హైదరాబాద్‌లో ఒబేసిటీ … వరంగల్‌లో బీపీ : తెలంగాణలో ‘సైలెంట్ కిల్లర్ల’ విజృంభణ
హైదరాబాద్‌లో 81% మందికి అధిక బరువు, వరంగల్‌లో 52% మందికి బీపీ… Health of the Nation 2026 నివేదిక తెలంగాణలో పెరుగుతున్న జీవనశైలి వ్యాధులపై గంభీర హెచ్చరిక జారీ చేసింది.
Health of the Nation 2026 నివేదిక హెచ్చరిక: హైదరాబాద్‌లో ఊబకాయం పెరుగుతోంది, వరంగల్‌లో హైపర్‌టెన్షన్ కేసులు ఉధృతం
Health Alarm in Telangana: Hyderabad Sees Obesity Spike, Warangal Reports High BP Cases
తెలంగాణలో సైలెంట్ కిల్లర్ల హెచ్చరిక
హైదరాబాద్‌లో 81% మంది అధిక బరువుతో ఉండగా, వరంగల్‌లో 52% మందికి హైపర్‌టెన్షన్ ఉన్నట్లు Health of the Nation 2026 నివేదిక వెల్లడించింది. జీవనశైలి మార్పులు లేకపోతే భవిష్యత్తులో పెద్ద ఆరోగ్య సంక్షోభం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
- Health of the the Nation 2026: తెలంగాణలో సైలెంట్ కిల్లర్ల విస్తరణపై ఆందోళన
విధాత హెల్త్ డెస్క్ | హైదరాబాద్:
Telangana Health | తెలంగాణలో జీవనశైలి మార్పులు ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఆపోలో ఆసుపత్రి విడుదల చేసిన ‘Health of the Nation 2026’ నివేదిక రాష్ట్రంలో సంక్రమించని దీర్ఘకాలిక వ్యాధులు (Non Communicable Deceases)వేగంగా పెరుగుతున్నాయని వెల్లడించింది. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఊబకాయం భారీగా పెరుగుతుండగా, వరంగల్‌లో రక్తపోటు ప్రమాద స్థాయికి చేరిందని ఈ నివేదిక హెచ్చరిస్తోంది. 2025లో దేశవ్యాప్తంగా నిర్వహించిన 30 లక్షల ముందస్తు ఆరోగ్య పరీక్షల ఆధారంగా ఈ విశ్లేషణ రూపొందించబడటం గమనార్హం.
ఐటీ ఉద్యోగాల ప్రభావం… హైదరాబాద్ యువతలో ఊబకాయం

ఐటీ ఉద్యోగాల్లో ఎక్కువసేపు కూర్చునే జీవనశైలి వల్ల… హైదరాబాద్ యువతలో ఊబకాయం, ఒత్తిడి సమస్యలు పెరుగుతున్నాయి
హైదరాబాద్‌లో పరీక్షించిన వారిలో 81.3 శాతం మంది అధిక బరువు లేదా ఊబకాయంతో ఉన్నట్లు వెల్లడైంది. ఐటీ హబ్‌గా మారిన నగరంలో గంటల కొద్దీ కూర్చునే ఉద్యోగాలు, వ్యాయామం లేకపోవడం, ఫాస్ట్ ఫుడ్, అధిక క్యాలరీల ఆహారం వంటి అంశాలు కలిసి ఈ పరిస్థితిని మరింత తీవ్రమయ్యేలా చేస్తున్నాయి. దీని ప్రభావంగా జీర్ణ సంబంధిత వ్యాధులు పెరుగుతున్నాయి. డయాబెటిస్, గుండె సంబంధిత వ్యాధులు, కాలేయ సమస్యల వంటి దీర్ఘకాలిక వ్యాధులకు ఇది దారితీసే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. పౌరుల జీవనశైలిలో మార్పులు తీసుకురాకపోతే రాబోయే కాలంలో ఆరోగ్య వ్యవస్థపై భారీ ఒత్తిడి పడే అవకాశముందని నివేదిక స్పష్టం చేస్తోంది.
వరంగల్‌లో రక్తపోటు విజృంభణ… తెలంగాణకు హెచ్చరిక
ఇక వరంగల్‌లో పరిస్థితి మరో రకంగా ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్ర సగటు రక్తపోటు రేటు 27.3 శాతం ఉండగా, వరంగల్‌లో ఇది 52.6 శాతానికి చేరింది. అంటే ప్రతి ఇద్దరిలో ఒకరికి బీపీ సమస్య ఉన్నట్టే. ఇది త్వరగా బయటపడకపోవడంతో చాలామంది ఆలస్యంగా గుర్తిస్తున్నారు. ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, ఆరోగ్యంపై అవగాహన లోపం వంటి కారణాలు ఈ పెరుగుదలకు కారణమని నివేదిక సూచిస్తోంది. అదే సమయంలో హైదరాబాద్, వరంగల్ రెండు నగరాలలోనూ 70.6 శాతం మందిలో కొలెస్టరాల్ అసమతుల్యత ఉండటం, 22 శాతం మందికి రక్తహీనత ఉండటం, అలాగే డయాబెటిస్ కేసులు అధికంగా ఉండటం వంటి అంశాలు రాష్ట్రవ్యాప్తంగా జీవనశైలి వ్యాధులు విస్తరిస్తున్నాయని తెలియజేస్తున్నాయి.
మొత్తంగా ఈ నివేదిక ఒక స్పష్టమైన హెచ్చరికను ఇస్తోంది—జీవనశైలిలో మార్పులు, సమతుల్య ఆహారం, క్రమమైన వ్యాయామం, తరచూ ఆరోగ్య పరీక్షలు లేకపోతే ఊబకాయం, బీపీ, డయాబెటిస్ వంటి సైలెంట్ కిల్లర్లు భవిష్యత్తులో తెలంగాణను తీవ్రమైన ఆరోగ్య సంక్షోభంలోకి నెట్టే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
భారత్‌లో ముందుగానే వస్తున్న వ్యాధులు… యువతే ఎక్కువ ప్రమాదంలో!

యువతలో పెరుగుతున్న జీవనశైలి వ్యాధులు… ఒత్తిడి, జంక్ ఫుడ్, వ్యాయామం లోపంతో సంక్రమించని దీర్ఘకాలిక వ్యాధులు పెరుగుతున్నాయి
ఇక దేశవ్యాప్తంగా ఆరోగ్య పరిస్థితిపై కూడా ఈ నివేదిక కీలక విషయాలను వెల్లడించింది. Apollo Hospitals నిర్వహించిన 30 లక్షల ఆరోగ్య పరీక్షల ఆధారంగా, యువతలో ప్రతీ ముగ్గురిలో ఇద్దరు నాన్-కమ్యూనికబుల్ వ్యాధుల ప్రమాదంలో ఉన్నారు. ఉద్యోగాల్లో ఉన్న వారిలో దాదాపు సగం మందికి ప్రీడయాబెటిస్ లేదా డయాబెటిస్ ఉంది. 10 మందిలో 8 మంది అధిక బరువు లేదా ఊబకాయంతో బాధపడుతున్నారు.
విటమిన్ D లోపం 70 శాతం మందిలో.. సగం జనానికి B12 లోపం
దేశంలో విటమిన్ బి12 లోపం దాదాపు సగం మందిలో కనిపించింది. 30 ఏళ్లలోపు వయసులో ప్రతి 5 మందిలో ఒకరు ప్రీడయాబెటిస్(Pre-Diabetes)తో ఉన్నారు. ఉద్యోగుల్లో ప్రతి 4 మందిలో ఒకరికి హైబీపీ ఉంది. మహిళల్లో రక్తహీనత, పొట్ట ఎక్కువగా ఉండగా, 40 ఏళ్లకు పైబడిన మహిళల్లో ప్రతీ 359 మందిలో ఒకరికి లక్షణాలు లేకుండానే బ్రెస్ట్ క్యాన్సర్ గుర్తించబడింది. ఫ్యాటీ లివర్ ఉన్నవారిలో 74 శాతం మందికి సాధారణ లివర్ టెస్ట్‌లు ఉన్నప్పటికీ సమస్య దాగి ఉన్నట్లు తేలింది. పొట్ట ఆరోగ్యం(Gut Health)లో 92 శాతం మంది సగటు కంటే తక్కువ స్కోర్ సాధించగా, ప్రతి 15 మందిలో ఒకరికి కుంగుబాటు, ప్రతి 10 మందిలో ఒకరికి ఆందోళన సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. ఫాలోఅప్ చెకప్‌లు చేసినవారిలో 56 శాతం మందికి బీపీ నియంత్రణలోకి రావడం, 34 శాతం మందిలో షుగర్ మెరుగుపడటం, 26 శాతం మంది బరువు తగ్గడం వంటి సానుకూల ఫలితాలు నమోదయ్యాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram