ORR New Interchanges : ముఖ్య నేత కోసమే జన్వాడలో ఇంటర్ ఛేంజ్?

హైదరాబాద్‌ ఓఆర్ఆర్ పై 25కు చేరనున్న ఇంటర్ ఛేంజీలు. జన్వాడ, కోహెడ, పడమటి సాయిగూడల్లో కొత్త ఎగ్జిట్ గేట్లు. ఓ ముఖ్య నేత కోసమే జన్వాడ ట్రంపెట్ అంటూ చర్చలు

ORR New Interchanges

నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు చుట్టు పక్కల ప్రజల రవాణాను సులభతరం చేసేందుకు మరో మూడు కొత్త ఇంటర్ ఛేంజెస్ ను హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) ప్రతిపాదించింది. మూడింటిలో ఒక ఇంటర్ ఛేంజ్ మాత్రం ఒక ముఖ్య నేత లే అవుట్ కోసం హెచ్ఎండీఏ అధికారులు ప్రతిపాదించినట్లు సమాచారం. తాజాగా మూడింటి చేరికతో ఇంటర్ ఛేంజ్ ట్రంఫెట్ ల సంఖ్య 25 కు చేరుకున్నది. వీటి ద్వారానే వాహనదారులు నిర్ణీత ప్రాంతాల్లో ఓఆర్ఆర్ పైకి వెళ్లడం, దిగడం చేస్తున్నారు.

జన్వాడతో పాటు పడమటి సాయిగూడ, కొహెడ ప్రాంతాలలో కొత్తగా వీటిని నిర్మాణం చేయనున్నారు. పెద్ద అంబర్ పేట, బొంగుళూర్ ఇంటర్ ఛేంజ్ మధ్యలో కొహెడ ట్రంఫెట్ ప్రతిపాదించారు. ఇక్కడ భారీ స్థాయిలో పండ్ల మార్కెట్ తో పాటు భారీ కోల్డ్ స్టోరేజీలను రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణం చేస్తున్నది. విదేశాలకు పండ్లు ఎగుమతులు చేసే వీధంగా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. కీసర, ఘట్ కేసర్ ఎగ్జిట్ గేట్ల మధ్య పడమటి సాయిగూడ లో మరో ఎగ్జిట్ గేట్ ను ప్రతిపాదించారు. శంకర్ పల్లి మండలం జన్వాడతో పాటు పరిసర ప్రాంతాలలో పెద్ద ఎత్తున ప్రముఖుల భూములు ఉన్నాయి. ఈ భూములకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది.

అధికార పార్టీతో ప్రతిపక్ష పార్టీలు, వీఐపీల భూములు ఉండడంతో ధరలు పెంచేందుకు పాలకులు అనేక చర్యలు తీసుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. నియోపోలిస్, కొల్లూరు ఎగ్జిట్ల మధ్య కొత్తగా జన్వాడ ఇంటర్ ఛేంజ్ నిర్మాణం చేయనున్నారు. 158 కిలోమీటర్ల పొడవున ఉన్న ఎనిమిది లేన్ల నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు పై మొత్తం 22 ఇంటర్ ఛేంజెస్ ఉండగా, కొత్తగా చేరిన మూడింటితో వాటి సంఖ్య 25కు చేరుకోనున్నది. రింగ్ రోడ్డు నిర్మాణం చేసిన సమయంలో 19 ఇంటర్ ఛేంజెస్ మాత్రమే ఉన్నాయి. కొల్లూరు, పటాన్ చెరు, సుల్తాన్ పూర్, దుండిగల్, మేడ్చల్, శామీర్ పేట, కీసర, ఘట్ కేసర్, తారామతి పేట, పెద్ద అంబర్ పేట, బొంగుళూర్, రావిర్యాల్, తుక్కుగూడ, పెద్ద గోల్కొండ, శంషాబాద్, రాజేంద్రనగర్, టీజీపీఏ, కోకాపేట తో పాటు నానక్ రామ్ గూడ ఉన్నాయి.

ఆ తరువాత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మల్లంపేట, నార్సింగి, నియో పోలిస్ వద్ద ప్రతిపాదించడంతో వాటి సంఖ్య 22కు చేరుకున్నది. నార్సింగి వద్ద గతేడాది జూలై నెలలో ప్రారంభించగా, మల్లంపేట వద్ద మొన్న అక్టోబర్ లో ప్రారంభించారు. న్యాయపరమైన సమస్యల కారణంగా నియో పోలిస్ పనులు ఆలస్యమయ్యాయి. నియో పోలిస్ అందుబాటులోకి వస్తే నియో పోలిస్ లే అవుట్ తో పాటు గచ్చిబౌలి, నార్సింగి ప్రాంత వాసులు వెళ్లేందుకు సులభతరం అవుతుంది. కోకాపేటలో మూడేళ్ల క్రితం హెచ్ఎండీఏ 530 ఎకరాల్లో నియో పోలిస్ లే అవుట్ వేసి ఓపెన్ ప్లాట్లను విక్రయించింది. ఒక ఎకరం ధర ఇక్కడ రూ.100 కోట్లు పలికిన విషయం తెలిసిందే. చాలా కంపెనీలు ఇక్కడ స్థలాలు కొనుగోలు చేశాయి. మల్టీ పర్పస్ గా స్థలాలను వినియోగిస్తుండడంతో ట్రాఫిక్ సమ్యలు లేకుండా మౌలిక సదుపాయాలు కల్పించారు.

ఇవి కూడా చదవండి :

KTR : బరాబర్ మా అయ్య పేరు చెప్పుకుంటా
Wild Boar Attack : ఫారెస్టు ఆఫీసర్ పై అడవి పంది దాడి..వీడియో వైరల్

Latest News