- మూడు డీఏలు, పీఆర్‌సీ పెండింగ్
- నాడు గరిష్ఠ వయోపరిమితి 58 సంవత్సరాలు
- అడగకున్నా 61కి పెంచిన బీఆరెస్ సర్కార్
- రిటైర్మెంట్ బెనిఫిట్స్ భారం తప్పించుకునేందుకే!
- రేవంత్ సర్కారు నెత్తికి చేరిన వేల కోట్ల భారాలు
- పదేళ్లలో ఎన్నడూ ధర్నా చేయని ఉద్యోగ నేతలు
- నాడు కాడి ఎత్తేసి.. ఇప్పుడు రెచ్చగొట్టే మాటలు
- మాజీ ఉద్యోగ నేతలపై టీజీవో అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాస్ రావు విమర్శలు
- కేసీఆర్ సర్కారు బకాయిల్లో పది వేల కోట్లు చెల్లించిన కాంగ్రెస్ ప్రభుత్వం
హైదరాబాద్, మే 20 (విధాత):
Government Employees | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సర్కారు నుంచి ఉన్న 30వేల కోట్ల రూపాయలు బకాయి పెట్టిందెవరు? రిటైర్మెంట్ వయో పరిమితిని ఎవరూ అడగకున్నా.. మూడేళ్లు పెంచేసి భారంగా మార్చిందెవరు? పే రివిజన్ కమిషన్ సిఫారసులు అమలు చేస్తామని చెప్పి ఊరించిందెవరు? ఇలా ప్రలోభాలకు గురిచేసి నిండా ముంచి, నేడు లేని ప్రేమను ఒలకబోస్తున్న మాజీ ఉద్యోగ సంఘాల నాయకులు పదేళ్లలో ఏనాడైనా ధర్నా చేశారా? అని ప్రభుత్వ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసి, పబ్బం గడపాలని తాజా మాజీ రాజకీయ ఉద్యోగ నిరుద్యోగులు చూస్తున్నారన్న విమర్శలు ఉద్యోగ వర్గాల్లో వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వంలో ఉద్యోగులకు మూడు డీఏలు, పే రివిజన్ కమిషన్ (పీఆర్‌సీ)ను పెండింగ్‌లో పెట్టారు. పైగా ఉద్యోగులు అడగకున్నా రిటైర్మెంట్ వయస్సు 58 నుంచి 61కి పెంచారు. బీఆర్ఎస్ సర్కార్ దిగిపోయే నాటికి రూ.30వేల కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ బకాయిలు కాంగ్రెస్ సర్కార్‌కు గుదిబండగా మారాయి. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని తెలంగాణ ఉద్యోగ సంఘల జేఏసీ సమ్మెకు నోటీసు ఇవ్వగానే, తాము ఉద్యోగుల పక్షం అంటూ భజన ఉద్యోగ సంఘాల నాయకులతో కాంగ్రెస్ ప్రభుత్వంపై లేనిపోని విమర్శలు చేయిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
రిటైర్మెంట్ బెనిఫిట్స్ తాత్కాలిక వాయిదా కోసమే?
ఉద్యోగుల నుంచి ఎలాంటి రిక్వెస్టు లేకున్నా పదవీ విరమణ వయస్సు 58 నుంచి 61 సంవత్సరాలకు బీఆరెస్ ప్రభుత్వం పెంచింది. వేల మంది ఉద్యోగులు పదవీ విరమణ చేసిన తరువాత వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించాల్సి వస్తుంది. ‘ఎలాగూ మళ్లీ మనమే గెలుస్తాం.. వచ్చాక చూసుకోవచ్చు అనే ధోరణిలో మూడేళ్లు పెంచేశారు. పే రివిజన్ కమిషన్ వేసి, దండిగా వేతనాలు పెంచుతానని ప్రకటించారు. కానీ అమలు చేయలేదు. కరవు భత్యాలను ఇదిగో అదిగో అంటూ సాగదీసి పక్కన పడేశారు. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ సక్రమంగా అమలు కాకుండా గాలికి వదిలేశారు’ అని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాలుగో నెల నుంచి అంటే మార్చి, 2024 నుంచి ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ కావడం మొదలైంది. వీరందరూ కూడా మూడేళ్ల సర్వీసు పెరిగిన వారే కావడం గమనార్హం. జీపీఎఫ్, ఇన్సూరెన్స్, ఇతరత్రా కింద ప్రతి రిటైర్డు ఉద్యోగికి కనీసం రూ.50 లక్షల నుంచి రూ.75 లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఏడాది అవుతున్నా చాలా మందికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందడం లేదని సమాచారం. గత ప్రభుత్వం పీఆర్‌సీ అమలు చేస్తే సాలీనా రూ.5వేల కోట్ల భారం పడుతుందని అంచనా వేసి ఆచుతూచి వ్యవహరించింది. మూడు డీఏలు (కరువు భత్యం) ఇవ్వాల్సి ఉండగా ఇవ్వలేదు. ఈ బకాయిలు రూ.3 వేల కోట్ల దాకా పేరుకుపోయాయి. ఎంప్లాయీస్ హెల్త్ స్కీం బకాయిలు మరో రూ.5వేల కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. రీయింబర్స్‌మెంట్ ఈహెచ్ఎస్ బకాయిల దరఖాస్తులు ఇప్పటికీ సచివాలయంలో గుట్టలు గుట్టలుగా ఉన్నాయని చెబుతున్నారు. ఇలా మొత్తం రూ.30వేల కోట్ల బకాయిలు పెట్టేసింది నాటి బీఆరెస్ ప్రభుత్వం. అయినా అప్పుడు ఏ ఉద్యోగ సంఘం నాయకుడు ఆందోళన చేయలేదు, ధర్నాలకు దిగలేదని ఉద్యోగులు విమర్శిస్తున్నారు.
ఉద్యోగుల సమస్యలతో మీకేం సంబంధం?
బీఆర్ఎస్ ప్రభుత్వంలో పదేళ్ల పాటు వివిధ పదవులు అనుభవించి, పెద్ద ఎత్తున డబ్బులు కూడబెట్టుకుని, ఏనాడు ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల కోసం పోరాడని రాజకీయ నిరుద్యోగ నాయకులు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం విడ్డూరంగా ఉందని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాస్ రావు ఘాటుగా విమర్శించారు. రాజకీయ ఎజెండాతో ఉద్యోగుల సమస్య అంటూ ముసుగు వేసుకుని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగులు మీ వద్దకు ఏమైనా వచ్చారా? మీరేమైనా గుర్తింపు పొందిన సంఘాల నాయకులా? అని ఆయన ప్రశ్నించారు. పదవీ విరమణ చేసిన మీరు ఇంట్లో కూర్చొని కృష్ణా రామా అంటూ భజన చేసుకోకుండా ఇదేంటని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో మీరు చేసింది ఏమీ లేదని, ధర్నాలు చేయలేదని, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ వేయించలేదన్నారు. ఎవరూ పిలవకున్నా ఇప్పుడు ఉద్యోగులపై లేని ప్రేమను ఒలకబోస్తున్నారన్నారు. పదేళ్ల తరువాత తెలంగాణలో సకల ఉద్యోగులను ఏకం చేసి తెలంగాణ జేఏసీ ఏర్పాటు చేశామని, ఇందులో చిన్నా, పెద్దా కలిపి అన్నీ సంఘాలు ఉన్నాయని ఆయన చెప్పారు. ప్రభుత్వానికి, ఉద్యోగుల మధ్య చిచ్చు పెట్టాలనే కుట్రతో మాజీ ఉద్యోగ సంఘాల నాయకులు మీడియా సమావేశం పెట్టారు తప్ప మరో కారణం లేదని ఆయన ఆరోపించారు. ఏమైనా సమస్యలు ఉంటే ప్రభుత్వంతో మాట్లాడుకుంటామని, పరిష్కరించేందుకు ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉందని, ఒకవేళ అవసరమైతే అప్పుడు పిలుస్తామని శ్రీనివాస్ రావు చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం పెట్టిన బకాయిల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.10వేల కోట్ల వరకు చెల్లించిందని, దశల వారీగా చెల్లించేందుకు సంసిద్ధంగా ఉందని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి