విధాత, హైదరాబాద్ : హైదరాబాద్ మహానగరంలో కోకాపేట నడిబొడ్డున ఓ పుష్పం వికసించడం అందరిని ఆకట్టుకుంటుంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అయితే ఈ పుష్పం సహజ సిద్దమైన నిజమైన పుష్పం కాకపోయినా..అచ్చం అలాగే కనిపిస్తూ కనువిందు చేస్తుంది. వివరాల్లోకి వెళితే హెచ్ఎండీఏ అర్బన్ ఫారెస్ట్రీ విభాగం, లేయర్డ్ ఆకులు, పుష్పించే హెడ్జెస్, ఉత్సాహభరితమైన గ్రౌండ్ కవర్లతో రూపొందించబడిన లోటస్(తామర) రేకుల డిజైన్ తో కూడిన అద్భుతమైన ట్రాఫిక్ ఐలాండ్‌ను అభివృద్ధి చేసింది. ఇది చూడటానికి వికసిత పుష్పంలా కనిపిస్తూ అందరిని ఆకట్టుకుంటుంది. డ్రోన్ వీక్షణంతో అది మరింత ఆకర్షణీయంగా కనిపించడం విశేషం.
పశ్చిమ హైదరాబాద్‌లోని ప్రధాన ప్రత్యేక ఆర్థిక మండళ్లలో (SEZ) ఒకటైన కోకాపేటలో రద్దీగా ఉండే జంక్షన్ లో ఉన్న ఈ ప్రకృతి దృశ్యం పర్యావరణనికి..ప్రకృతి సౌందర్యానికి మైలురాయిగా నిలుస్తుందని హెచ్ఎండీఏ భావిస్తుంది. పట్టణంలో పబ్లిక్ స్థలాలను ఆకర్షణీయంగా మారుస్తూ హైదరాబాద్ నగరానికి హరిత నగర గుర్తింపును పెంచేదిగా ఉందని పేర్కొంది. హైదరాబాద్ అంతటా ఈ తరహా పచ్చదనం దృశ్యాలను ఆవిష్కరించే ప్రయత్నాలు చేస్తే కాంక్రీట్ నగరంగా కాకుండా హరిత నగరంగా ఆకర్షణీయంగా ఉంటుందని నగర పౌరులు భావిస్తున్నారు.
