AIDS | ఎయిడ్స్ తో తెలుగు రాష్ట్రాలలో 44, 140 మృతి!
రాజ్యసభలో వెల్లడైన లెక్కల ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో ఎయిడ్స్‌తో 44,140 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశ మరణాల్లో 25 శాతం వాటా ఇక్కడే.
విధాత : భారత్ లో మరోసారి ఎయిడ్స్ విస్తరిస్తుండటం ఆందోళన రేపుతుండగా.. అందులో తెలుగు రాష్ట్రాలలో వ్యాధి విస్తరణ, మరణాల సంఖ్య అధికంగా ఉండటం మరింత ఆందోళన రేకేత్తిస్తుంది.
రాజ్యసభలో కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గత ఐదేళ్లలో (2020-2024) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి మొత్తం 44,140 మంది ఎయిడ్స్ వ్యాధితో ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా జరిగిన మొత్తం 1.81 లక్షల ఎయిడ్స్ బాధిత మరణాల్లో ఒక్క తెలుగు రాష్ట్రాల వాటాయే 25 శాతంగా ఉండటం గమనార్హం. అంటే దేశంలో చనిపోతున్న ప్రతి నలుగురు బాధితుల్లో ఒకరు తెలుగు రాష్ట్రాల నుంచి ఉండటం పరిస్థితి తీవ్రతను చాటుతుంది. ఏపీలో ఎయిడ్స్‌తో 32,642 మంది మృతి చెందగా… తెలంగాణలో 11, 498 మంది మృతి చెందినట్లుగా కేంద్రం పేర్కొంది. ఒకప్పుడు హెచ్‌ఐవీ నియంత్రణలో ఆదర్శంగా ఉన్న రాష్ట్రాలు ఇప్పుడు మరణాల రేటులో అగ్రస్థానంలో ఉండటం ఆందోళనకరం. వలస కార్మికుల సంఖ్య పెరుగడం, సురక్షితం కాని లైంగిక సంబంధాలు, ఐటీ సెక్టార్ లో విస్తరిస్తున్న విచ్చలవిడి శృంగారం, అన్నింటికంటే ముఖ్యంగా ప్రభుత్వ అవగాహన కార్యక్రమాలు మొక్కుబడిగా సాగడం ఈ మరణాలకు ప్రధాన కారణంగా కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు.
డిసెంబర్ నివేదికలకు భిన్నంగా గణంకాలు
తెలంగాణ రాష్ట్రంలో హెచ్‌ఐవి వ్యాప్తి 2023లో 0.44శాతం నుంచి 2025లో 0.41శాతానికి తగ్గిందని తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంఘం డిసెంబర్ లో వెల్లడించింది. అదే సమయంలో ఎయిడ్స్ సంబంధిత మరణాలు 80శాతం తగ్గాయని పేర్కొంది. తెలంగాణలో ఇప్పటివరకు 1,98,290 మందికి హెచ్‌ఐవి ఉందని తెలిపింది. హెచ్‌ఐవీ నియంత్రణలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచినట్లుగా డిసెంబర్ నివేదిక వెల్లడించింది. హెచ్‌ఐవీ పాజిటివిటీ రేటుతో పాటు ఎయిడ్స్ మరణాలు కూడా 88.72% తగ్గాయని, 2015-16లో 2.34% ఉన్న పాజిటివిటీ రేటు 2024-25 నాటికి 0.58%కు తగ్గిందని పేర్కొంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఎయిడ్స్ కొత్త కేసుల సంఖ్య, మరణాల సంఖ్య గణనీయంగా పెరగడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది.
ప్రపంచంలో రెండో స్థానంలో భారత్
డిసెంబర్ 1న ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన లెక్కల్లో భారత్ లో 25.61 లక్షల ఎయిడ్స్ బాధితులు ఉన్నట్లు తేలింది. వారిలో 13.97 లక్షల మంది పురుషులు.. 11.64 లక్షల మంది స్త్రీలు ఉన్నారు. ఈ గణంకాల మేరకు దక్షిణాఫ్రికా తర్వాత భారత్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద హెచ్ఐవీ బాధితులు ఉన్న దేశం కావడం గమనార్హం. రాష్ట్రాల వారిగా చూస్తే మహారాష్ట్రలో అత్యధికంగా 3.99 లక్షల మంది ఎయిడ్స్ రోగులు ఉండగా.. ఆంధ్రప్రదేశ్‌లో 3.10 లక్షలు, కర్ణాటక 2.91 లక్షలు, తెలంగాణలో 2 లక్షల మంది ఉన్నారు. దేశంలోని మొత్తం బతికి ఉన్న హెచ్ఐవీ రోగుల్లో 74 శాతం మంది కేవలం ఆయా 9 రాష్ట్రాల్లోనే ఉండటం ఆందోళనకరం. అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, మేఘాలయ, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో కొత్త కేసుల సంఖ్య గణనీయంగా పెరగడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది.
కొత్తగా నమోదు అవుతున్న ఎయిడ్స్ కేసుల్లో 73 శాతం లైంగిక సంక్రమణ ద్వారానే వ్యాప్తి చెందుతున్నాయని కేంద్ర నివేదికలో వెల్లడైంది. దేశంలో వయోజనుల హెచ్ఐవీ వ్యాప్తి రేటు 0.20 శాతంగా ఉంది. వార్షిక సంక్రమణ రేటు ప్రతి 1,000 మంది సోకని జనాభాకు 0.05 వద్ద చాలా తక్కువగా ఉంది. 2010 నుండి 2024 మధ్య కాలంలో భారతదేశంలో కొత్త హెచ్ఐవి ఇన్ఫెక్షన్లలో 49 శాతం తగ్గుదల, ఎయిడ్స్ సంబంధిత మరణాలలో 81 శాతం తగ్గింపు నమోదైందని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రి జగత్ ప్రకాష్ డిసెంబర్ నివేదికలో వెల్లడించడం గమనార్హం.
ఇవి కూడా చదవండి :
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో 14వార్డులు ఏకగ్రీవం !
రూ.15లక్షల లంచంతో ఏసీబీకి చిక్కిన జీహెచ్ఎంసీ అధికారి
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram