Shift of Offices | అద్దె భవనాల్లోని ప్రభుత్వ ఆఫీసులు డిసెంబర్ 31 లోపు ఖాళీ చేయాలంటూ ఆర్థిక శాఖ సర్క్యులర్‌

ప్రభుత్వ కార్యాలయాలు, కార్పొరేషన్లు, సొసైటీలు, యూనివర్సిటీలు తమ కార్యాలయాలను ప్రైవేటు భవనాలలో ఉన్నట్లయితే ప్రభుత్వ భవనాలలోకి మార్చాలని రాష్ట్ర ఆర్థిక శాఖ సర్క్యులర్‌ జారీ చేసింది.

Shift of Offices | ప్రభుత్వ కార్యాలయాలు, కార్పొరేషన్లు, సొసైటీలు, యూనివర్సిటీలు తమ కార్యాలయాలను ప్రైవేటు భవనాలలో ఉన్నట్లయితే ప్రభుత్వ భవనాలలోకి మార్చాలని రాష్ట్ర ఆర్థిక శాఖ సర్క్యులర్‌ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తరువాత, హైదరాబాద్‌లోని ఏపీ కార్యాలయాలు విజయవాడకు తరలి వెళ్లాయని, ఆఫీసులు ఏర్పాటు చేసుకునేందుకు హైదరాబాద్‌లో విశాలమైన వసతి అందుబాటులో ఉందని సర్క్యులర్‌లో స్పష్టం చేశారు. వివిధ విభాగాలకు చెందిన ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, విభాగాల అధిపతులు డిసెంబర్ 31వ తేదీ లోగా కార్యాలయాల ఏర్పాటుకు వసతి పరిశీలించి, తక్షణమే తరలించాలని ఆదేశించారు. జనవరి 1వ తేదీ నుంచి కచ్చితంగా ప్రభుత్వ భవనాలలోనే కార్యాలయాలు కొనసాగాలని స్పష్టం చేసింది.

ప్రైవేటు భవనాలలో కొనసాగుతున్న కార్యాలయాలకు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ప్రైవేటు భవనాలకు అద్దె చెల్లింపులు నిలిపివేయాలని, ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ట్రెజరీ విభాగాన్ని ఇదే సర్క్యులర్‌లో ఆదేశించారు. హైదరాబాద్ నగరంలో అనేక ప్రభుత్వ భవనాలు ఖాళీగా ఉన్నాయి. ఈ భవనాలను కాదని కొందరు అధికారులు ప్రైవేటు భవనాలలో కార్యాలయాలు కొనసాగిస్తున్నారు. మరికొందరు హౌసింగ్ బోర్డు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల భవనాల్లో కొనసాగిస్తూ లక్షల రూపాయల అద్దె చెల్లిస్తున్నారు. ఉదాహరణకు అమీర్‌పేట స్వర్ణ జయంతి కాంప్లెక్స్‌లో హెచ్ఎండీఏ ప్రధాన కార్యాలయం కొనసాగుతున్నది. ఇదే భవనాన్ని అద్దెకు ఇస్తే లక్షల రూపాయలు ప్రతి నెలా అద్దె రూపంలో సమకూరుతుంది. మైత్రి వనంలో తెలంగాణ పౌర సరఫరాల విజిలెన్స్ కార్యాలయం కొనసాగిస్తున్నారు. ప్రతి నెలా లక్షల రూపాయలను పౌర సరఫరాల కమిషనర్ అద్దె రూపంలో దుబారా చేస్తున్నారు. ఇలా చెబుతూ వెళ్తే చాలా ప్రభుత్వ విభాగాల అధిపతులు అద్దె దుబారా విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.

Latest News