విధాత, హైదరాబాద్ : ఫ్యూచర్ విజన్ పాలసీలతో తెలంగాణ అభివృద్ది సాధనలో ప్రభుత్వం సాగుతోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. వ్యాక్సిన్ తయారీలో ప్రపంచ రాజధానిగా ఉన్న హైదరాబాద్‌ను జీవవైజ్ఞానిక రాజధానిగా ఎదిగేందుకు భాగస్వాములు కావాలని బయోఏషియా-2026 సదస్సు వేదికగా జీవవిజ్ఞాన రంగానికి చెందిన ప్రపంచ దిగ్గజ కంపెనీలు, శాస్త్రవేత్తలు, నిపుణులకు పిలుపునిచ్చారు.హైదరాబాద్ హైటెక్స్‌లో ప్రతిష్ఠాత్మకమైన 23వ బయో అసియా 2026 అంతర్జాతీయ సదస్సును రేవంత్ రెడ్డి పరిశ్రమల మంత్రి డి.శ్రీధర్ బాబుతో కలిసి ప్రారంభించారు. ‘టెక్‌బయో అన్‌లీష్డ్ – ఏఐ, ఆటోమేషన్, జీవశాస్త్ర రంగంలో వస్తున్న విప్లవాత్మక పరిణామాలు’ ఇతివృత్తంగా నిర్వహిస్తున్న ఈ ప్రపంచస్థాయి సదస్సులో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ దేశంలోని మిగతా రాష్ట్రాలతో కాకుండా ప్రపంచంలోని అగ్రగామి క్లస్టర్లతో పోటీ పడుతోందని, ఇప్పటికే గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు ప్రధాన గమ్యస్థానంగా మారిన హైదరాబాద్‌ను ఇప్పుడు అందరం కలిసి సమగ్ర జీవవిజ్ఞాన రంగానికి ప్రపంచ కేంద్రంగా తీర్చిదిద్దుదామని ఇందుకు కలిసిరావాలని కోరారు. తెలంగాణలో పెట్టుబడులకు ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.
గ్లోబల్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా హైదరాబాద్
“ప్రపంచ వ్యాక్సిన్ రాజధానిగా ఉన్న స్థితి నుంచి ప్రపంచ జీవవైజ్ఞానిక రాజధానిగా హైదరాబాద్ ఎదుగుతుంది అని రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ అంటే వ్యాపారం. తెలంగాణ ఎదుగుతోంది. ఈ ఎదుగుదలలో భాగస్వాములు కావాలి” అని పిలుపునిచ్చారు. “జీవవైజ్ఞానిక రంగంలో ప్రస్తుతం వస్తున్న ఆధునిక మార్పులను గమనిస్తే, పరిశోధన సంస్థలు, కార్పొరేట్లు, స్టార్టప్‌లు, చిన్న మధ్య తరహా సంస్థలు, ప్రభుత్వం మధ్య బలమైన భాగస్వామ్యం అవసరం ఉంది. ఆయా సంస్థలు, కార్పొరేట్లు విశ్వసనీయమైన, స్థిరమైన, భవిష్యత్తు కోసం మంచి వాతావరణాన్ని కోరుకుంటున్నారు అని రేవంత్ పేర్కొన్నారు. ఆ వాతావరణాన్ని తెలంగాణ అందిస్తుంది. అందుకు హైదరాబాద్ అనుకూలమైంది. బల్క్‌డ్రగ్స్ నుండి బయాలజిక్స్ వరకు, తయారీ నుండి ఆవిష్కరణ వరకు, భారతదేశం నుండి ప్రపంచస్థాయి వరకు తెలంగాణ ముందుకు సాగుతోంది అన్నారు.
తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి. జీసీసీలను స్థాపించండి. ఆవిష్కరణ కేంద్రాలను నిర్మించండి. మాలిక్యూల్స్ , ఔషధాలను డిజైన్, క్లినికల్ అనలిటిక్స్‌ను ప్రారంభించండి. ఏఐ ప్లాట్‌ఫామ్‌లను, డిజిటల్ తయారీ రంగాలను ముందుకు తీసుకెళ్లండి. అందుకు ప్రభుత్వం, యంత్రాంగం, శాస్త్రవేత్తలు, నైపుణ్యంతో కూడిన యువత మీ విజయంలో భాగస్వాములుగా ఉంటారు అని రేవంత్ తెలిపారు. 23 ఏళ్ల కిందట బయోఏషియా ప్రారంభమైనప్పుడు హైదరాబాద్ అంటే చార్మినార్, బిర్యానీ, ఔషధ తయారీ, సాఫ్ట్ వేర్ నగరంగా గుర్తింపు ఉండేది. ఇప్పుడు హైదరాబాద్ ప్రపంచ వ్యాక్సిన్ తయారీ కేంద్రంగా కూడా నిలిచింది అన్నారు.
రెండేళ్లలో జీవవిజ్ఞాన రంగంలో రూ. 73 వేల కోట్లకు పైగా పెట్టుబడులు
దూరదృష్టి కలిగిన నాయకత్వం, స్పష్టమైన విధానాలు, నైపుణ్యంతో కూడిన మానవ వనరులు, ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థలు ఉండటం వల్ల హైదరాబాద్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు, పరిశోధన, డిజైన్ రంగాల్లో ప్రపంచ కేంద్రంగా ఎదిగిందని గుర్తు చేశారు. తెలంగాణలో గడిచిన రెండేళ్లలో జీవవిజ్ఞాన రంగంలో రూ. 73 వేల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి. ఇటీవల దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సు సందర్భంగా తెలంగాణ నూతన లైఫ్ సైన్సెస్ పాలసీని ప్రకటించాం. జినోమ్ వ్యాలీని విస్తరించాం. అలాగే, ప్రపంచ స్థాయి పరిశోధనలు, ఆవిష్కరణల కోసం వన్-బయోను ప్రారంభించాం అని తెలిపారు. జీవవైజ్ఞానిక రంగంపై మా ఆలోచనలను తెలంగాణతో పాటు మీ అందరితో పంచుకుంటున్నానన్నారు.
3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా తెలంగాణ
ఇటీవలే మేం “తెలంగాణ రైజింగ్ 2047” విజన్‌ను ఆవిష్కరించాం అని, తెలంగాణ 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్నది మా లక్ష్యం అని రేవంత్ రెడ్డి తెలిపారు. గ్రీన్ ఫార్మా సిటీ అభివృద్ధిని వేగవంతం చేస్తూ అనేక గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లను ఆహ్వానించాం. ఒక బలమైన సంకల్పంతో ఈ పురోగతిని సాధించాం. అందుకు ప్రత్యక్ష నిదర్శనమే బయోఏషియా-2026 సదస్సు అని పేర్కొన్నారు. ఇప్పుడు బయోఏషియా తన పరిధిని విస్తరించుకుని “బయోవరల్డ్”గా మారుతోందని రేవంత్ అన్నారు. ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి పెన్సిల్వేనియా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసన్ ప్రొఫెసర్ బ్రూస్ ఎల్. లెవిన్ కి జినోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డు-2026 అందించారు. ఈ సదస్సుకు ప్రపంచ వ్యాప్తంగా 500 ప్రముఖ సంస్థలు, దాదాపు 4 వేల మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు. ఫార్మా, బయోసైన్సెస్, బయోటెక్, బల్క్ డ్రగ్స్, వ్యాక్సిన్లు, హెల్త్‌కేర్ రంగాల్లో ప్రముఖులు, బిజినెస్ లీడర్స్ సదస్సులో పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి :
మరోసారి సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రుల ఢిల్లీ పర్యటన
Man Behaving Like A Dog | షాకింగ్.. కుక్కలా ప్రవర్తిస్తున్న యువకుడు.. భయాందోళనలో స్థానికులు
