Liu Chuxi | 55 రోజులుగా కోమాలో విద్యార్థి.. ప్రాణం పోసిన స్నేహితుల వీడియో

Liu Chuxi | స్నేహ‌మేరా జీవితం.. స్నేహ‌మేరా శాశ్వ‌తం.. అనే దానికి ఈ సంఘ‌ట‌నే నిద‌ర్శ‌నం. రోడ్డు ప్ర‌మాదంలో తీవ్రంగా గాయ‌ప‌డి 55 రోజులుగా కోమాలో ఉన్న ఓ ఎనిమిదేళ్ల విద్యార్థికి.. స్నేహితులే ఊపిరి పోశారు.

Liu Chuxi | 55 రోజులుగా కోమాలో విద్యార్థి.. ప్రాణం పోసిన స్నేహితుల వీడియో

Liu Chuxi | స్నేహ‌మేరా జీవితం.. స్నేహ‌మేరా శాశ్వ‌తం.. అనే దానికి ఈ సంఘ‌ట‌నే నిద‌ర్శ‌నం. రోడ్డు ప్ర‌మాదంలో తీవ్రంగా గాయ‌ప‌డి 55 రోజులుగా కోమాలో ఉన్న ఓ ఎనిమిదేళ్ల విద్యార్థికి.. స్నేహితులే ఊపిరి పోశారు. త‌మ స్నేహితుడు కోమాలో ఉన్నాడ‌న్న విష‌యాన్ని తెలుసుకుని ఆ పిల్లలంతా త‌ల్ల‌డిల్లిపోయారు. త‌మ ఫ్రెండ్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షిస్తూ.. త‌ర‌గ‌తి గదుల్లో ఉల్లాసంగా గ‌డిపిన గ‌త‌ స్మృతుల‌ను గుర్తు చేస్తూ ఓ వీడియోను త‌యారు చేశారు. ఇక ఆ వీడియోలోని త‌న స్నేహితుల మాట‌లు విని, ఆ స్మృతుల‌ను నెమరేసుకుని కోమాలో నుంచి బ‌య‌ట‌ప‌డ్డాడు ఆ పిల్లాడు. కోమాలో ఉన్న స్నేహితుడికి ప్రాణం పోసిన వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది.

చైనాలోని హునాన్ ప్రావిన్స్‌కు చెందిన లియూ చుక్సీ(8) ప్రైమ‌రీ స్కూల్ స్టూడెంట్. గ‌తేడాది నవంబ‌ర్ నెల‌లో లియూ రోడ్డు ప్ర‌మాదానికి గుర‌య్యాడు. లియూ మెద‌డు, ఊపిరితిత్తులు దెబ్బ‌తిన్నాయి. దీంతో అత‌ను కోమాలోకి వెళ్లిపోయాడు.

త‌ల్లి ఆవేద‌న

బాలుడి ఆరోగ్య ప‌రిస్థితి రోజురోజుకు విష‌మిస్తుండ‌డంతో.. త‌న కుమారుడు బ‌తికే అవ‌కాశం లేద‌ని త‌ల్లి ఆవేద‌న చెందింది. కానీ డాక్ట‌ర్ ఆమెకు ధైర్యం చెప్పాడు. అత‌నికి ఇష్ట‌మైన వారి స్వ‌రం వినిపించ‌డం, ఇష్ట‌మైన సంగీతం వినిపించ‌డం వంటివి రెగ్యుల‌ర్‌గా చేస్తే.. కాస్త స్పృహలోకి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని డాక్ట‌ర్ కౌన్సెలింగ్ చేశాడు.

చుక్సీ.. త్వ‌ర‌గా మేల్కో..

డాక్ట‌ర్ స‌ల‌హా మేర‌కు లియూ త‌ల్లి.. అత‌ని దిన‌చ‌ర్య‌లో భాగంగా చేసే ప్ర‌తి ప‌నిని రికార్డు చేసి వినిపించ‌డం మొద‌లు పెట్టింది. అంతేకాకుండా త‌న పాఠ‌శాల‌లో వేకప్ మ్యూజిక్‌తో పాటు ఇత‌ర‌త్రా కార్య‌క్ర‌మాల‌ను కూడా రికార్డు చేసి వినిపిస్తూ వ‌చ్చింది. ఇదే స‌మ‌యంలో లియూ క్లాస్ టీచ‌ర్.. అత‌ని స్నేహితుల‌తో ఓ వీడియోను రూపొందించాడు. చుక్సీ.. త్వ‌ర‌గా మేల్కో.. మ‌నం క‌లిసి ఫుట్ బాల్ ఆడుదాం అని ఓ స్నేహితుడు కోర‌గా, మేం నిన్ను మిస్ అవుతున్నాం చుక్సీ అని మ‌రో అమ్మాయి త‌న ఆవేద‌న‌ను వెలిబుచ్చింది. నువ్వు మాతో ఉంటే ఒక్క‌సారి క‌ళ్లు తెరువు.. ఎగ్జామ్స్ ద‌గ్గ‌ర ప‌డుతున్నాయి.. నీతో క‌లిసి చ‌దువుకునేందుకు మేమంతా ఎదురుచూస్తున్నామ‌ని మ‌రో విద్యార్థి కోరాడు. ఇంకో అబ్బాయి.. లియూకు ఇష్ట‌మైన పాట‌ను ఆల‌పించాడు. ఇంకోంద‌రు మ‌రికొన్ని క‌థ‌లు చెప్పారు. వీట‌న్నింటిని ఓ వీడియో రూపంలో త‌యారు చేసి.. ప్ర‌తిరోజు లియూకు వినిపించ‌డం మొద‌లుపెట్టింది త‌ల్లి.

55 రోజుల‌కు లియూలో స్పృహ

వీటితో పాటు మ్యాథ్స్ మాస్ట‌ర్ చెప్పిన పాఠాల‌ను కూడా లియూకు వినిపించింది త‌ల్లి. మొత్తానికి కొన్ని వారాల త‌ర్వాత ఆ స్వ‌రాల‌కు లియూ ప్ర‌తిస్పందించాడు. త‌న స్నేహితుల మాట‌లు విని న‌వ్వ‌డం మొద‌లుపెట్టాడు. క‌ళ్లు చెమ‌ర్చాడు. టీచ‌ర్ స్వ‌రం విని మ‌రోసారి న‌వ్వాడు. మొత్తానికి అత‌ని మెద‌డులో క‌ద‌లిక వ‌చ్చింది. కోమాలోకి వెళ్లిన 55 రోజుల‌కు లియూలో స్పృహ వ‌చ్చింది. అత‌ను ఎడ‌మ చేతిని క‌దిలించిన‌ట్లు వైద్యులు పేర్కొన్నారు. త్వ‌ర‌లోనే లియూ కోలుకుంటాడ‌ని, సాధార‌ణ స్థితిలోకి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని డాక్ట‌ర్లు ఆశాభావం వ్య‌క్తం చేశారు.