Municipal Elections | సీపీఐకి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్.. మానుకోటలో ‘మిత్రభేదం’

Municipal Elections | తెలంగాణ అంతా ఎట్లున్నా మానుకోటలో మాత్రం అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచి నిన్నటి వరకు మిత్రులుగా కొనసాగుతున్న కాంగ్రెస్, సీపీఐ మధ్య కొనసాగుతున్న మైత్రీ మున్సిపల్ ఎన్నికల పుణ్యమా అంటూ చెడిపోయింది. ఈ ఎన్నికల్లో పొత్తుకొనసాగుతోందని భావించగా పొత్తుస్థానంలో చిచ్చురేగింది.

మిత్రుల మధ్య మున్సిపోల్ చిచ్చు
కొడవలి దూస్తున్న కామ్రేడ్లు

Municipal Elections | విధాత, ప్రత్యేక ప్రతినిధి : తెలంగాణ అంతా ఎట్లున్నా మానుకోటలో మాత్రం అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచి నిన్నటి వరకు మిత్రులుగా కొనసాగుతున్న కాంగ్రెస్, సీపీఐ మధ్య కొనసాగుతున్న మైత్రీ మున్సిపల్ ఎన్నికల పుణ్యమా అంటూ చెడిపోయింది. ఈ ఎన్నికల్లో పొత్తుకొనసాగుతోందని భావించగా పొత్తుస్థానంలో చిచ్చురేగింది. నిన్నటి వరకు మిత్రులుగా చెలామని అయిన రెండు పార్టీల మధ్య విభేదాలు నెలకొన్నాయి. చివరి వరకు పొత్త ఉంటుందని భావించిన సీపీఐకి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాకిచ్చారు. దీంతో కాంగ్రెస్ పార్టీ మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ పై సీపీఐ కామ్రేడ్లు కొడవలి దూస్తున్నారు. నిన్నటి వరకు మిత్రులుగా ఉన్న కాంగ్రెస్, సీపీఐ మధ్య కలహం ప్రారంభం కాగా, నిన్నటి వరకు ఎడమొఖం పెడమొఖంగా ఉన్న సీపీఐ, బీఆర్ఎస్ మధ్య ఇదే సమయంలో చర్చలు జరిగాయి. ఈ నేపథ్యంలో సీపీఐ నాయకులు మానుకోటలో కాంగ్రెస్ అభ్యర్ధులను ఓడించాలంటూ పిలుపు నిచ్చారు. స్థానిక ఎమ్మెల్యే మురళీ నాయక్ పై మండిపడుతున్నారు.

మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగానే మానుకోటలో సీపీఐ, కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు ఉంటుందని అంతా భావించారు. కాకుంటే సీట్ల పంపిణీ సందర్భంగా కొంత పీటముడిపడుతుందని అనుకున్నారు. అదే విధంగా ఎన్నికల ప్రకటన విడుదల కాగానే మానుకోట కాంగ్రెస్ ఎమ్మెల్యే మురళీనాయక్, సీపీఐ నాయకత్వం మధ్య మానుకోట మున్సిపాలిటీలో పొత్తు విషయమై చర్చలు సాగుతూ వచ్చాయి. ఎమ్మెల్యే కూడా ఈ మేరకు సానుకూలత వ్యక్తం చేస్తూ వచ్చారు. సీపీఐ కూడా ఒకసీటు అటూ ఇటూ అయినా పొత్తుపై సీపీఐ నమ్మకం పెట్టుకున్నది. ఈ క్రమంలో నామినేషన్ల ప్రక్రియతో పాటు మంగళవారం నామినేషన్ ల ఉపసంహరణ, బి ఫామ్ల జారీ ప్రక్రియ ఉన్న నేపథ్యంలో ఆఖరి నిమిషం వరకు వేచిచూశారు. చివరి వరకు చర్చలుంటాయని చెబుతూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు సీపీఐతో పొత్తుకు దూరంగా ఉన్నారు. దీంతో పొత్తుంటుందని భావించిన సీపీఐ నాయకుల్లో ఆగ్రహం వ్యక్తమైంది. ఇదే సమయంలో మారిన రాజకీయ పరిస్థితిని తమకు అనుకూలంగా ఉపయోగించుకోవాలని భావించిన బీఆర్ఎస్ వేగంగా పావులు కదిపింది. ఇరుపార్టీల మధ్య ఈ దశలో పొత్తుపెట్టుకునే పరిస్థితి లేనప్పటికీ సీపీఐ నాయకులతో చర్చలు జరిపారు. సీపీఐ జిల్లా కార్యదర్శి విజయ్ సారధి ఇతర నాయకులను మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ఎన్నికల ఇంచార్జ్ దాస్యం వినయ్ భాస్కర్, పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవితలు వెళ్ళి వారితో చర్చించడం రాజకీయ చర్చకు దారితీసింది. దీనికి తగినట్లుగానే బుధవారం మానుకోటలో జరిగిన సీపీఐ ఎన్నికల ప్రచారంలో ఆ పార్టీ నాయకులు కాంగ్రెస్ పై ఆగ్రహోదగ్రులయ్యారు.

మిత్ర ద్రోహి మానుకోట ఎమ్మెల్యే: సీపీఐ నేత తక్కళ్లపల్లి

కమ్యూనిస్టులకు మిత్రద్రోహిగా మారిన మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ కు మున్సిపాలిటీ ఎన్నికలలో గుణపాఠం చెప్పాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. మహబూబాబాద్ లో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని, మిత్రద్రోహి మురళీ నాయక్ ను చిత్తుగా ఓడించాలని బుధవారం జరిగిన సీపీఐ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో తక్కళ్లపల్లి మాట్లాడారు. రాష్ట్రంలో గత శాసనసభ ఎన్నికల్లో సిపిఐ మద్దతుతో గెలుపొంది, అధికారంలోకి వచ్చిన తరువాత, మిత్రులైన కమ్యూనిస్టులను మర్చిపోయిన ఎమ్మెల్యే వైఖరిని ప్రజలు గమనించాలన్నారు. ఎమ్మెల్యే ఒంటెద్దు పోకడతో కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగే పరిస్థితి ఏర్పడిందన్నారు. శాసనసభ ఎన్నికల అనంతరం తాము మిత్ర ధర్మాన్ని పాటిస్తూ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలలోకి తీసుకెళ్లామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకత్వం కమ్యూనిస్టులతో కలిసి నడుస్తుంటే ఈ ఎమ్మెల్యే అందుకు విరుద్దంగా కమ్యూనిస్టులను దూరం పెట్టారని అన్నారు. డబ్బు సంచులు, మద్యం సీసాలతో గెలవాలని అనుకునే అభ్యర్థులను ఓడించాలని కోరారు. నిరంతరం ప్రజల పక్షాన నిలబడి మానుకోట అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి పనిచేసే సిపిఐ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

Latest News