ఆ రోజును జిన్‌పింగ్‌ జీవితంలో మ‌ర్చిపోలేరు.. గ‌ల్వాన్ ఘ‌ర్ష‌ణపై మాజీ ఆర్మీ చీఫ్ వ్యాఖ్య‌

భార‌త్-చైనా సైనికుల మ‌ధ్య 2020 జూన్ 16న జ‌రిగిన ఘ‌ర్ష‌ణను చైనా అధ్య‌క్షుడు జిన్ పింగ్ అంత త్వ‌ర‌గా మ‌ర‌చిపోరని భార‌త మాజీ సైన్యాధ్య‌క్షుడు న‌ర‌వ‌ణే తెలిపారు.

ఆ రోజును జిన్‌పింగ్‌ జీవితంలో మ‌ర్చిపోలేరు.. గ‌ల్వాన్ ఘ‌ర్ష‌ణపై మాజీ ఆర్మీ చీఫ్ వ్యాఖ్య‌

భార‌త్-చైనా (India – China) సైనికుల మ‌ధ్య 2020 జూన్ 16న జ‌రిగిన ఘ‌ర్ష‌ణను చైనా అధ్య‌క్షుడు షీ జిన్ పింగ్ అంత త్వ‌ర‌గా మ‌ర‌చిపోరని భార‌త మాజీ సైన్యాధ్య‌క్షుడు జ‌న‌ర‌ల్ ఎం.ఎం. న‌ర‌వ‌ణే వ్యాఖ్యానించారు. కెరీర్‌లో జ‌రిగిన అనేక విష‌యాల‌ను ప్ర‌స్తావిస్తూ రాసిన ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీలో 2020లో ఇరు దేశాల మధ్య జ‌రిగిన గాల్వాన్ ఘ‌ర్ష‌ణను ఆయ‌న ప్ర‌స్తావించారు. అంతే కాకుండా ఆయ‌న సైనికాధ్య‌క్షుడిగా ఉన్న స‌మ‌యంలో చైనాతో త‌లెత్తిన స‌మ‌స్య‌ల‌ను కూడా పొందుప‌రిచారు.


గాల్వాన్ ఘ‌ట‌న (Galwan Clash) గురించి ప్ర‌స్తావిస్తూ.. ఆ స‌మ‌యంలో రెండు ఆసియా దేశాలూ దాదాపు యుద్ధం ముంగిట‌కు చేరుకున్నాయ‌ని న‌ర‌వ‌ణె పేర్కొన్నారు. ఒకానొక స‌మ‌యంలో జ‌రిగింది చాలు ఇక పొరుగు దేశానికి మ‌న బ‌లం చూపిద్దాం అనుకునేలా భార‌త సైన్యం సిద్ధ‌మైంద‌ని తెలిపారు. ఆ ఏడాది జూన్ 16న జ‌రిగిన ఘ‌ట‌న‌ను చైనా అధ్య‌క్షుడు షీ జిన్‌పింగ్ త‌న జీవిత కాలంలో మ‌ర‌చిపోర‌ని న‌ర‌వాణె ఈ పుస్త‌కంలో రాసుకొచ్చారు.


గ‌త 20 ఏళ్లలో చూసుకుంటే ఆ దేశ సైనికులు పెద్ద సంఖ్య‌లో తీవ్ర గాయాల పాలైన ఘ‌ట‌న అదేన‌ని ఆయ‌న తెలిపారు. ‘జూన్ 16 జిన్‌పింగ్ జ‌న్మ‌దినం. అయితే 2020కి సంబంధించి ఆ తేదీని ఆయ‌న అంత తేలిగ్గా మ‌ర‌చిపోలేరు. గ‌త 20 ఏళ్ల‌లో ఆ దేశ సైనికులు తిన్న చావు దెబ్బ ఇదే’ అని రాసుకొచ్చారు. అయితే ఆ తేదీ త‌న కెరీర్‌లోనే దుఃఖ‌భ‌రిత‌మైన రోజుల్లో ఒక‌ట‌ని న‌ర‌వ‌ణె చెప్పుకొన్నారు.


గాల్వాన్ ఘ‌ర్ష‌ణ‌కు మూల కార‌ణమేంటి?


గాల్వాన్ ఘ‌ర్ష‌ణ‌కు దారి తీసిన ప్ర‌ధాన కార‌ణాన్ని న‌ర‌వ‌ణె త‌న పుస్త‌కంలో పేర్కొన్నారు. స‌రిహ‌ద్దుల్లోని ప్యాట్రోలింగ్ పాయింట్ – 14 నుంచి చైనా సైన్యం వెన‌క్కి వెళ్ల‌డానికి నిరాక‌రించ‌డ‌మే దీనికి కార‌ణ‌మ‌ని ఆయ‌న అన్నారు. ‘పీపీ-14 ద‌గ్గ‌ర నుంచి వెన‌క్కి వెళ్లాల‌ని ఎన్నిసార్లు చెప్పినా వారే సాకులు చెప్పేవారు. మ‌రోసారి అడిగిన‌పుడు వారి వాద‌నే మారిపోయేది. మొదట కాస్త స‌మ‌యం కావాల‌నేవారు. త‌ర్వాత ఉన్న‌తాధికారుల‌తో మాట్లాడాల‌నే వారు.


ఆ త‌ర్వాత ఏకంగా ఇది చ‌ర్చ‌లతో ప‌రిష్కార‌మ‌య్యేది కాదు. ఇక్క‌డి నుంచి క‌ద‌లం అనే వ‌ర‌కు వ‌చ్చారు’ అని న‌ర‌వ‌ణె ఆనాటి ఘ‌ట‌న‌ల‌ను రాశారు. ఇక లాభం లేద‌నుకుని తాము కూడా పీపీ-14 వ‌ద్ద టెంట్లు వేశామ‌ని.. దానికి వారు హింసాత్మ‌క రీతిలో ప్ర‌తిఘ‌టించార‌ని గుర్తుచేసుకున్నారు. ఆ త‌ర్వాత అక్క‌డికి ఇరువైపుల నుంచి పెద్ద ఎత్తున సైనిక స‌మీక‌ర‌ణ జ‌రిగింద‌ని.. రాత్రంతా ఎదురుబొదురు నిల‌బ‌డి రెండు సైన్యాలూ ఉన్నాయ‌ని తెలిపారు.


అయితే ఆ దుశ్చ‌ర్య వ‌ల్ల చైనా సైన్యం త‌గిన మూల్యం చెల్లించుకుంద‌ని న‌ర‌వ‌ణె అభిప్రాయ‌ప‌డ్డారు. ఓ దాడిలో 20 మంది సైనికులు ప్రాణాలు కోల్పోవ‌డం చిన్న విష‌యం కాదు కదా అని ఆయ‌న పుస్త‌కంలో ప్ర‌శ్నించారు. ‘చైనా అదుపులో ఉన్న మ‌న సైనికుల‌ను బ‌హిరంగ ప్ర‌దేశాల్లోనే ఉంచారు. చ‌నిపోయిన వారి సైనికుల మృత‌దేహాల‌ను న‌దుల్లో పాడేయడం మన సైనికులు క‌ళ్లారా చూశారు. అలా చూసిన ప్ర‌తిసారీ చైనా అధికారులు వారిని భౌతికంగా కొట్టేవారు’ అని న‌ర‌వ‌ణె వెల్ల‌డించారు.