Minister Staff Controversy | ఆ మంత్రి వద్ద.. సీఎం రేంజ్‌లో సిబ్బంది.. జీతాలూ ఘనంగానే!

ఉమ్మడి ఏపీలో ఒక్కో మంత్రి వద్ద సుమారుగా 15 మంది సిబ్బంది పనిచేస్తూ ఉండేవారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఆ సంఖ్య పెరిగిపోయిందనే వాదనలు ఉన్నాయి. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఒక మంత్రి వద్ద ముఖ్యమంత్రి కంటే ఎక్కువ సిబ్బంది పనిచేస్తున్నారన్న వార్త.. ఇప్పుడు సచివాలయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.

Telangana minister staff controversy

విధాత, హైదరాబాద్:
Minister Staff Controversy |  రాజులు పోయారు… రాజ్యాలు పోయాయి. కానీ తెలంగాణలో రాజరికం మాత్రం అంతకంతకూ పెరుగుతోందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో రాజరికం ఆనవాళ్లను పెంచే పనిలో ప్రజా ప్రతినిధులు ఉన్నారన్న చర్చ సచివాలయ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్నది. సాధారణంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి వద్ద సిబ్బంది అధికంగా ఉంటారు. కానీ.. ముఖ్యమంత్రి రేంజ్‌లో మంత్రులకు సిబ్బంది ఉంటారా? ఉన్నారు!! రాష్ట్ర క్యాబినెట్‌లో ఒక మంత్రికి దాదాపు ముఖ్యమంత్రితో సమానంగా… సుమారు 80 మంది స్టాఫ్‌ ఉన్నారని సచివాలయ వర్గాల చర్చల్లో వినిపిస్తున్నది. ఇందులో సుమారు పది పదిహేను మంది శాశ్వత ఉద్యోగుల కాగా.. మిగిలినవారంతా ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిన నియమితులైనట్టు తెలుస్తున్నది. మంత్రి వద్ద పనిచేసే ఒక్క డ్రైవర్‌కే నెలకు 47,500 రూపాయలు చెల్లిస్తున్నారంటే.. ప్రజాధనం ఎంత దుబారా అవుతుందో స్పష్టమవుతోందని సీనియర్‌ అధికారులు చెబుతున్నారు. ఈ సంగతి కూడా అనుకోకుండా వెలుగులోకి వచ్చినట్టు ఒక అధికారి వెల్లడించారు.

సదరు డ్రైవర్‌కు ఒక నెల జీతం నిలిపివేయడంతో ఆయన సంబంధిత అధికారుల వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశాడు. తనకు జీతం రాకపోవడానికి కారణమేంటో చెప్పాలని కోరాడు. సరేకదా అని ఆ డ్రైవర్‌ వివరాలు పరిశీలించిన అధికారులు.. విస్మయానికి గురయ్యారట. కారణం.. ఆ డ్రైవర్‌కు చెల్లిస్తున్న భారీ జీతం! ఇంత జీతం చెల్లిస్తున్నారా? అని లోలోపల అనుకోవడమే కానీ.. ఏమీ చేయలేని పరిస్థితి ఆయనది!

ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వివాదాస్పద మంత్రిగా పేరొందిన ఆయన తనదైన ప్రత్యేక ఆహార్యంతో వ్యవహరిస్తారు. భవిష్యత్తులో రాష్ట్ర స్థాయి ముఖ్యనేత అవుతానంటూ కలలు కంటున్నారనే చర్చలూ ఉన్నాయి. ముఖ్యమంత్రికి ఏమాత్రం తీసిపోని విధంగా ఆయన వ్యవహారశైలి ఉంటుందని, అందుకే అంతకు మించి తన వద్ద సిబ్బందిని కూడా నియమించుకున్నాడనేది సెక్రటేరియట్‌ వర్గాల మాట. సీనియర్ మంత్రి స్థాయిలో ఉన్న ఆయన వద్ద ఇరవై మంది ముప్పై మంది కాదు మొత్తం ఎనభై మంది వ్యక్తిగత సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారని విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తున్నది. పర్సనల్ సెక్రెటరీలు, ఓఎస్డీలు, అటెండర్లు, వ్యక్తిగత భద్రతా సిబ్బంది పదిహేను మంది వరకు ఉంటారంటున్నారు. వీరు కాకుండా సచివాలయంలో తన పేషీ, తన ఇంటి వద్ద, నియోజకవర్గంలో ఔట్ సోర్సింగ్ సిబ్బంది 65 మంది వరకు పనిచేస్తున్నారని సమాచారం. ఇందులో ఇద్దరు ముగ్గురు రిటైర్డు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారట. వీరందరికీ ప్రతినెలా వేతనాల రూపేణా సర్కార్ రూ.30 లక్షల వరకు చెల్లింపులు చేస్తున్నదని సచివాలయ వర్గాలు పేర్కొంటున్నాయి. వీరు కాకుండా ఇంటి వద్ద, సచివాలయంలో తన పేషీ ముందు విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు అదనం.

ఉమ్మడి రాష్ట్రంలో ఒక మంత్రి వద్ద పది నుంచి పదిహేను మంది వరకు సిబ్బంది విధులు నిర్వహించేవారు. వీరంతా ఇంటి వద్ద, సచివాలయంలో పేషీలో, నియోజకవర్గంలో పనిచేస్తుండేవారు. తెలంగాణలో అడిగేవారు, ప్రశ్నించేవారు లేరనే ఉద్ధేశంతో పలువురు మంత్రులు ఇష్టానుసారంగా సిబ్బందిని నియమించుకుంటూ ప్రభుత్వ ఖజానాకు చిల్లులు పెడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సచివాలయంలో ఇతర విభాగాలలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బందిని పొదుపు చర్యల పేరుతో వారిలో కొందరిని ఇంటికి పంపించారు. పలు ప్రభుత్వ విభాగాలలో పెద్ద ఎత్తున తొలగించారు. అదేమంటే ప్రభుత్వ దుబారాను తగ్గిస్తున్నామని ఆర్థిక శాఖ అధికారులు సమర్థించుకునే ప్రయత్నం చేశారు. కానీ.. ఒక మంత్రి మంత్రి వద్ద సుమారు 80 మంది సిబ్బంది పనిచేస్తున్నారని తెలిసి కూడా చర్యలు తీసుకునే స్థితిలో లేరని సచివాలయంలో జోరుగా చర్చ జరుగుతోంది.

ఈ విషయం బయటకు వచ్చిన డ్రైవర్‌ జీతం సంగతికి వస్తే.. ఆయనకు ప్రతి నెలా రూ.47,500 చెల్లిస్తున్నట్లు తేలింది. ఒక వేళ విధులకు డుమ్మా కొట్టినా కోతలు వేయడం లేదని స్సష్టమైంది. అన్ని తెలుసుకున్న తరువాత, త్వరలో జీతం చెల్లించేలా చూస్తానని చెప్పి డ్రైవర్ ను పంపించివేశారట. వాస్తవానికి ఔట్ సోర్సింగ్ లో పనిచేస్తున్న డ్రైవర్ కు ప్రభుత్వ జీవో ప్రకారం ప్రతి నెలా రూ.19,500 మాత్రమే చెల్లించాలి. ఈ మొత్తాన్ని కాంట్రాక్టు ఏజెన్సీకి ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇందులో పీఎఫ్, ఈఎస్ఐ వంటి మొత్తాలను మినహాయిస్తే డ్రైవర్ చేతికి రూ.17,400 మాత్రమే అందుతుంది. మంత్రి వ్యక్తిగత డ్రైవర్ కావడంతో రూ.26వేలు అదనంగా చెల్లింపులు చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలా ఇతర మంత్రుల వద్ద ఎంత మందికి అదనంగా చెల్లిస్తున్నారో తెలియడం లేదని సచివాలయ ఉద్యోగులు వాపోతున్నారు.

Read Also |

Woman Advocate Murder : మహిళా న్యాయవాది దారుణ హత్య
Air India | ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్ చెప్పిన ఎయిర్ ఇండియా.. రూ.1499కే విమాన టికెట్‌..
MAG7 Job Cuts | ఆ కంపెనీల టెకీలకు ఏఐ సెగ.. లక్షల్లో లేఆఫ్స్‌?

Latest News