Renu Desai | రేణు దేశాయ్‌పై అసభ్యకర కామెంట్లు.. ఇద్దరిని అరెస్ట్ చేసిన సైబర్‌క్రైమ్ పోలీసులు
Renu Desai | సినీ నటి రేణు దేశాయ్‌ని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ఇద్దరు వ్యక్తులను సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
Renu Desai | సినీ నటి రేణు దేశాయ్‌ని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ఇద్దరు వ్యక్తులను సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియా వేదికగా తనపై అసభ్య పదజాలంతో దూషిస్తూ, తప్పుడు కథనాలు ప్రచారం చేస్తూ కొందరు వ్యక్తులు వేధింపులకు గురి చేస్తున్నారని రేణు దేశాయ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు.
రేణు దేశాయ్ తన ఫిర్యాదులో, ముఖ్యంగా వీధి కుక్కల సమస్య వంటి సామాజిక అంశాలపై స్పందించిన తర్వాత తనపై సోషల్ మీడియాలో దాడులు మరింత పెరిగాయని పేర్కొన్నారు. కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ తనను టార్గెట్ చేస్తున్నారని ఆమె ఆరోపించారు.
ఐటీ చట్టం కింద కేసులు..
ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. డిజిటల్ ఫోరెన్సిక్ సాంకేతికతను ఉపయోగించి సోషల్ మీడియా అకౌంట్ల వివరాలను విశ్లేషించిన పోలీసులు ఇద్దరు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వారిపై ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఈ కేసులో మరికొందరి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వారిని గుర్తించేందుకు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సోషల్ మీడియాలో అనామక అకౌంట్ల వెనుక దాక్కుని ఎవరినైనా దూషించవచ్చని భావించడం పొరపాటని, ముఖ్యంగా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
ఆన్‌లైన్ వేధింపులు..
కొన్ని రోజుల క్రితం రేణు దేశాయ్ ఒక వీడియో విడుదల చేస్తూ తనపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. గత కొన్నేళ్లుగా ఆమె ఆన్‌లైన్ వేధింపులను ఎదుర్కొంటున్నట్లు కూడా వెల్లడించారు.
ఇటీవల సోషల్ మీడియాలో సెలబ్రిటీలపై అసభ్య వ్యాఖ్యలు చేసే ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో, తెలంగాణ పోలీసులు ఇటువంటి కేసుల్లో కఠినంగా వ్యవహరిస్తున్నారు. గతంలో యాంకర్ అనసూయను వేధించిన వారిపై కూడా పోలీసులు చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా రేణు దేశాయ్ కేసులో జరిగిన అరెస్టులు సైబర్ వేధింపులపై ప్రభుత్వం ఎంత సీరియస్‌గా ఉందో మరోసారి స్పష్టం చేస్తున్నాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram