Jagtial Politics : జగిత్యాల ఎమ్యెల్యే సంజయ్ వర్సెస్ జీవన్ రెడ్డి.. ఆగని మాటల యుద్దం
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, మాజీ మంత్రి జీవన్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం ముదిరింది. మున్సిపల్ టికెట్ల కేటాయింపుతో వివాదం రాజకీయ రచ్చకు దారి తీసింది.
విధాత : జగిత్యాల ఎమ్మెల్యే ఎం. సంజయ్ కుమార్, మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డిల మధ్య మాటల యుద్దం మరింత ముదిరింది. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన సంజయ్ కుమార్.. కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డిపై విజయం సాధించారు. ఎన్నికల అనంతరం సంజయ్ కాంగ్రెస్ లో చేరగా..ఆయన చేరికను సీనియర్ కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఓ దశలో పార్టీకి గుడ్ బై చెప్పేదాకా వెళ్లారు. తాజాగా జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 50 వార్డుల్లో సంజయ్ వర్గానికి 30, జీవన్ రెడ్డి వర్గానికి 20 టికెట్లు కేటాయించడంతో ఇద్దరి మధ్య వైరం మరింత భగ్గుమంది.
మున్సిపల్ ఎన్నికలతో ముదిరిన వివాదం
మున్సిపల్ ఎన్నికల అభ్యర్థుల ఎంపికలో జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రతిపాదనలను అనుసరించి కాంగ్రెస్ అభ్యర్థులను ఖరారు చేయడం దారుణమని మండిపడ్డారు. పార్టీ కోసం ఏళ్ల తరబడి జెండా మోసిన కార్యకర్తల అభిప్రాయం తీసుకుని తాను 50 మంది పేర్లను పంపిస్తే, కేవలం 20 మందికే అవకాశం ఇచ్చారని, మిగిలిన టికెట్లను వలస వచ్చిన వారి కోసం కేటాయించారని విమర్శించారు. జీవితంలో కాంగ్రెస్ జెండా పట్టని వారికి నేడు బీ-ఫామ్‌లు ఇవ్వడం పార్టీని నమ్ముకున్న వారికి వెన్నుపోటు పొడవడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభ్యర్థుల ఎంపికలో పార్టీ సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చారని జీవన్ రెడ్డి ఆరోపించారు. అసలు గాంధీ భవన్‌లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎలా వస్తారని తాను ప్రశ్నిస్తే, తననే క్రమశిక్షణ ఉల్లంఘించిన వాడిగా చూడటం విడ్డూరంగా ఉందంటూ ఆగ్రహం వెళ్లగక్కారు. పార్టీ కోసం కష్టపడిన వారిని కాదని వలసవాదులకు ప్రాధాన్యత ఇవ్వడంపై కాంగ్రెస్ హైకమాండ్ కు ఫిర్యాదు చేశానని తెలిపారు. ఈ వివాదం రగులుతుండగానే స్పీకర్ గడ్డం ప్రసాద్ పార్టీ ఫిరాయింపుల అనర్హత పిటిషన్ వివాదంలో ఎమ్మెల్యే సంజయ్ పార్టీ మారలేదని క్లీన్ చీట్ ఇచ్చింది. స్పీకర్ తీర్పుతో సంజయ్, జీవన్ రెడ్డిల మధ్య మాటల యుద్దం మరో మలుపు తీసుకుంది.
ఈ రోజుకి నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే : సంజయ్
పార్టీ ఫిరాయింపు వివాదంలో అనర్హత పిటిషన్ ను స్పీకర్ కొట్టివేయడంపై స్పందించిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఈరోజుకీ నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ నుంచే నేను ఎమ్మెల్యేగా గెలిచాను అని, నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నాను అని చెప్పారు.
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మరుసటి రోజు నుంచే నేను కాంగ్రెస్ లో చేరినట్లు తప్పుడు ప్రచారాలు మొదలు పెట్టారు అని, నేను మాత్రం ఇప్పటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే ఉన్నానని చెప్పుకొచ్చారు.
అయితే నా సంసారంలో ఎందుకు చిచ్చు పెట్టావు : సంజయ్ కి జీవన్ రెడ్డి కౌంటర్
నేను ఇప్పటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అంటూ సంజయ్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి కౌంటర్ ఎటాక్ చేశారు. స్పీకర్ తీర్పుతో సంజయ్ ఏ పార్టీలో ఉన్నారో ఇప్పటికైనా ఆయనకు గుర్తుకు వచ్చిందని, ఇకనైనా ఒక క్రమశిక్షణ గల పార్టీ నాయకుడిగా రాజ్యాంగ నిబంధనల మేరకు చట్టసభలకు ఎన్నికైనప్పుడు తన విధులు నిర్వహించాలన్నారు. నీ సంసారం నువ్వు చక్కగా చేసుకోకుండా నా సంసారంలో ఎందుకు చిచ్చుపెడుతున్నావు? అంటూ సంజయ్ పై మండిపడ్డారు. స్పీకర్ తీర్పు వచ్చినందునా.. నీ సంసారం నువ్వు చూసుకోవాలని అని హితవు పలికారు. అభివృద్ధి అంటే పక్కింటిలో కన్నం వేయడమా? అని, సీఎం రేవంత్ రెడ్డితో కలిసి 20 నెలలు ప్రయాణం చేశావు అని, నువ్వు చేసిన ఒక్క అభివృద్ధి ఏంటో చెప్పు అని నిలదీశారు.
ఇవి కూడా చదవండి :
AIDS | ఎయిడ్స్ తో తెలుగు రాష్ట్రాలలో 44, 140 మృతి!
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో 14వార్డులు ఏకగ్రీవం !
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram