India-Pakistan conflict | కాల్పుల విరమణపై ట్రంప్‌, మోదీ.. ఎవరి మాట అసత్యం? తాజాగా అమెరికా ప్రెసిడెంట్‌ కొత్త సంగతి!

భారత్‌–పాక్‌ ఘర్షణను తానే నిలువరించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి చెప్పారు. రెండు దేశాలపైనా 350 శాతం చొప్పున సంకాలు విధిస్తానని బెదిరించడంతో దారికి వచ్చారన్న ట్రంప్‌.. ఈసారి కొత్త విషయం బయటపెట్టారు.

trump India Pakistan tariff threat

India-Pakistan conflict | మళ్లీ అదే మాట! మరోసారి మరో వేదికపై! భారత్‌, పాకిస్తాన్‌ మధ్య ఘర్షణ నివారణే అంశం! కానీ.. కొత్త సంగతులతో! ఈసారి అమెరికా–సౌదీ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫోరంలో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. భారత్‌, పాకిస్తాన్‌ మధ్య ఘర్షణను తానే నివారించానని పునరుద్ఘాటించారు. అంతేకాదు.. తాను రెండు దేశాలపైనా 350 శాతం చొప్పున టారిఫ్‌లు విధిస్తానని బెదిరించిన తర్వాత తనకు స్వయంగా భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఫోన్‌ చేసి, తాము పాకిస్తాన్‌పై యుద్ధానికి పోవడం లేదని చెప్పారని వెల్లడించారు.

భారత్‌, పాకిస్తాన్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం మే 10, 2025న చోటుచేసుకుంది. నిజానికి రెండు దేశాలకు సంబంధించిన విషయం అయినప్పటికీ.. కాల్పుల విరమణ జరిగిందని ట్రంప్‌ తన ట్రూత్‌ సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించారు.  అప్పటి నుంచి ఇప్పటి వరకూ సుమారు 60 సార్లు ట్రంప్‌ తానే యుద్ధాన్ని నివారించానని చెబుతూ వస్తున్న సంగతి తెలిసిందే. కానీ భారతదేశం మాత్రం కాల్పుల విరమణలో అమెరికా పాత్ర లేదని చెబుతున్నది. పాకిస్తాన్‌ కోరడంతోనే కాల్పలు విరమించినట్టు విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్‌ పార్లమెంటులో ప్రకటించారు. అసలు మోదీ, ట్రంప్‌ మధ్య ఫోన్‌ సంభాషణే జరుగలేదని చెప్పారు. పాకిస్తాన్‌ భారీ దాడికి దిగబోతున్నదని చెప్పేందుకు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ మాత్రమే ఫోన్‌ చేశారని పేర్కొన్నారు. ప్రధాన నరేంద్రమోదీ కూడా పాకిస్తాన్‌ సైనికాధికారులు వణికిపోతూ శరణు కోరితేనే తాము కాల్పులు ఆపామని చెప్పారు. అయితే.. తానే యుద్ధాన్ని ఆపానని ట్రంప్‌ చెబుతున్న మాట అబద్ధం.. ట్రంప్‌ అబద్ధాలకోరు అని చెప్పాలని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన డిమాండ్‌కు మాత్రం ఆయన స్పందించలేదు. అయితే.. ఇంతకీ ఈ ఇద్దరు చెబుతున్న దాంట్లో ఏది సత్యం? ఏది అసత్యం? అనేది మాత్రం సందేహంగానే మిగిలిపోయింది.

కానీ.. ట్రంప్‌ మాత్రం తన వాదనను గత కొన్ని నెలలుగా కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే.. ఆయన మాటల్లో టారిఫ్‌ ఎంత అన్నది మాత్రం మారుతూ వచ్చింది. గతంలో 200 శాతం టారిఫ్‌లు వేస్తానని బెదిరించానన్న ట్రంప్‌ ఈసారి దానిని 350 శాతానికి పెంచారు. కాల్పుల విరమణకు కొద్ది గంటల ముందు ఏం జరిగిందో ఆయన ఈసారి వివరంగా చెప్పారు. ఈ సమయంలో వేదికపై సౌదీ యువరాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ కూడా ఉన్నారు. కావాలంటే ఘర్షణ కొనసాగించుకోవచ్చని, కానీ తాను మాత్రం రెండు దేశాలపైనా 350 శాతం టారిఫ్‌ విధిస్తానని చెప్పానని ట్రంప్‌ తెలిపారు. అయితే.. రెండు దేశాలూ ఆ పని చేయవద్దని తనను కోరాయన్నారు. ‘నేను కచ్చితంగా చేస్తాను. నా దగ్గరకు రండి.. నేను దాన్ని మినహాయిస్తాను. కానీ.. మీరూ మీరు అణు బాంబులు వేసుకుంటూ లక్షల మందిని చంపుకుంటూ ఆ అణు ధూళి లాస్‌ ఏంజలీస్‌పై పడుతూ ఉంటూ చూస్తూ ఊరుకోను అని చెప్పాను’ అని ట్రంప్‌ పేర్కొన్నారు.

350 శాతం టారిఫ్‌ విధించేందుకు అన్నీ సిద్ధం చేశామని, తాను ట్రజరరీ సెక్రటరీ స్కాట్‌ బేస్సెంట్‌ను సైతం అలర్ట్‌ చేశానని ట్రంప్‌ తెలిపారు. ఆ సమయంలో తనకు మొదట పాకిస్తాన్‌ ప్రధాన మంత్రి షెహబాజ్‌ షరీఫ్‌ నుంచి ఫోన్‌ వచ్చిందని, లక్షల మంది ప్రాణాలను కాపాడినందుకు ఆయన తనకు ధన్యవాదాలు తెలిపారని పేర్కొన్నారు. ఆ తర్వాత తనకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నుంచి ఫోన్‌ వచ్చిందని చెప్పారు. ‘మోదీ ‘మేం సిద్ధం’ అన్నారు. ‘దేనికి సిద్ధం?’ అని నేను ప్రశ్నించాను. ‘మేం యుద్ధానికి వెళ్లటం లేదు’ అని మోదీ చెప్పారు’ అంటూ వివరించారు. దాంతో తాను మోదీకి కృతజ్ఞతలు తెలిపానని, ఒక ఒప్పందానికి వద్దామని చెప్పానని పేర్కొన్నారు. నిజానికి ముందు రోజు అమెరికాలోని తన ఒవెల్‌ ఆఫీస్‌లో సౌదీ యువరాజును కలిసిన సమయంలో కూడా ట్రంప్‌ తానే భారత్‌, పాకిస్తాన్‌ యుద్ధాన్ని నివారించానని చెప్పారు. ఆ మరుసటి రోజే తాజాగా మోదీ ఫోన్‌ చేసిన సంగతిని బయటపెట్టారు.

పహల్గామ్‌ దాడిలో 26 మంది భారతీయులను చంపినందుకు ప్రతీకారంగా మే 7వ తేదీన ఆపరేషన్‌ సిందూర్‌ను భారతదేశం ప్రారంభించింది. పాకిస్తాన్‌లోని ఉగ్ర శిబిరాలను టార్గెట్‌ చేసి, వాటిని ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో అనేక మంది పాకిస్తాన్‌ ఉగ్రవాదులు చనిపోయారని కూడా పేర్కొన్నది.

Read Also |

Etela Rajendar : సర్పంచ్ ఎన్నికలు జరపకపోవడంతో వల్లకాడులా మారిన గ్రామాలు
Income Tax On Gifts : గిఫ్ట్స్ స్వీకరిస్తే ట్యాక్స్ చెల్లించాలా? ఎవరికీ మినహాయింపులున్నాయి?
Supreme Court judgmen| బిల్లుల ఆమోదంపై గవర్నర్లకు, రాష్ట్రపతికి కోర్టులు గడువు నిర్ధేశించలేవు : సుప్రీంకోర్టు కీలక తీర్పు

Latest News