Sleep | రాత్రి ఎటువైపు తిరిగి పడుకోవాలి? గర్భిణులు, గురక సమస్య ఉన్న వారు ఇలా చేస్తే బెటర్!

Sleep | పడుకునేప్పుడు ఎలా పడుకోవాలి? బోర్లా పడుకోవాలా? వెల్లకిలా పడుకోవాలా? ఏ వైపు తిరిగి పడుకోవాలనే సందేహాలు ఉంటాయి. మరి ఏ భంగిమలో పడుకుంటే మంచిది? వైద్య నిపుణులు ఏం చెబుతున్నారో ఒకసారి తెలుసుకుందాం..

Sleep | రాత్రి ఎటువైపు తిరిగి పడుకోవాలి? గర్భిణులు, గురక సమస్య ఉన్న వారు ఇలా చేస్తే బెటర్!

Sleep | ఆరోగ్యంగా ఉండాలంటే సరైన ఆహారం, వ్యాయమం ఎంత ముఖ్యమో కంటి నిండా నిద్ర కూడా అంతే అవసరం. ప్రశాంతంగా పడుకుంటే రోజంతా ఫ్రెష్‌గా ఉండొచ్చు. అయితే పడుకునేప్పుడు ఎలా పడుకోవాలి? బోర్లా పడుకోవాలా? వెల్లకిలా పడుకోవాలా? ఏ వైపు తిరిగి పడుకోవాలనే సందేహాలు ఉంటాయి. మరి ఏ భంగిమలో పడుకుంటే మంచిది? వైద్య నిపుణులు ఏం చెబుతున్నారో ఒకసారి తెలుసుకుందాం..

ఎడమ వైపు పడుకుంటే..!

వైద్య నిపుణుల సలహా ప్రకారం.. ఎడమ వైపు తిరిగి పడుకోవడం ఆరోగ్యానికి మంచిది. దీనివల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ముఖ్యంగా రాత్రివేళల్లో ఆసిడ్ రిఫ్లక్స్, గ్యాస్ సమస్యలతో బాధపడేవారికి ఇది ఎంతో ఉపశమనం కలిగిస్తుంది. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురితమైన పలు అధ్యయనాల ప్రకారం ఎడమ వైపు నిద్రపోవడం వల్ల గ్యాస్ట్రో ఈసోఫీజియల్ రిఫ్లక్స్ లక్షణాలు తగ్గే అవకాశం ఉంటుంది.

మనం తిన్న ఆహారం జీర్ణమవ్వగా మిగిలిన వ్యర్థాలు మొదట పెద్ద పేగు ప్రారంభ భాగంలోకి చేరుతుంది. ఇది మన శరీరంలోని కుడి భాగాన ఉంటుంది. అక్కడి నుంచి క్రమంగా ఎడమ వైపుఉన్న పెద్ద పేగు చివరి భాగమైన పురీష నాళంలోకి వస్తుంది. అయితే ఎడమ వైపు పడుకున్నప్పుడు గురుత్వాకర్షణ శక్తి కారణంగా కుడి నుంచి ఎడమ వైపునకు వ్యర్థాలన్నీ సులభంగా వెళ్లిపోతాయని నిపుణులు చెబుతుంటారు. అయితే దీనిపై పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి.. ఇంకా పూర్తిస్థాయి నిర్ధారణ రాలేదు.

గర్భిణులకు ఏ భంగిమ మంచిది?

గర్భిణులు ఎడమ వైపు తిరిగి పడుకోవడం మంచిదని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సూచిస్తోంది. ముఖ్యంగా రెండో, మూడో త్రైమాసికాల్లో ఎడమ వైపు తిరిగి పడుకోవడం వల్ల గర్భశయానికి, శిశువుకు రక్తప్రసరణ మెరుగుపడే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాగే వీపు, నడుము, వెన్నుముకపై ఒత్తిడి తగ్గి నిద్ర చక్కగా పడుతుంది. అలాగే గర్భశయానికి, పిండానికి రక్తప్రసరణ మెరుగు అవుతుంది. అయితే రాత్రంతా ఒకే భంగిమలోనే పడుకోవాల్సిన అవసరం లేదని, నిద్రలో సహజంగానే పొజిషన్ మారుతుండటం సహజమేనని నిపుణులు చెబుతున్నారు.

గురక సమస్యలు ఉంటే..

గురక సమస్యలు ఉన్నవారు వెల్లకిలా పడుకోవడం కంటే పక్కకు తిరిగి పడుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఎడమ వైపు తిరిగి పడుకోవడం వల్ల ఈ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుందని పేర్కొంటున్నారు. కొందరికి బోర్లా పడుకోవడం వల్ల కూడా గురక తగ్గొచ్చు. అయితే ఇలా ఎక్కువసేపు పడుకుంటే మెడ, వెన్నుపూసపై ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

గుండె ఆరోగ్యంపై ప్రభావం

రాత్రి పడుకునేటప్పుడు, కాస్త విశ్రాంతి తీసుకునేటప్పుడు ఎడమ వైపు తిరిగి పడుకోవడం మేలని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎడమవైపు పడుకోవడం వల్ల గుండె పనితీరుకు కొంత ఉపశమనం కలుగుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. మనకు గుండె ఎడమ వైపునకు ఉంటుంది కాబట్టి అదే దిశలో పడుకుంటే గురుత్వాకర్షణ కారణంగా రక్తం సరఫరా మెరుగ్గా అవుతుంది. ఫలితంగా గుండెపై ఒత్తిడి తగ్గి, ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయితే ప్రతి ఒక్కరికీ ఇదే వర్తించదని వైద్యులు చెబుతున్నారు. కొందరు హార్ట్ పేషెంట్లకు కుడివైపు పడుకోవడం సౌకర్యంగా అనిపించవచ్చని పేర్కొంటున్నారు.

రాత్రంతా ఒకే భంగిమలో పడుకోవాల్సిన అవసరం లేదని.. శరీరానికి సౌకర్యంగా అనిపించేవిధంగా నిద్రపోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. కాసేపు కుడివైపు, వెల్లకిలా పడుకున్నా సరే.. వీలైనంత ఎక్కువ సమయం ఎడమ వైపునకు పడుకోవడం మంచిదని అంటున్నారు.

Read More:

Sleepless Nights | అర్ధరాత్రి నిద్రాభంగమా? ఈ చిన్న టిప్స్ పాటిస్తే రాత్రంతా ప్రశాంతమైన నిద్ర ఖాయం..

Sleep | స‌రైన నిద్ర లేకుంటే గుండెకు న‌ష్ట‌మే..! తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు ఇవే..!!