విధాత, హైదరాబాద్ : తెలంగాణ ఆటో డ్రైవర్లకు అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా నిలదీశారు. ఢిల్లీలో ఆటో డ్రైవర్లతో సమావేశమైన నేపథ్యంలో.. కొత్త హామీలు ఇచ్చే ముందు తెలంగాణలో ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏంటనేది ఆలోచించాలని సూచించారు. కాంగ్రెస్ హయాంలో ఆటోడ్రైవర్ల జీవితాలు ఆగమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆటో డ్రైవర్ల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని కేటీఆర్ గుర్తుచేశారు. ఒక్కో డ్రైవర్‌కు ఏటా రూ.12వేలు ఇస్తామని ఇప్పటివరకు పట్టించుకోలేదని అన్నారు. 30 నెలల కాంగ్రెస్ పాలనలో 100 మందికి పైగా ఆటోడ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. మూడేళ్ల క్రితం తెలంగాణలో ఆటోడ్రైవర్లకు ఇచ్చిన హామీలే ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. కొత్తగా ఢిల్లీలో ఈ నాటకాలేంటని రాహుల్ గాంధీని సూటిగా ప్రశ్నించారు.