KTR : కాంగ్రెస్ స్కామ్ ల నుంచి డైవర్షన్ కోసమే సిట్ విచారణ
సీఎం రేవంత్ రెడ్డి రూ.6వేల కోట్ల 'బినామీ స్కామ్' చేశారని కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ కుంభకోణం నుంచి దృష్టి మళ్లించేందుకే సిట్ విచారణల డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు.
విధాత, హైదరాబాద్ : ‘సీఎం రేవంత్ రెడ్డి బినామీ కంపెనీ కేఎల్ఎస్ఆర్ ఇన్ ఫ్రా( KLSR INFRA)కె రూ.6,000కోట్ల టెండర్ కట్టబెట్టిన వివాదంలో సుప్రీంకోర్టు ఇటీవల నోటీసులు ఇచ్చిందని..దీని నుంచి ప్రజల దృష్టిని మళ్లీంచేందుకే ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ పేరుతో డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. బుధవారం తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న స్కామ్ లు బయటపెడుతున్నప్పుడల్లా డైవర్షన్ రాజకీయాల డ్రామా వేస్తున్నారని మండిపడ్డారు. దివాలా తీసిన సంస్థకు రూ.6వేల కోట్ల టెండర్లు ఇచ్చారు అని..ఇందులో సీఎం రేవంత్‌రెడ్డి బాగోతం బయటపడింది అని, రేవంత్ సీఎం కాదు.. ఆయన్ను ఒకరు నడిపిస్తున్నారు’’ అని కేటీఆర్ ఆరోపించారు. ఈ బినామీ బాగోతాన్ని దాచడానికే ముఖ్యమంత్రి రేవంత్ దావోస్ నుంచి ఆదేశాలు ఇచ్చి విచారణల పేరుతో డ్రామా నడిపించారు అని విమర్శించారు. దివాళా తీసిన కంపెనీకి, నిషేధం ఉన్నా కూడా ఎట్లా కాంట్రాక్ట్ ఇచ్చారు? ఇది క్విడ్ ప్రో కో కాదా? అని కేటీఆర్ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి తిరిగే ల్యాండ్ క్రూజర్ కారు (TS 07 FF 0009) కూడా ఈ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రా పేరు మీదే రిజిస్టర్ అయి ఉంది అని, సుమారు రూ. 2.5 కోట్ల విలువైన కారును బినామీ కంపెనీ ఎందుకు కొనిచ్చిందో చెప్పాలని నేను అడుగుతున్నాను అని, ముఖ్యమంత్రికి కారు ఇచ్చి, ఎన్నికల సమయంలో నిధులు సమర్పించుకుంటే దివాళా కంపెనీకి వేల కోట్ల కాంట్రాక్టులు ఇచ్చారా? ఇది క్విడ్ ప్రో కో కాదా? జవాబు చెప్పాలన్నారు. ఇది రేవంత్ రెడ్డి సొంత వ్యవహారం కాదు, రూ. 6,000 కోట్ల ప్రజా ధనానికి సంబంధించిన భారీ స్కామ్ అన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి ‘బినామీ స్కాం’
సీఎం రేవంత్ రెడ్డి బినామీ కంపెనీ కేఎల్ఎస్ఆర్ కు కాంట్రాక్టులు కట్టబెట్టడం ద్వారా ‘బినామీ స్కాం’ కు పాల్పడ్డాడని కేటీఆర్ ఆరోపించారు. మేం రేవంత్ రెడ్డి ప్రభుత్వం హయాంలో రూ. 1.5 లక్షల కోట్ల దోపిడీకి తెరలేపిన మూసీ ప్రాజెక్టును మేమే అడ్డుకుని ప్రజలను చైతన్యవంతులను చేశాం అని, లగచర్లలో సీఎం అల్లుడి కంపెనీ కోసం గిరిజనుల భూములు లాక్కోవడాన్ని మేం ఎండగట్టి, ఆ స్కామ్‌ను బయటపెట్టాం అని గుర్తు చేశారు. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ పేరుతో జరిగిన రూ. 10 లక్షల కోట్ల భూభాగోతాన్ని మేమే వెలుగులోకి తెచ్చాం అని, ముఖ్యమంత్రి బావమరిదికి సంబంధించిన అమృత్ పథకం కుంభకోణాన్ని ఆధారాలతో సహా మేం బయటపెట్టాం అని కేటీఆర్ తెలిపారు. సింగరేణి బొగ్గు గనులు , సోలార్ టెండర్లలో కాంగ్రెస్ ప్రభుత్వం సాగిస్తున్న భారీ అవినీతిని మేం బహిర్గతం చేశాం అని గుర్తు చేశారు. ఈ క్రమంలోనే జనవరి 22 నుండి మొదలుకొని హరీష్ రావు ని, నన్ను, సంతోష్ ని, చివరకు మా అధినాయకుడు కేసీఆర్ ని విచారణకు పిలవడం మాకు అనుమానం కలిగించింది అన్నారు. ఈ వరుస విచారణల వెనుక ఉన్న అసలు కారణం ప్రజల దృష్టిని మళ్ళించే ‘డైవర్షన్ గేమ్’ అని మాకు అర్థమైంది అన్నారు. ముఖ్యమంత్రి బినామీ భాగోతాన్ని కప్పిపుచ్చడానికే ఈ కవర్ డ్రైవ్‌లు ఆడుతున్నారని మేము గుర్తించాం అన్నారు. మా పరిశోధనలో రేవంత్ రెడ్డికి సంబంధించిన ఒక పెద్ద ‘బినామీ స్కాం’ బయటపడింది అన్నారు.
దివాళ కంపెనీకి టెండర్ తో అక్రమాలు
జనవరి 23న దివాళా తీసిన స్థితిలో ఉన్న KLSR INFRA కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు ఇచ్చింది అని కేటీఆర్ వెల్లడించారు. సుప్రీంకోర్టు స్వయంగా సీబీఐ (CBI), ఈడీ (ED) లేదా ఎస్ఎఫ్ఐఓ (SFIO) ద్వారా స్వతంత్ర విచారణ జరిపించాలని కోరింది అని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా రూ. 6,000 కోట్ల టెండర్లు ఎలా కట్టబెట్టారో చెప్పాలి? అన్నారు. 2018లో రేవంత్ రెడ్డిపై జరిగిన ఐటీ దాడుల్లోనే ఈ KLSR కంపెనీకి నిధులు మళ్లించిన ఆధారాలు దొరికాయి అని కీలక ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి కుటుంబీకుల సంస్థలైన సాయి మౌర్య ఎస్టేట్స్, భూపాల్ ఇన్ఫ్రా వంటి కంపెనీలకు KLSR నుండే డబ్బులు వెళ్లాయి అని పేర్కొన్నారు. 2023 జూలైలో కేఎల్ఎస్ఆర్ (KLSR) అనే కంపెనీకి ఏఎస్ఎంఈటీ (ASMET) అనే కంపెనీకి మధ్యలో గొడవ జరిగితే.. ఇద్దరూ NCLATని అప్రోచ్ అయ్యారు. విచారణ జరుగుతుంది అని తెలిపారు. అయితే KLSR అనే కంపెనీకి అనుకూలంగా తీర్పు ఇవ్వాలని NCLAT జడ్జి శరత్ కుమార్ మొబైల్ కి మెసేజ్ చేశారు అని, ఈ విషయాన్ని స్వయంగా జడ్జి చెప్పి, ఒత్తిడి తట్టుకోలేక పోతున్నానని, నేను తప్పుకుంటున్నానని చెప్పారు అని కేటీఆర్ పేర్కొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి అండతోనే జడ్జిపై ఒత్తిడి
సీఎం రేవంత్ అండ చూసుకునే ఫోన్ మెసేజ్‌లతో జడ్జి మీద ఒత్తిడి తేవడం వల్లనే జస్టిస్ శరత్ కుమార్ విచారణ నుండి తప్పుకోవాల్సి వచ్చింది అని కేటీఆర్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వగానే కేఎల్ఎస్ఆర్ (KLSR) కంపెనీకి రూ.6000 కోట్ల ప్రాజెక్టులు వచ్చాయని అన్నారు. KLSR కంపెనీ దివాళా తీసి కేసు నడుస్తుంది అని, . సిబ్బందికి జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేక బ్యాంక్ నుండి రూ.15 లక్షలు అప్పు తీసుకున్నారు అని తెలిపారు. దివాళా తీసి, ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కూడా పైసలు లేని కంపెనీకి రూ. 6,000 కోట్ల వర్కులు ఎలా వచ్చాయో ? కాంగ్రెస్ ప్రభుత్వం జవాబు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో మనీ లాండరింగ్ జరగకపోతే, బ్యాంకు ఖాతాలన్నీ ఫ్రీజ్ చేసిన తర్వాత కూడా వందల కోట్లు ఎట్లా వచ్చినాయి? ఈ విషయంలో సీఎం పాత్ర ఏంటో తేలాల్సిందేనని, అసలు సీఎంకి, ఈ కంపెనీకి ఉన్న సంబంధం ఏంటో తేలాలని కేటీఆర్ కోరారు.
తక్షణమే ఆ కంపెనీ కంట్రాక్టులు రద్దు చేసి..అత్యున్నత విచారణ జరిపించాలి
క్షణమే సుప్రీంకోర్టు ఆదేశం ఇచ్చిన తర్వాత, తదుపరి మీకు ఏమైనా కనీసం సిగ్గు లజ్జ ఉంటే వెంటనే కేఎల్ఎస్ఆర్ కంపెనీకి ఈ రాష్ట్రంలో ఇచ్చిన ప్రతి కాంట్రాక్టును రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ప్రస్తుతం ఏదైతే వర్క్ జరుగుతోందో, తక్షణమే వాటిని నిలిపేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. దాంతో పాటు సుప్రీంకోర్టు విచారణ పూర్తయ్యే దాకా, సుప్రీంకోర్టు ద్వారా ఆదేశించబడ్డ విచారణ పూర్తయ్యే దాకా ఈ కంపెనీకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రాష్ట్రంలో మరొక్క వర్క్ కూడా ఇవ్వకుండా బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. అసలు ఈ బినామీ బాగోతం వెనకాల ఉన్న వ్యవహారం మొత్తం మీద సీబీఐ (CBI), ఈడీ (ED) లేదా ఎస్ఎఫ్ఐఓ (SFIO).. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వెంటనే రంగంలోకి దిగాలి అని కేటీఆర్ డిమాండ్ చేశారు. తీవ్రమైన అవకతవకలు, ఆర్థిక కుంభకోణం, క్రిమినల్ కుట్ర, అధికార దుర్వినియోగం.. వీటన్నిటి మీద, మనీ లాండరింగ్ మీద ముఖ్యమంత్రి పాత్ర మీద కూడా సీబీఐ, ఈడీ వెంటనే విచారణ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దీని మీద వేగంగా స్పందించాల్సిన బాధ్యత ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మీద ఉందన్నారు.
ఇవి కూడా చదవండి :
Lavanya Tripathi | లావణ్యకి కోపం వచ్చింది.. రిపోర్టర్‌కి గట్టిగా ఇచ్చి పడేసిందిగా..!
Mobile Phone | రాత్రి 7 గంటల తర్వాత చేతిలో మొబైల్ కనిపిస్తే రూ. 500 జరిమానా..!
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram