HYDRA : ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం..రూ.1511 కోట్ల భూముల పరిరక్షణ

హైదరాబాద్ నలుమూలల ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపింది. చెరువులు, పార్కులు కలిపి రూ.1511 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జాదారుల నుంచి కాపాడింది.

విధాత, హైదరాబాద్ : హైదరాబాద్ నలుమూలల ప్రభుత్వ స్థలాలు, చెరువుల భూములలో జరిగిన ఆక్రమణలపై హైడ్రా ఉక్కు పాదం మోపింది. ఆక్రమణలను తొలగించడం ద్వారా రూ.1511 కోట్ల విలువైన భూమిని కబ్జా కోరల నుంచి కాపాడింది. ఆ భూముల పరిరక్షణకు వాటి చుట్టు హైడ్రా అధికారులు ఫెన్సింగ్ వేయించారు.

కొండాపూర్ లో 4 ఎకరాల చెరువు, అల్వాల్ లో 8 ఎకరాల కొత్త చెరువును కబ్జాదారుల చెర నుంచి హైడ్రా కాపాడింది. రాధాకృష్ణ నగర్ లో 450 గజాల పార్కు, జక్కిడి కాలనీలో 650 గజాల పార్కులను కబ్జాదారుల నుంచి కాపాడి ఫెన్సింగ్ వేశారు.

ఆక్రమణలపై హైడ్రా సీరియస్ యాక్షన్

పార్కులు, చెరువుల‌ను, ప్రభుత్వ స్థలాలను చెర‌ప‌ట్టిన వారి ప‌ట్ల హైడ్రా క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. మంగ‌ళ‌వారం ఒకే రోజు న‌గ‌రం న‌లువైపులా 4 చోట్ల భారీ ఆప‌రేష‌న్ నిర్వ‌హించి ఆక్ర‌మ‌ణ‌లు తొల‌గించింది. వెనువెంట‌నే ఫెన్సింగ్ వేసింది.రెండు చోట్ల 1100ల గ‌జాల మేర ఉన్నపార్కుల‌ను కాపాడ‌గా.. మ‌రో రెండు ప్రాంతాల్లో 1100ల ఎక‌రాల మేర‌ చెరువుల ఎఫ్‌టీఎల్ ప్రాంతాల‌ను హైడ్రా ర‌క్షించింది. ఇలా కాపాడిన భూమి విలువ సుమారుగా రూ. 1511ల కోట్ల వ‌ర‌కూ ఉంటుంద‌ని అంచ‌నా.

కొండాపూర్‌లో చెరువును కాపాడిన హైడ్రా

శేరిలింగంప‌ల్లి మున్సిప‌ల్ కార్యాల‌యం పరిధిలో మ‌దీనాగూడ రోడ్డు మార్గం కొండాపూర్‌లో రూ. 700 కోట్ల విలువైన భూమిని హైడ్రా మంగ‌ళ‌వారం కాపాడింది. 4 ఎక‌రాల జంగం కుంట‌ను పూడ్చేసి.. మ‌ట్టితో చ‌దును చేసి ప్లాట్లుగా విక్ర‌యించేందుకు సిద్ధ‌మైన క‌బ్జాదారుల ఆట క‌ట్టించింది హైడ్రా. ఇటీవ‌ల మీడియాలో వ‌చ్చిన క‌థ‌నాల మేర‌కు రెవెన్యూ అధికారుల‌తో హైడ్రా జాయింట్ ఇన్‌స్పెక్ష‌న్ చేసింది. జంగం కుంట‌గా హైడ్రా నిర్ధారించుకుంది. క‌బ్జా చేసిన వారిపై రెవెన్యూ అధికారులు కేసులు కూడా పెట్టారు. హైడ్రా క‌మిష‌న‌ర్ శ్రీ ఏవీ రంగ‌నాథ్ గారి ఆదేశాల మేర‌కు మంగ‌ళ‌వారం ఫెన్సింగ్ వేసింది.

అల్వాల్ కొత్త చెరువులో ఆక్ర‌మ‌ణ‌ల తొల‌గింపు

మేడ్చ‌ల్ – మ‌ల్కాజిగిరి జిల్లా అల్వాల్ మండ‌లంలోని అల్వాల్ కొత్త చెరువు 8 ఎక‌రాల మేర ఆక్ర‌మ‌ణ‌ల‌ను హైడ్రా తొల‌గించింది. చెరువు ఎఫ్‌టీఎల్ ప‌రిధిలో ప్లాస్టిక్ కంప్రెసివ్ యూనిట్‌, ప్లాస్టిక్ వ్య‌ర్థాల సేక‌ర‌ణ కార్య‌క‌లాపాలు నిర్వ‌హిస్తూ చెరువును క‌లుషితం చేస్తున్నార‌ని స్థానికులు హైడ్రా ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేశారు. అలాగే అక్క‌డ ప‌ని వారికోసం తాత్కాలిక షెడ్డులు వేసి వ్య‌ర్థాల‌న్నీ చెరువులోకి వ‌దులుతున్నార‌ని పేర్కొన్నారు. చెరువు ఎఫ్‌టీఎల్ ప‌రిధిలోని టెంటు సామ‌గ్రీకి చెందిన 4 ష‌ట్ట‌ర్లు కూడా వేసిన‌ట్టు ఫిర్యాదు చేశారు. హైడ్రా అధికారులు క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలించి చెరువు ఆక్ర‌మ‌ణ‌ల‌ను నిర్ధారించుకున్నారు. చెరువు ఎఫ్‌టీఎల్ ప‌రిధిలో ఎలాంటి క‌ట్ట‌డాలు, నిర్మాణాలు చేయ‌రాద‌నే నిబంధ‌న ప‌ట్ట‌కుండా ఏర్పాటు చేసిన షెడ్డుల‌ను హైడ్రా తొల‌గించింది.

1100ల గ‌జాల మేర పార్కుల‌ను కాపాడిన హైడ్రా

రంగారెడ్డి జిల్లా వ‌న‌స్థ‌లిపురం సాహేబ్‌న‌గ‌ర్ క‌లాన్‌లోని జ‌క్కిడిన‌గ‌ర్ కాల‌నీలో 650 గ‌జాల పార్కు స్థ‌లాన్ని హైడ్రా కాపాడింది. స‌ర్వే నంబ‌రు 132, 133లో 1982లో 12 ఎక‌రాల మేర దాదాపు 161ప్లాట్ల‌తో జ‌క్కిడి కుటుంబ స‌భ్య‌లు లే ఔట్ వేశారు. ఇందులో 650 మేర పార్కుకోసం కేటాయించారు. 1985లోనే దీనిని ప్లాట్లుగా చేసి లే ఔట్ వేసిన వారే అమ్మేశార‌ని స్థానికులు ఫిర్యాదు చేశారు. ఈమేర‌కు ప్ర‌హ‌రీతో పాటు.. రెండు షెడ్డులు నిర్మించారు. ప్ర‌జావాణిలో వ‌చ్చిన ఫిర్యాదు మేర‌కు క్షేత్ర‌స్థాయిలో హైడ్రా ప‌రిశీలించి పార్కు స్థ‌లంగా నిర్ధారించుకుంది.

ఈ మేర‌కు మంగ‌ళ‌వారం ఆక్ర‌మ‌ణ‌లు తొల‌గించి.. పార్కు చుట్టూ ఫెన్సింగ్ వేసింది. పార్కు స్థ‌లంగా పేర్కంటూ హైడ్రా బోర్డులు ఏర్పాటు చేసింది. మ‌ల్కాజిగిరి జోన్‌, మౌలాలి స‌ర్కిల్ ప‌రిధిలోని కాక‌తీయ న‌గ‌ర్‌లో రాథాకృష్ణ హౌసింగ్ కాల‌నీలో 450 గ‌జాల పార్కును హైడ్రా కాపాడింది. జీహెచ్ ఎంసీకి గిఫ్ట్ డీడ్‌గా ఇచ్చిన ఈ పార్కు స్థలాన్ని ఆక్ర‌మించి నిర్మించిన ప్ర‌హ‌రీతో పాటు.. రేకుల షెడ్డును హైడ్రా మంగ‌ళ‌వారం తొల‌గించింది.

ఇవి కూడా చదవండి :

Srisailam : శ్రీశైలంలో శివ భక్తుల గోస..గ్రామోత్సవం రద్దు!
Namrata | వెడ్డింగ్ యానివ‌ర్స‌రీ.. న‌మ్ర‌త షేర్ చేసిన ఎమోష‌న‌ల్ పోస్ట్‌కి అదిరిపోయే రెస్పాన్స్

Latest News