విధాత, ప్రత్యేక ప్రతినిధి: మేడారంలో తిరుగువారం జాతర మంగళవారం ప్రారంభమైంది. మేడారం జాతర ప్రారంభమైన తర్వాత వారం రోజులకు ఈ తిరుగువారం జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. సరిగ్గా వారం క్రితం గత నెల 28వ తేదీన మేడారం జాతర ప్రారంభమై 31వ తేదీన జాతర ముగిసిన విషయం తెలిసిందే. మంగళవారంతో వారం రోజులైనందున తిరుగువారం జాతరను మేడారం వడ్డెలు సంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. మేడారం గద్దెల ప్రాంగణాన్ని శుద్ధిచేసి, అలికి, ముగ్గులు వేసి తమ ఆచారాన్ని కొనసాగించారు. ఇదిలా ఉండగా నాలుగు రోజుల పాటు జరిగే మేడారం జాతరకు వెళ్లలేకపోయామని చింతించే భక్తులకు ఈ తిరుగువారం మరో అవకాశంగా భావిస్తారు. తిరుగువారం సందర్భంగా భక్తులు వనదేవతల దర్శనానికి వెళ్ళడం అనాదిగా వస్తోంది. ఈ క్రమంలోనే మంగళవారం ‘తిరుగు జాతర’కు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తిరుగువారం సందర్భంగా స్థానికంగా మరోసారి భక్తుల సందడి నెలకొంది.
ఇవి కూడా చదవండి :
KTR : కాంగ్రెస్ స్కామ్ ల నుంచి డైవర్షన్ కోసమే సిట్ విచారణ
AIDS | ఎయిడ్స్ తో తెలుగు రాష్ట్రాలలో 44, 140 మృతి!
