పట్టణ ఓటర్లా.. మజాకా!!

మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌కు ముందు రోజు తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున డబ్బు పంపిణీ కార్యక్రమాల్లో ప్రధాన పార్టీ అభ్యర్థులు నిమగ్నమైనట్టు తెలుస్తున్నది. గ్రామ పంచాయతీ ఎన్నికలతో పోల్చితే అధికంగానే ముట్టజెప్పాల్సి వస్తున్నదని పలువురు వాపోతున్నారు.

విధాత, ప్రత్యేక ప్రతినిధి:
నిన్నమొన్న ముగిసిన గ్రామ పంచాయతీ ఎన్నికలనుకున్నారా!? పల్లెటూరి ఓటర్ల తీరు మేమేన్నా పాలి‘ట్రిక్సు’ వలలో చిక్కుకుంటామనుకుంటున్నారా? ఇవి మున్సిపల్ ఎన్నికలు.. మేము పట్టణ ఓటర్లం… మాకు కాసింత టెక్కెక్కువే… కాదు కాదు… చదువు… సామాన్య జ్ఞానం కూడా ఎక్కువే… పొలిటికల్ మార్కెట్‌లో మాకు రెటెక్కువ తెలుసా… ఇంకా ఎక్కువ మాట్లాడితే… లోకల్ పోటీని బట్టి కాసింత డిమాండ్ ఎక్కువే… గిరాకీ ఎక్కువే. అయినా ఆఖరు క్షణం వరకు ఓటేస్తామా? లేదా? అనేది కూడా మా ఇష్టం…. ఇదీ తెలంగాణలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల పోలింగుకు చివరి రోజు పట్టణాల్లోని గల్లీల్లో నెలకొన్న తాజా పరిస్థితి. మాకూ మందైనా… విందైనా … అదికూడా కాస్ట్లీ ఉండాలే. ఇక ఓటు రెటేంటరా? తక్కువలో తక్కువ వెయ్యి ఈ చెయ్యికి ముట్టజెప్పాల్సిందే. మా గల్లీలో అభ్యర్ధుల పోటీ ఎక్కువ. అందుకే రెటెక్కువ మూడుకు తక్కువ తీసుకునేదిలేదంటున్నారు. గిట్లయితే… ఎట్ల బై .. అంటూ పైసల పంపిణీ కొచ్చేవారితో మొహమాటం లేకుండా ముఖం మీదే రేటు చెప్పేస్తున్నారు.

ఈ పార్టీ, ఆ పార్టీ కాదుగానీ, మూడు ప్రధాన పార్టీలు ఓటరు దేవుళ్ళను తమ వైపు తిప్పుకునేందుకు మొక్కులు భారీగానే చెల్లించుకుంటున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రచారంలో గెలుపు కోసం పోటీపడ్డట్లుగానే ఇందులో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల పోటీపడుతున్నాయని సమాచారం. అభ్యర్ధుల ఎంపికలోనే పార్టీలు ‘ప్రత్యేకత’లున్నవారినే ఎంపిక చేశారనే అభిప్రాయాలు ఉన్నాయి. పార్టీ లాయలిస్టులకంటే పర్సుచూసి ఎంపిక చేసినందున వారు కూడా పంపిణీలో వెనుకాముందాడడం లేదని చర్చించుకుంటున్నారు. పైకి ఎన్ని నీతులు వల్లిస్తున్నా…. పకడ్బందీ నిఘాలున్నాయని చెబుతున్నప్పటికీ మంగళవారం సాయంత్రం నుంచి స్పెషల్ టీములు రంగంలోకి దిగాయనే ప్రచారం సాగుతున్నది. స్థానిక పరిస్థితులను బట్టి తెల్లవారు జాము వరకు ఈ పంపిణీ ప్రశాంతంగా సాగిపోయేందుకు ప్రణాళికలు రూపొందించుకున్నారని సమాచారం. ఈ మేరకు ఎప్పుడు తమ చేతిలోపడుతాయని ఓటర్లు కూడా సమయం కోసం ఎదురుచూస్తున్నారు.

పొద్దున బుధవారం ఓటర్లు ‘మేల్కోగా’నే పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లి ఓట్లు గుద్దడమే. దీంతో అందిన ఉపకారాన్ని మరిచిపోకుండా పోలింగ్ కు ఒక్క రోజు ముందు అందరూ ముద్దుగా చెప్పుకొనే ‘పోల్ మేనేజ్‌మెంట్‌’ను అమలుపరచడంలో మూడు ప్రధాన పార్టీలు పోటీపడుతున్నాయని సమాచారం. ఎక్కడైనా అభ్యర్ధుల ఆర్ధిక పరిస్థితి కాసింత సానుకూలంగా లేకుంటే పార్టీ వెన్నుదన్నుగా నిలుస్తోంది. స్థానిక ఎమ్మెల్యేనో… నియోజకవర్గ ఇన్‌చార్జ్‌.. లేదా పార్టీ నాయకుడో ‘అండదండలు’ అందిస్తున్నారని సమాచారం. ఎన్నికల్లో గెలిస్తే తర్వాత ఎలాగూ ఆదాయమే కనుక అభ్యర్ధులు కూడా పంపిణీకి వెనుకంజ వేయడంలేదు.

కౌన్సిలర్, కార్పొరేటర్ ఎన్నిక కోసం పోటీపడి ఖర్చుకు వెనుకాడకుండా నీళ్ళలా ఖర్చుచేస్తున్నారని తెలుస్తున్నది. ఇక మేయర్, చైర్మన్ గిరి అభ్యర్ధులైతే తమతో పోటు తమ సహచర అభ్యర్ధులకు పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. గెలుస్తమో? లేదోనని లోపల ఆందోళన ఉన్నప్పటికీ ఎన్నికల గోదాలోకి దిగిన తర్వాత ఈ మాత్రం ఖర్చు చేయకుండా వెనుకంజ వేస్తే ఎన్నికలెట్ల పూర్తయితయి? నువ్వెట్ల గెలుస్తవంటూ ఎదురు ప్రశ్నలు తప్పడం లేదని అభ్యర్ధులు ఆవేదనతో అంటున్నారు. రంగంలోకి దిగినం కాబట్టి నిండా మునిగిన తర్వాత చలెక్కడదంటూ కొందరు తెగించి ఖర్చు చేస్తున్నారు. ఇప్పటికే రోజువారీ ప్రచారానికి, మద్యం, విందులకు చిలుము వదిలించుకున్న వారు చివరి రోజు మంగళవారం రాత్రి సర్వశక్తులొడ్డుతున్నారు. తమ డబ్బులు వార్డు, డివిజన్ పరిధిలోని ఓట్లరకు అందుతున్నాయా? మధ్యలో ఎవరైనా నొక్కేస్తున్నారా? అనేది చెక్ చేసుకుంటూ పంపిణీని పర్యవేక్షిస్తున్నారు. అందరికీ ఈ తతంగం తెలిసినా పట్టణాలు కావడంతో కాసింత పెట్రోలింగులు, పహారాలు కూడా జోరుగానే సాగుతున్నాయి. కాకుంటే చిక్కేవారే చేతికి దొరకకుండా దోబూచులాడుతున్నారు. కొన్ని చోట్ల నగదు పురస్కారాలకు మోహమాటంగా ఉన్న వారికి తగిన విధమైన బహుమతులు అందిస్తున్నారు. మొత్తంగా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిని పూర్తి చేసే పనిలో రాజకీయ పార్టీల నాయకులు, అభ్యర్ధులు నిమగ్నమయ్యారు. బుధవారం జరిగే పోలింగ్ ఏర్పాట్లలో అధికారులు తలమునకలయ్యారు. పనులన్నీ ప్రశాంతంగా జరిగే విధంగా పోలీసులు పహారా కాస్తున్నారు.

Latest News