• Telugu News
  • /Lifestyle

ఇంజెక్షన్లకు ఇక గుడ్‌బై? మధుమేహం చికిత్సకు కొత్త ఔషధంతో కొత్త ఆశలు

మీరు మధుమేహంతో బాధపడుతున్నారా? సూది మందులు తీసుకోవడం ఇబ్బందికరంగా ఉంటున్నదా? అయితే ఈ వార్త మీకోసమే.

Reported by: Jagan Mohan Talluri | జీవనశైలి | Edited by: విధాత సైన్స్ డెస్క్ | Jun 16, 2026, 4:30 pm IST
Read Time: 9 mins
ఇంజెక్షన్లకు ఇక గుడ్‌బై? మధుమేహం చికిత్సకు కొత్త ఔషధంతో కొత్త ఆశలు

టైప్‌ 2 డయాబెటిక్‌ రోగులకు శాస్త్రవేత్తలు శుభవార్తను అందించారు. రక్తంలో షుగర్‌ లెవెల్‌ను అదుపు చేయడంలోనూ, శరీర బరువు తగ్గడంలోనూ కొత్తగా అభివృద్ధి చేస్తున్న జీఎల్‌పీ–1 టాబ్లెట్‌ అద్భుతమైన ఫలితాలను ఇచ్చిందని ప్రకటించారు. అంటే.. ఇప్పటి ఇంజెక్షన్స్‌ మాత్రమే అందుబాటులో ఉన్న ఈ శక్తిమంతమైన చికిత్సను.. ఇకపై సులువుగా ట్యాబెట్ల రూపంలో తీసుకునే అవకాశం కలుగబోతున్నది. దీనికి సంబంధించిన వివరాలను మాస్‌ జనరల్‌ బ్రిఘం పరిశోధకురాలు డాక్టర్‌ వనితా అరోడా.. ఇటీవల అమెరికన్‌ డయాబెటీస్‌ అసోసియేషన్‌ వార్షిక సమావేశం(ADA Scientific Sessions)లో వెల్లడించారు.

SOLSTICE ట్రయల్ అంటే ఏమిటి?

ఇది ఫేజ్‌ 2బీ యాదృచ్ఛిక, ప్లేసిబో–నియంత్రిత క్లినికల్‌ ట్రయల్‌. ఈ ట్రయల్స్‌లో ఎలెకోగ్లిప్రాన్‌ అనే కొత్త జీఎల్‌పీ–1 ఔషధాన్ని పరీక్షించారు. ఇది నోటి ద్వారా తీసుకునే ఔషధం. ఈ పరిశోధన ఫలితాలను ప్రతిష్ఠాత్మక మెడిసిన్‌ జనరల్‌ ది లాన్సెట్‌లో ప్రచురించారు. టైప్‌2 డయాబెటిస్‌ పేషెంట్లలో ఇది రక్తంలో చక్కెర స్థాయిని గణనీయంగా తగ్గించడమే కాకుండా.. అదే స్థాయిలో శరీర బరువును కూడా తగ్గించింది.

ఇప్పటి చికిత్సా విధానాలకన్నా దీనిలో ప్రత్యేకతేంటి?

ఇప్పటి వరకూ అందుబాటులో ఉన్న జీఎల్‌పీ–1 ఔషధాలు ఎక్కువ భాగం చర్మం కింద సూదిని పంపి (సబ్‌క్యుటేనియస్ ఇంజెక్షన్) ఔషధాన్ని శరీరంలోకి ప్రవేశపెట్టేవే. సెమాగ్లుటైడ్‌ అనే ట్యాబ్లెట్‌ లభిస్తున్నా.. దానిని కొన్ని కఠిన నిబంధనలు పెట్టారు. ఉదయం నిద్రలేచిన తర్వాత ఖాళీ కడుపుతో ఈ మాత్ర తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు.. ఆ తర్వాత 30 నిమిషాలపాటు నీళ్లు కూడా తాగకూడదు. ఓర్ఫోర్‌గ్లిప్రాన్‌ అనే నాన్‌ పెప్టైడ్‌ జీఎల్‌పీ–1 అనే ఓరల్‌ మెడిసన్‌ కూడా వెయిట్‌ మేనేజ్‌మెంట్‌ విషయంలో అమెరికాలో ఆమోదం పొందినప్పటికీ.. మధుమేహానికి చికిత్స చేసేందుకు ప్రత్యేకంగా తయారు చేసిన ఎలెకోగ్లిప్రాన్‌ ఈ ఇబ్బందులను అధిగమించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

"రోగులకు మెరుగైన ఫలితాలను అందించాలన్న ధ్యేయం మా ప్రతి క్లినికల్‌ ట్రయల్‌కు మూలం. ఈ సమావేశంలో ప్రదర్శించిన అధ్యయనాలు కొత్త చికిత్సలను అంచనా వేయడానికి, ఇప్పటికే ఉన్న విధానాలను మెరుగుపర్చడానికి క్షుణ్ణంగా రూపొందించిన ట్రయల్స్‌ ఎంత అవసరమో నిరూపిస్తున్నాయి. "

- డాక్టర్‌ వనిత అరోడా

9 దేశాల నుంచి 406 మందిపై ట్రయల్స్‌

ఆస్ట్రాజెనెకా (AstraZeneca) సంస్థ ఈ అధ్యయనాన్ని స్పాన్సర్‌ చేసింది. ఈ ట్రయల్స్‌లో అమెరికాతోపాటు తొమ్మిది దేశాలకు చెందిన 406 మంది టైప్‌ 2 డయాబెటిక్‌ పేషెంట్లు పాల్గొన్నారు. వీరిని ర్యాండమ్‌గా వేర్వేరు చికిత్సా బృందాలుగా విభజించారు. తద్వారా ప్రారంభ మోతాదులు, డోస్‌ను క్రమంగా పెంచడం, ఆ తర్వాత మెయింటనెన్స్‌ డోస్‌.. ఇలా వేర్వేరు మోతాదుల ప్రభావాన్ని సమగ్రంగా అంచనా వేసేందుకు అవకాశం కలిగింది.

షుగర్‌ తగ్గింది.. బరువు కూడా…

26 వారాలపాటు వీరికి చికిత్స చేశారు. కొందరికి ఎలెకోగ్లిప్రాన్‌ ఇచ్చార. మరికొందరికి ప్లేసిబో (నకిలీ మాత్ర) ఇచ్చారు. అయితే.. నకిలీ మాత్ర తీసుకున్నవారికంటే ఎలెకోగ్లిప్రాన్‌ తీసుకున్నవారిలో షుగర్‌ లెవెల్స్‌ అన్ని మోతాదుల్లోనూ గణనీయంగా తగ్గాయి. ఎలెకోగ్లిప్రాన్‌ తీసుకున్నవారిలో 89.6 శాతం మందిలో HbA1c (గత రెండు మూడు నెలల సగటు సుగర్‌ లెవెల్‌) స్థాయి 7శాతానికి వచ్చింది. వాస్తవానికి ఇది చాలా మంది షుగర్‌ పేషెంట్లకు డాక్టర్లు నిర్ణయించే ప్రామాణిక లక్ష్యం. కానీ ప్లేసిబో తీసుకున్నవారిలో 24.9% మంది మాత్రమే ఆ లక్ష్యాన్ని చేరుకోగలిగారు. ఇక బరువు తగ్గే విషయంలోనూ ఈ టాబ్లెట్‌ తన సత్తా చాటింది. ఔషధం తీసుకున్నవారిలో 72.3 శాతం మంది కనీసంగా 5 శాతం బరువు తగ్గితే.. ప్లేసిబో సమూహంలో 20.2 శాతం మందిలో మాత్రమే ఆ స్థాయిలో తగ్గుదల కనిపించింది. దుష్ప్రభావాల విషయానికి వస్తే.. ఇతర జీఎల్‌పీ–1 ఔషధాలతో పోల్చినప్పుడు సహజ పరిధిలోనే ఉన్నాయని పరిశోధకులు నిర్ధారించారు.

మరో అధ్యయనం – REIMAGINE 1

REIMAGINE 1 అనే మరో క్లినికల్ ట్రయల్ ఫలితాలను కూడా ఏడీఏ సమావేశంలో డాక్టర్‌ వనిత ఆరోడా వివరించారు. ఈ అధ్యయనం ది లాన్సెట్ డయాబెటిస్ అండ్ ఎండోక్రినాలజీ జర్నల్‌లో పబ్లిష్‌ అయింది. ఈ ట్రయల్స్‌లో అమైలిన్‌ రిసెప్టర్‌ అగోనిస్ట్‌ అయిన కాగ్రిలిన్‌టైడ్‌ను ఇంజెక్టబుల్‌ సెమాగ్లుటైడ్‌తో కలిపి పరీక్షించారు. ఈ కాంబినేషన్‌ థెరపీలో పాల్గొన్నవారిలో 87 శాతం మంది HbA1c 7% లక్ష్యాన్ని సాధించడం గమనార్హం. ‘రోగులకు మెరుగైన ఫలితాలను అందించాలన్న ధ్యేయం మా ప్రతి క్లినికల్‌ ట్రయల్‌కు మూలం. ఈ సమావేశంలో ప్రదర్శించిన అధ్యయనాలు కొత్త చికిత్సలను అంచనా వేయడానికి, ఇప్పటికే ఉన్న విధానాలను మెరుగుపర్చడానికి క్షుణ్ణంగా రూపొందించిన ట్రయల్స్‌ ఎంత అవసరమో నిరూపిస్తున్నాయి’ అని డాక్టర్‌ అరోడా చెప్పారు. ఈ అధ్యయనంలో డాక్టర్‌ అరోడాతోపాటు.. మెలనీ జే డేవిస్‌, జిల్‌ మాస్కే, మార్కస్‌ మిల్లెగార్డ్‌, విక్టర్‌ లోపెస్‌ జువాన్‌, జెన్స్‌ అబర్లే, ఆండ్రియా సియుడిన్‌, రోరీ జే మెక్‌క్రిమ్మన్‌, ఒలోఫ్‌ ఎక్లండ్‌, జూడీ ఎల్‌ షి, మికేలా స్జోస్ట్రాండ్‌, డోనా జార్జువేలా, జూలియో రోసెన్‌స్టాక్ ఉన్నారు. మొత్తానికి వీరి పరిశోధనతో సూది భయం లేకుండా.. సులభంగా మాత్ర రూపంలో తీసుకునే మాత్ర రాబోతున్నది. ఇది మధుమేహంతో బాధపడేవారి జీవితంలో పెను మార్పులు తీసుకొస్తుందని అంచనా వేస్తున్నారు.