సమ్మక్క బెల్లాన్ని సర్కారు బడికి ఇవ్వండి…భక్తులకు వందేమాతరం ఫౌండేషన్ వినతి

సమ్మక్కకు సమర్పించిన బెల్లాన్ని సర్కారు బడుల విద్యార్థులకు అందిస్తే రక్తహీనత తొలగుతుందని వందేమాతరం ఫౌండేషన్ కోరింది.

సమ్మక్క బెల్లాన్ని సర్కారు బడికి ఇవ్వండి…భక్తులకు వందేమాతరం ఫౌండేషన్ వినతి

విధాత, ప్రత్యేక ప్రతినిధి: మేడారం జాతర సందర్భంగా వనదేవతలైన సమ్మక్క, సారలమ్మలకు భక్తితో సమర్పించిన ( బంగారం ) బెల్లం పోషకాహారంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందిస్తే తల్లుల ఆశీర్వాదంగా సమాజ సేవగా మారుతుందని వందేమాతం ఫౌండేషన్ అనే సంస్థ కోరింది. సమ్మక్క–సారలమ్మ తల్లుల జాతర ఒక ఆధ్యాత్మిక ఉత్సవం మాత్రమే కాదు. అది తల్లితనం, త్యాగం, ప్రజల శ్రేయస్సు కోసం జరిగే మహా పండుగ. ఇటీవల జరిగిన సమ్మక్క–సారలమ్మ జాతరలో లక్షలాది మంది భక్తులు తల్లులపై అపారమైన భక్తితో పెద్ద ఎత్తున “బంగారం” సమర్పించారు. కానీ ఆ బంగారం నిజానికి లోహం కాదు. భక్తి,విశ్వాసంతో సమర్పించిన బెల్లం. ఈ బెల్లం తల్లులకు భక్తితో సమర్పించుకున్నదంటే దాని అర్థం- “ఇది ప్రజల క్షేమానికి ఉపయోగపడాలి” అన్నదే భక్తుల ఆకాంక్ష. ప్రస్తుతం మన రాష్ట్రంలోని అనేక సర్కారు బడులలో చదువుకునే చిన్నారులు, ముఖ్యంగా బాలికలు రక్తహీనత (అనీమియా) సమస్యతో బాధపడుతున్నారు. దీని వల్ల బలహీనత, అలసట, చదువుపై ఆసక్తి తగ్గిపోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇవి వారి భవిష్యత్తును ప్రభావితం చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో వనదేవతలకు భక్తితో సమర్పించిన బెల్లం – పోషకాహారంగా మారితే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందించితే అది తల్లుల ఆశీర్వాదంగా సమాజ సేవగా మారుతుందని ఫౌండేషన్ భావిస్తోంది. దీని వల్ల మేడారం భక్తుల భక్తి వృథా కాకుండా, తల్లుల జాతరలోని అంతర్గతమైన అంశాన్ని నిలబెట్టేలా, పిల్లల ఆరోగ్యానికి ఉపయోగపడే విధంగా సమ్మక్క–సారలమ్మ జాతరలో సమర్పించిన బెల్లాన్ని ప్రభుత్వ పాఠశాలలకు పంపిణీ చేయాలంటూ ఇది ఒక వినమ్ర విజ్ఞప్తి ఫౌండేషన్ పేర్కొంది. ఇది దానం కాదు, ఇది ధర్మం. ఇది రాజకీయ విషయం కాదు, ఇది ప్రజారోగ్యం, భవిష్యత్తు తరం విషయం. తల్లుల ఆశీర్వాదం పిల్లల ఆరోగ్యంగా మారాలి.భక్తి సేవగా మారాలంటూ పేర్కొన్నారు. వందేమాతరం ఫౌండేషన్ ఆలోచనకు మద్దతుగా మేడారం భక్తులు సహకరించాలని కోరారు.

ఇవి కూడా చదవండి :

Medaram Jatara : మేడారంలో తిరుగువారం జాతర
Jagtial Politics : జగిత్యాల ఎమ్యెల్యే సంజయ్ వర్సెస్ జీవన్ రెడ్డి.. ఆగని మాటల యుద్దం