Four Stars of Destiny | దేశ రాజకీయాలను ఓ పబ్లిష్ కాని పుస్తకం కుదిపేస్తోంది. ఈ పుస్తకంపై పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఈ బుక్ పార్లమెంట్ సమావేశాలనే స్తంభింపజేసేలా చేసింది. ఏకంగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా (Om Birla)పై అవిశ్వాస తీర్మారానికి దారితీసింది. అదే భారత ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే (Manoj Mukund Naravane) రాసిన ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ (Four Stars of Destiny). ఇంత వివాదానికి కారణమైన ఆ పుస్తకంలో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం..
కీలక అంశాలు..
పాంగోంగ్ సరస్సు ప్రాంతంలో భారత్-చైనా దళాల మధ్య జరిగిన హింసాత్మక ఘర్షణ తర్వాత 2020 మే5న తూర్పు లఢఖ్ సరిహద్దు వివాదం చెలరేగింది. మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ నరవాణే ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’లో ఈ ఘర్షణ గురించి ప్రస్తావించారు. గల్వాన్ ఘర్షణలతోపాటూ అగ్నిపథ్ నియామక ప్రక్రియ వంటి కీలకమైన అంశాలను నరవణే తన ఆత్మకథలో ప్రస్తావించినట్లు సమాచారం.
జనరల్ నరవణే తన అనుభవాలను పొందుపరుస్తూ రాసిన ఈ పుస్తకం ఇంకా పబ్లిష్ కాలేదు. సాధారణంగా ఆర్మీ చీఫ్‌లు పదవీ విరమణ తర్వాత రాసే పుస్తకాలకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. దేశ భద్రతకు సంబంధించిన సున్నితమైన అంశాలు బహిర్గతం కాకూడదనే ఉద్దేశంతో ఈ నిబంధన ఉంది. ప్రస్తుతం రక్షణ శాఖ, విదేశాంగ శాఖల అనుమతి (Clearance) కోసం వేచి ఉంది. ప్రభుత్వ అనుమతి వచ్చిన తర్వాతనే దీన్ని పబ్లిష్ చేస్తారు. ఇంతలోనే పుస్తకంలోని అంశాలు ఫొటోలు, పీడీఎఫ్ కాపీల రూపంలో చట్టవిరుద్ధంగా వాట్సాప్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
వివాదం చెలరేగిందిలా..
పబ్లిష్ కాని ఈ పుస్తకంలోని అంశాలను లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) సభలో ప్రస్తావించడంతో దీనిపై రగడ మొదలైంది. నరవణే తన పుస్తకంలో రాసుకున్న కొన్ని సంచలన అంశాలను రాహుల్.. సభలో ప్రస్తావించేందుకు ప్రయత్నించారు. దీంతో అధికార పక్షం రాహుల్ ప్రసంగాన్ని అడ్డుకుంది. పబ్లిష్ కాని పుస్తకాలను సభలో ప్రస్తావించడం చట్టవిరుద్ధమని పేర్కొంది. ప్రచురించని పుస్తకాన్ని ఉటంకించడం సభ నియమాలకు విరుద్ధమని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సహా కేంద్ర మంత్రులు, ఎంపీలు రాహుల్ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. ఇలా గత వారం రోజులుగా ఈ పుస్తకం వల్ల సభ ముందుకు సాగడం లేదు.
ఓం బిర్లా ఆగ్రహం
రాహుల్ ప్రసంగాన్ని అడ్డుకోవడంతో సభలో గందరగోళం నెలకొంది. రగడపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా స్పందించారు. న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్, పబ్లిష్ కాని పుస్తకాలకు సంబంధించిన విషయాలను లోక్‌సభలో ప్రస్తావించకూడదని సూచించారు. ఈ మేరకు రూల్ బుక్ నియమాలను సభలో చదివి వినిపించారు. అయినా సభలో రభస ఆగలేదు. పలువురు ఎంపీలు స్పీకర్‌పై పేపర్లు చింపి విసిరారు. దీంతో ఆగ్రహించిన స్పీకర్.. ఎనిమిది మంది ఎంపీలను సెషన్ మొత్తం సభ నుంచి సస్పెండ్ చేశారు.
స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం..
స్పీకర్ చర్యలపై ఆగ్రహంతో ఉన్న కాంగ్రెస్ ఎంపీలు.. ఆయనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే విపక్ష ఇండియా కూటమి ఎంపీలు లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చారు. రాజ్యాంగంలోని 94సీ ప్రకారం.. ఈ నోటీసులు ఇచ్చారు. ఈ అవిశ్వాసం నోటీసులపై 120 మంది ఎంపీలు సంతకాలు చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ నోటీసులపై రాహుల్ గాంధీ సంతకం చేయలేదు.
ఓం బిర్లా కీలక నిర్ణయం..
స్పీకర్‌ను పదవి నుంచి తొలగించేలా తీర్మానం ప్రవేశపెట్టేందుకు లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు కాంగ్రెస్ నోటీసు ఇచ్చిన నేపథ్యంలో ఓం బిర్లా కీలక నిర్ణయం తీసుకున్నారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ పూర్తయ్యే వరకు సభకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు.
ప్రభుత్వం భయపడుతోంది..
మరోవైపు ఈ పుస్తకం చూసి ప్రభుత్వం భయపడుతోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఆ పుస్తకం చదివితే చైనా మన సరిహద్దుల్లోకి వచ్చినప్పుడు మన దేశ నాయకత్వం దానిపై ఎలా స్పందించిందనే విషయం బయటపడిపోతుందని ప్రభుత్వం భయపడుతోందని వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ అన్నారు. అందుకే రాహుల్ గాంధీని ఈ విషయంపై పార్లమెంటులో మాట్లాడనీయకుండా చేస్తున్నారని ఆరోపించారు. వారికి సంబంధించి ఏ విషయాలు బయటపడతాయోనని ప్రభుత్వం భయపడుతోందన్నారు. అందుకే ఆ పుస్తకం ప్రచురణకు అనుమతించడం లేదని ప్రియాంక ఆరోపించారు.
నరవణే పుస్తకం ఇంకా పబ్లిష్ కాలేదు..
మరోవైపు ఈ పుస్తకంపై ప్రముఖ పబ్లిషింగ్ కంపెనీ పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా (Penguin Random House India) స్పందించింది. ఈ పుస్తకం ఇంకా పబ్లిష్ కాలేదని.. దీనిపై అన్ని హక్కులు తమకే ఉన్నాయని స్పష్టం చేసింది. ఈ మేరకు పుస్తకంపై నెలకొన్న వివాదంపై ప్రకటన విడుదల చేసింది. నరవణే రాసిన ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’కి ప్రభుత్వం నుంచి అనుమతి ఇంకా లభించకపోవడంతో ముద్రణ చేపట్టలేదని వివరించింది. పుస్తకంలోని ఒక్క పేజీ కూడా పబ్లిష్ కాలేదని స్పష్టం చేసింది. డిజిటల్ రూపంలోనూ మార్కెట్‌లోకి విడుదల చేయలేదని తెలిపింది. ఈ బుక్‌పై తమకు మాత్రమే ప్రత్యేక హక్కులు ఉన్నట్లు స్పష్టం చేసింది. అనధికారికంగా ఈ బుక్ ను ప్రింట్ చేసిన, ఆన్ లైన్ లో రిలీజ్ చేసినా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
నరవణే అబద్ధం చెబుతున్నారా..?
ఈ పుస్తకం అమెజాన్‌లో అందుబాటులో ఉందని రాహుల్ చెబుతున్నారు. కానీ పుస్తకాన్ని ఇంకా రిలీజ్ చేయలేదని పెంగ్విన్ సంస్థ చెబుతోంది. ఈ నేపథ్యంలో ఆ సంస్థ ప్రకటనపై కాంగ్రెస్ అగ్రనేత స్పందించారు. మాజీ ఆర్మీ చీఫ్ నరవణే చేసిన ఓ ట్వీట్‌ను పార్లమెంట్ వెలుపల మీడియాకు చదివి వినిపించారు. తాను రాసిన పుస్తకం ఆన్‌లైన్‌లో దొరుకుతోందని, లింక్ ఓపెన్ చేస్తే విషయాలు తెలుస్తాయని తన ట్వీట్‌లో నరవణే పేర్కొన్నట్లు రాహుల్ వెల్లడించారు. నరవణే అబద్దం చెబుతున్నారా..? లేక పెంగ్విన్ సంస్థ అబద్దం చెబుతోందా..? అంటూ ప్రశ్నించారు. పెంగ్విన్ కన్నా మాజీ ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలను నమ్ముతున్నట్లు రాహుల్ ఈ సందర్భంగా తెలిపారు.
