తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం న్యూఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలిశారు. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ వివాదం కొనసాగుతున్న సందర్బంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ కావడం ఆసక్తికరం. నిన్న నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్రమంత్రి మనోహర్ లాల్ కట్టర్‌తో సమావేశమయ్యారు. తెలంగాణ అభివృద్ది ప్రాజెక్టులపై అనుమతులు, నిధుల మంజూరుపై చర్చించారు. ఈరోజు కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని కలిసి, రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు.
రాహుల్ గాంధీతో భేటీపై రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా స్పందించారు. ఎప్పటిలాగే, నా నాయకుడు రాహుల్ గాంధీని కలవడం ఎంతో ఉత్సాహాన్ని, స్ఫూర్తిని ఇస్తుందని పేర్కొన్నారు. లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడితో తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై నేను చర్చించాననని, అలాగే, ఎప్పటిలాగే ఆయన అందించే లోతైన సూచనలు, దిశానిర్దేశం మా అందరికీ మార్గదర్శకంగా నిలుస్తాయని తెలిపారు.
కాగా రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ సందర్బంగా మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ వివాదం, తెలంగాణ కేబినెట్ విస్తరణ, కాంగ్రెస్ పార్టీ రాజకీయ అంశాలపై చర్చ జరిగి ఉండవచ్చని తెలుస్తుంది. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.