్ విశ్వవిద్యాలయంలో ముజామ్మిల్ సహోద్యోగి అయిన ఉమర్, ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద ట్రాఫిక్ సిగ్నల్స్ సమీపంలో కారు బాంబు పేలుళ్లలో మరణించినట్టు అధికారులు భావిస్తున్నారు. సోమవారం నాటి పేలుడు జరిగిన ఐ20 కారు ఢిల్లీలో పలుచోట్ల తిరిగి చివరకు ఎర్రకోట వద్ద పార్కింగ్ ప్రాంతానికి వచ్చినట్లుగా అధికారులు గుర్తించారు. పేలుడు చోటుచేసుకున్న ప్రాంతం నుంచి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ బృందం దాదాపు 40కి పైగా నమూనాలు సేకరించింది. ఇందులో రెండు తూటాలతో పాటు, రెండు వేర్వేరు పేలుడు పదార్థాలకు చెందిన ఆనవాళ్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పేలుడు పదార్ధాల్లో ఒకటి అమ్మోనియం నైట్రెట్ కాగా, మరోకటి అంతకంటే శక్తివంతమైనదిగా భావిస్తున్నారు.
కారు పేలుడు ఘటనలో మృతదేహాల గుర్తింపు
ఎర్రకోట వద్ధ కారు బాంబు పేలుడు ఘటనలో మృతి చెందిన12 మందిలో 8 మృతదేహాలు గుర్తించిన అధికారులు తెలిపారు. కుటుంబ సభ్యులకు 8 మృతదేహాలు అప్పగించారు. మరో నలుగురి శరీర భాగాలను డీఎన్ఏ రిపోర్ట్‌కు 24 గంటల సమయం పట్టే అవకాశం ఉందని వెల్లడించారు. కారులో లభించిన శరీర భాగాల ఆధారంగా డాక్టర్ ఉమర్‌ను నిర్ధారించేందుకు డీఎన్ఏ పరీక్ష చేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఉమర్ తల్లి డీఎన్ఏ సేకరించారు.
