Sugarcane Farming | ఉత్తరప్రదేశ్( Uttar Pradesh )లోని బాగ్‌పట్( Baghpat )కు చెందిన విజయ్ కుమార్ సింగ్( Vijay Kumar Singh ) 2010లో న్యూఢిల్లీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుంచి ఎంబీఏ( MBA )(సేల్స్ అండ్ మార్కెటింగ్) పట్టా పుచ్చుకున్నాడు. ఆ తర్వాత భారతి ఎయిర్‌టెల్, ఉషా ఇంటర్నేషనల్ వంటి కంపెనీల్లో ఉద్యోగం చేశాడు. అయితే 2015లో ఢిల్లీలోని ఇండియా గేట్( India gate ) వద్ద ఏర్పాటు చేసిన ఆర్గానిక్ బజార్ మేళాకు హాజరయ్యాడు విజయ్. నార్త్ ఇండియా నుంచి వచ్చిన రైతులందరూ ఆర్గానిక్ ఉత్పత్తులను ఆ మేళాలో ప్రదర్శించారు. ఆ ఉత్పత్తులను చూసి విజయ్ ఆశ్చర్యపోయాడు. తమ పొలంలో కూడా ఆర్గానిక్ వ్యవసాయ( Organic Farming ) పద్ధతులను పాటించాలని నిర్ణయించుకున్నాడు.
ఇక 2019లో తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు విజయ్. సొంతూరు బాగ్‌పట్‌కు చేరుకున్నాడు. తమ పొలంలో ఆర్గానిక్ వ్యవసాయం చేసేందుకు తండ్రి, తాతను ఒప్పించాడు. చెరుకు తోటలకు ప్రసిద్ధమైన బాగ్‌పట్‌లో తనకున్న రెండెకరాల పొలంలో విజయ్ చెరుకు పంటను( Sugarcane Farming ) వేశాడు. ఆ సమయంలో Co 0238 రకానికి చెందిన చెరుకు పంటను సాగు చేశాడు. ఇందులో షుగర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. అంతేకాకుండా త్వరగా పంట చేతికి అందుతుంది. అయితే మొదటి ఏడాది అనుకున్నంత దిగుబడి రాలేదు. కేవలం 300 క్వింటాల్స్ మాత్రమే దిగుబడి వచ్చింది. ఇందులో 150 క్వింటాళ్లతో బెల్లం తయారు చేశాం. రూ. 2 లక్షలు సంపాదించాం. మిగిలిన 150 క్వింటాళ్ల చెరుకు పంటను రూ. 70 వేలకు విక్రయించినట్లు విజయ్ చెప్పుకొచ్చాడు.
ఇక మరుసటి ఏడాది నేలను సారవంతం చేసేందుకు సిద్ధమయ్యాడు. అందుకు ఆర్గానిక్ ఫర్టిలైజర్స్‌ను వినియోగించాడు విజయ్. జీవామృతం, ఆవుపేడను ఉపయోగించి నేలను సారవంతం చేశాడు. ఈసారి చెరుకు రకాన్ని మార్చాడు. CoS 8272, CoPK 5191 రకాలను ప్లాంటేషన్ చేశాడు. అంతేకాకుండా ప్లాంటేషన్ పద్ధతులను కూడా పూర్తిగా మార్చేశాడు. రింగ్ పిట్ మెథడ్‌లో కల్టివేషన్ ప్రారంభించాడు. ఇది కొంచెం భారంతో కూడిన పని అయినప్పటికీ ఆ పద్ధతినే అవలంభించాడు విజయ్. ఒక్కో రింగ్ పిట్ ద్వారా 25 నుంచి 30 వరకు చెరుకు మొక్కలు పెరిగేలా జాగ్రత్త తీసుకున్నాడు. ఈ రింగ్ పిట్ మెథడ్ ద్వారా మొక్కకు సూర్యరశ్మితో పాటు గాలి పుష్కలంగా లభిస్తుంది. ఇక దిగుబడి అధికంగా ఉంటుంది.
రింగ్ పిట్ మెథడ్ ద్వారా చెరుకు పంటను సాగు చేయడంతో ఈ సారి రెండు ఎకరాలకు గానూ 600 క్వింటాళ్ల దిగుబడిన సాధించాడు. రెండు పర్యాయాలు దీన్ని కోయొచ్చు. 600 క్వింటాళ్ల చెరుకుతో బెల్లం, బెల్లంతో కూడిన డ్రై ఫ్రూట్స్‌ను తయారు చేసి విక్రయించగా రూ. 8 లక్షల ఆదాయం వచ్చింది. ఇందులో రూ. 2 లక్షలు ఖర్చులు పోనూ ఎకరాకు రూ. 3 లక్షల చొప్పున లాభాలు వచ్చాయి. అంటే రెండు ఎకరాల్లో సాగు చేసిన చెరుకు పంటకు రూ. 6 లక్షల ఆదాయం వచ్చింది. ఇది కేవలం ఏడాది కష్టం మాత్రమే అని విజయ్ తెలిపాడు.
