Menopause | మెనోపాజ్! ప్రతి మహిళ జీవితంలో అత్యంత కీలకమైన దశ! మహిళలు పిల్లలను కనే దశ ముగింపునకు చేరుకునే సమయం. సాధారణంగా ఇదొక స్వాభావిక బయొలాజికల్ మార్పు. కానీ.. మెనోపాజ్.. ఒక మహిళ శారీరక, భావోద్వేగ, మానసిక, సామాజిక శ్రేయస్సుపై దీర్ఘకాల ప్రభావాలు చూపిస్తుంది. మామూలుగానైతే మహిళలకు 45 నుంచి 55 ఏళ్ల మధ్యకాలంలో (సగటు వయసు 50–51) ఎప్పుడైనా ఈ పరిస్థితి తలెత్తవచ్చు. కొందరిలో జన్యు సంబంధిత అంశాలు, ఆటోఇమ్యూన్ సమస్యలు లేదా ఇతర ఆరోగ్య కారణాలతో ముందే రావచ్చు.. కొంత జాప్యమూ కలుగవచ్చు.
అండాశయాల పని క్రమంగా తగ్గిపోవడం, ఈస్ట్రోజెన్ హార్మోన్ స్థాయి పడిపోవడం కారణంగా మెనోపాజ్ వస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. అయితే.. మెనోపాజ్‌కు ముందటి స్థితి.. అంటే పెరిమోనోపాజ్ దశ కూడా కీలకమైనదే. పెరిమోనోపాజ్ దశ కనీసంగా రెండేళ్ల నుంచి గరిష్ఠంగా ఎనిమిదేళ్ల వరకూ కొనసాగుతుంది. ఈ సమయంలో పీరియడ్స్ సైకిల్ డిస్ట్రబ్ అవుతుంది. అంటే.. రావాల్సిన తేదీకన్నా ముందే లేదా ఆలస్యంగా పీరియడ్స్ వస్తాయి. ఇక హార్మోన్లలో చాలా తేడా వస్తుంది. శరీరం అనూహ్య మార్పులకు లోనవుతుంది.
మెనోపాజ్ సమయంలో శరీరంలో ఈస్ట్రోజెన్ స్థాయి తగ్గిపోవడం వల్ల శరీరం, మెదడు, రక్తనాళాల వ్యవస్థపై ప్రభావం పడుతుందని మణిపాల్ హాస్పిటల్‌కు చెందిన గైనకాలజిస్ట్ డాక్టర్ హేమానందిని జయరామన్ అంటున్నారు. ఈ సమయంలో సాధారణంగా పీరియడ్స్‌లో మార్పులు, హాట్ ఫ్లాషెస్ (అకస్మాత్తుగా వేడి చేయడం), రాత్రిళ్లు చమట పట్టడం, నిద్రలేమి, మానసిక స్థితి మారిపోతూ ఉండటం, ఆందోళన, భయం, శృంగారంపై ఆసక్తి తగ్గిపోవడం, వెజైనల్ డ్రైనెస్, బరువు పెరగడం, చర్మం, జుట్టు ఎండిపోవడం, పొట్ట ఉబ్బరం, బ్రెయిన్ ఫాగ్ అని చెప్పే.. ఏకాగ్రత లోపం/మతిమరుపు వంటి లక్షణాలు ప్రారంభంలో కనిపిస్తాయని ఆమె చెబుతున్నారు. కొందరు మహిళల్లో ఈ సంకేతాలు తేలిగ్గా ఉంటే.. మరికొందరికి భరించలేని స్థాయిలో కూడా ఉండొచ్చని అంటున్నారు. అవి ఒక్కోసారి రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసేంత స్థాయిలో కూడా ఉంటాయని చెబుతున్నారు.
ఇదొక శారీరక పరివర్తన కావడంతో ప్రిమెనోపాజ్ దశలో హార్మోనల్ మార్పులు చోటు చేసుకుంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. మూడ్, నిద్ర, భావోద్వేగ నియంత్రణపై ఇది నేరుగా ప్రభావం చూపుతుంది. మహిళల శరీరంలో ఈ దశలో చోటు చేసుకునే మార్పులు బలహీనత వల్ల కలిగేవి కావని, ఆ సమయంలో మనసు, శరీరం అత్యంత ప్రధానమైన పరివర్తనకు అలవాటు పడుతున్న ప్రక్రియ మాత్రమేనని సైకోథెరపిస్టులు చెబుతున్నారు. సరిగ్గా ఒక మహిళ జీవితంలో ఇదే వయసులో కుటుంబ బాధ్యతలు, ఉద్యోగ భారం, పిల్లల పెంపకం.. ఇవన్నీ కలిసి మానసిక ఒత్తిడిని మరింత పెంచుతాయని అంటున్నారు.
సహాయం ఎప్పుడు అవసరం?
మహిళలు తమ పీరియడ్స్ పూర్తిగా ఆగిపోయేంత వరకూ ఎదురు చూడకూడదని వైద్యులు సూచిస్తున్నారు. మహిళలు పెరిమెనోపాజ్ దశలోనే వైద్య సహాయం పొందాలని చెబుతున్నారు. పీరియడ్స్ సైకిల్ ఇర్రెగ్యులర్‌గా ఉంటున్నప్పుడు, నిద్రలేమి, ఆందోళన, బ్రెయిన్‌ఫాగ్, హాట్ ఫ్లాషెస్ వంటి వాటిని ముందుగానే ట్రీట్ చేయడం ద్వారా మేనేజ్ చేయవచ్చునని అంటున్నారు. తద్వారా జీవన నాణ్యత మెరుగుపడుతుందని, దీర్ఘకాలంలో ఆరోగ్యం స్థిరంగా ఉంటుందని పేర్కొంటున్నారు. కుటుంబ మద్దతు కూడా ఈ దశలో అత్యంత కీలకమని చెబుతున్నారు. ఒకవైపు వైద్య చికిత్సలు పొందుతూనే.. భావోద్వేగ మార్పులు నిద్రను, సంబంధాలు, రోజువారీ పనితీరును ప్రభావితం చేస్తున్నట్టయితే.. మానసిక నిపుణుల మద్దతు కూడా పొందాలని వైద్యులు చెబుతున్నారు. బాధ దీర్ఘకాలికంగా మారకముందే ఈ పరివర్తన దశను అధిగమించేందుకు చికిత్స.. మహిళకు సహకరిస్తుందని సూచిస్తున్నారు. హార్మోనల్ చికిత్స కొందరికి అవసరమైనా.. నాన్‌హార్మోనల్ ఆప్షన్స్ కూడా అత్యంత సమర్థవంతమైనవేనని నిపుణులు చెబుతున్నారు. జీవన విధానాన్ని మార్చుకోవడం, తగినంత వ్యాయామం చేయడం, కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ, నిర్దిష్ట యాంటిడిప్రెస్సెంట్స్‌తోపాటు.. వెజైనల్ మాయిశ్చర్స్ కూడా ఉపయోగపడతాయని అంటున్నారు. వీటి వల్ల శరీరం వెడెక్కడం, మూడ్ మారిపోవడం, నిద్ర సమస్యలు అన్నీ పరిష్కారమవుతాయని చెబుతున్నారు.
మెనోపాజ్ దశ అనేది మహిళ తన జీవితకాలంలో భరించాల్సిన ఒక పరిస్థితి అనే దురభిప్రాయం చాలా మంది మహిళల్లో ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. కానీ.. మెనోపాజ్, పెరిమెనోపాజ్ దశల్లో కనిపించే అన్ని లక్షణాలకూ చికిత్స ఉందని, ఈ దశల్లో మహిళలు మౌనంగా బాధపడాల్సిన అవసరం లేదని వైద్యులు సూచిస్తున్నారు. మెనోపాజ్ అనేది ఒక దశ ముగింపుగానే చూడటం కాకుండా.. మన ఆరోగ్యం, మన జీవిన విధానం, ప్రాధాన్యాలను పునర్నిర్వచించుకునేందుకు దీనిని ఉపయోగించుకోవాలని కోరుతున్నారు.
నోట్: ఈ ఆర్టికల్ మెనోపాజ్‌పై సాధారణ అవగాహనకోసమే. ఇది ప్రామాణికం కాదు. మెనోపాజ్ లేదా పెరిమెనోపాజ్ దశల్లో వైద్యుల సూచనల మేరకు మాత్రమే వ్యవహరించాలి.
